గమ్యస్థానానికి చేర్చేది భగవంతుడే !

శ్రీరామానుజాచార్యులవారికి బాల్యం నుంచి కూడా భక్తి శ్రద్ధలు ఎక్కువ. అనునిత్యం ... అనుక్షణం ఆయన ఆ శ్రీరంగనాథుడి గురించే ఆలోచిస్తూ ఉండేవాడు. విద్యాభ్యాస సమయంలోను, తన సందేహాలకు సరైన సమాధానం చెప్పగల గురువులు లభించక ఆయన చాలా అసంతృప్తికి లోనవుతాడు. ఆయన జ్ఞాన దాహాన్ని అర్థం చేసుకోలేని మిగతా శిష్యుల కారణంగా కూడా ఆయన ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.

అలాంటి పరిస్థితుల్లో ఆయన ఆ శిష్యబృందం నుంచి విడిపోయి, తన సందేహాలకు తగిన సమాధానాలు ఇచ్చే గురువు కోసం అన్వేషిస్తూ యాత్రలు చేయడం మొదలుపెడతాడు. ఈ నేపథ్యంలో ఆయన అనేక క్షేత్రాలను దర్శిస్తూ ముందుకు సాగుతుంటాడు. ఇక శ్రీరంగం క్షేత్రానికి చేరుకోవాలనుకుంటూ మార్గమధ్యంలో గల ఒక పాడుబడిన మందిరంలో సేదదీరుతాడు. అదే సమయంలో బోయవారిగా కనిపిస్తోన్న దంపతులు అక్కడికి వస్తారు. తాము శ్రీరంగం వెళుతున్నామని చెప్పి, తమతో రమ్మని కోరతారు. దాంతో వాళ్లతో కలిసి అక్కడి నుంచి బయలుదేరుతాడు రామానుజాచార్యులు.

కొంతదూరం ప్రయాణించిన తరువాత ఆయనకి నీరసం వస్తుంది. కొంతసేపు విశ్రాంతి తీసుకోనిదే తాను నడవలేనని వాళ్లతో చెబుతాడు. అప్పటికే వాళ్లు ఓ అడవీ మార్గంలో వుంటారు. అక్కడి నుంచి శ్రీరంగం చేరుకోవడానికి కూడా చాలారోజులు పడుతుంది. తాము మెలకువతో ఉంటామనీ, విశ్రాంతి తీసుకోమని వాళ్లు అంటారు. దాంతో ఆ బోయ వ్యక్తి తొడపై తలపెట్టి రామానుజాచార్యులు నిద్రలోకి జారుకుంటాడు.

కొంతసేపటి తరువాత మెలకువ వచ్చిన ఆయనకి ఆ దంపతులు కనిపించరు. అదే సమయంలో గుడి గంట వినిపించడంతో ఉలిక్కిపడి వెనుదిరిగి చూస్తాడు. అక్కడి నుంచి ఆయనకి శ్రీరంగం ఆలయశిఖరం కనిపిస్తూ వుంటుంది. ఆ గంట శబ్దం విని ఆయన పులకించిపోతాడు. చాలాకాలం తరువాత ఒక ఆత్మీయుడిని కలుసుకోబోతున్నట్టుగా ఆయన కళ్లలో ఆనంద బాష్పాలు కదలాడతాయి.

బోయ దంపతుల వేషంలో తనతో నడిచినదీ ... శ్రీరంగానికి తనని చేర్చినది ఆ స్వామివారు ... అమ్మవారేననే విషయం ఆయనకి అర్థమైపోతుంది. దాంతో అక్కడి నుంచే ఆలయ శిఖరానికి నమస్కరించుకుంటూ సంతోషంతో స్వామివారి సన్నిధికి చేరుకుంటాడు. అలా రామానుజాచార్యులు శ్రీరంగానికి రావడమే ఆయన జీవితంలో కీలకమైన మలుపుకి నాంది పలుకుతుంది.


More Bhakti News