కర్పూర హారతి

నోములు ... వ్రతాలు ... పూజలు ... ఇలా ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలు ఏవి ప్ర్రారభించినప్పటికీ, ధూప .. దీప .. నైవేద్యాల తరువాత హారతిని సమర్పించడం ఒక నియమంగా వస్తోంది. ఏక హారతి ... పంచ హారతి ... నక్షత్ర హారతి ... ఇలా ఏదైనా, గర్భాలయంలో మసక వెలుతురులో వుండే స్వామివారిని దేదీప్యమానంగా భక్తులకు చూపుతుంది. దైవానికి పట్టిన నీరాజనం కళ్లకి అద్దుకుంటూ భక్తులు పులకించి పోతారు.
అయితే కొంతమంది కర్పూర హారతికి కాస్త దూరంగా ఉంటూ వుంటారు. కర్పూర హారతి కారణంగా వచ్చే పొగని పీల్చడం మంచిది కాదనీ, దాని వలన గొంతు పట్టేస్తుందని అంటూ వుంటారు. మరి కొందరు కర్పూర హారతి నుంచి వెలువడే పొగ కారణంగా తమ పూజా మందిరం మసి బారుతుందని భావిస్తుంటారు. కానీ కర్పూరాన్ని వెలిగించడం ఎంతో మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి.
సాధారణంగా దేవాలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అ సమయంలో గాలి ద్వారా సూక్ష్మ క్రిములు వ్యాపించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ సూక్ష్మ క్రిములను హరించి ... అంటు వ్యాధులు రాకుండా కాపాడటంలో కర్పూర హారతి ప్రధాన పాత్రను పోషిస్తుంది.
ఇక కర్పూరం తన రూపాన్ని మార్చుకుని జ్యోతిగా మారి పరమాత్ముని సన్నిధిలో గాలిలో కలిసిపోతుంది. ఆత్మ ... పరమాత్మలో ఐక్యమైపోతుందనే విషయాన్ని చాటిచెప్పే ఆధ్యాత్మిక పరమైన ఉద్దేశం కూడా ఇందులో అంతర్లీనంగా లేకపోలేదు.









