శ్రీరాముడితో హనుమంతుడి అనుబంధం

శ్రీరాముడితో హనుమంతుడికి గల అనుభంధం ... సీతాన్వేషణలో ఆయన పోషించిన పాత్రను గురించి మాటల్లో చెప్పలేం. సీతను వెదుకుతూ సుగ్రీవుడు ఉన్న ప్రదేశానికి రామలక్ష్మణులు వచ్చినప్పుడు మొదటిసారిగా వాళ్లను హనుమంతుడు చూస్తాడు. శ్రీరాముడి మాటతీరును బట్టి, ఆయన గుణ విశేషాలను తొలి పరిచయంలోనే హనుమంతుడు గ్రహిస్తాడు.

కుటుంబ వ్యవస్థ పట్ల రాముడికిగల అభిమానం ... తల్లిదండ్రులపట్ల ఆయనకిగల ప్రేమ ... సోదరులపట్ల ఆయనకి గల అనురాగం ... ఆయన హృదయంలో భార్యకి గల స్థానం ఎలాంటిదో హనుమంతుడు అర్థం చేసుకుంటాడు. ఆ క్షణం నుంచి ఆయన శ్రీరాముడికి ప్రియ భక్తుడిగా మారిపోయి ఆయన సేవలో అలౌకికమైన ఆనందాన్ని పొందుతుంటాడు.

లోకంలో అందరి కన్నీళ్లను తుడవడానికి అనుక్షణం సిద్ధంగా ఉండే శ్రీరాముడి ఆవేదనను తీర్చే వరకూ తాను విశ్రమించరాదని నిర్ణయించుకుంటాడు. తాను సీతమ్మతల్లి ఆచూకీ తెలుసుకుని తిరిగి వస్తానంటూ రాముడిలో ఆశాభావాన్ని కలిగిస్తాడు. లంకానగరంలో సీతమ్మ వారి జాడ తెలుసుకుని ఆమెకి రాముడి ఉంగరాన్ని చూపించి ఆనందాన్ని కలిగిస్తాడు. రాముడి మనసు కుదుటపడటం కోసం ఆమె చూడామణిని అడిగి తీసుకుంటాడు.

తన శక్తి సామర్థ్యాలు సీతమ్మకి చూపించి, తనకన్నా బలవంతులైన వానరయోధులు ఎంతోమంది రాముడి సేనలో ఉన్నారని చెప్పి ఆమెకి ధైర్యాన్నిస్తాడు. రావణుడి రక్షక సిబ్బందికి చుక్కలు చూపించి, రాముడి సేనలో తానే తక్కువ బలవంతుడినని చెబుతాడు. దాంతో ఇంకెంతటి మహావీరులను తాము ఎదుర్కోవలసి వస్తుందోననే భయాన్ని వాళ్లలో కల్పించి మానసిక బలంపై దెబ్బకొడతాడు.

సీతాదేవిని చూసిన సంతోషంతో తిరిగి రాముడి చెంతకు చేరుకుంటాడు. సీతకి సంబంధించిన సమాచారం కోసం ఎదురుచూస్తోన్న రాముడు, క్షణకాలం పాటు కూడా ఆందోళన చెందకుండా ఉండటం కోసం '' చూసితిని సీతను'' ను అంటూ విషయాన్ని ప్రారంభిస్తాడు. తాను చెబుతోన్న విషయం పట్ల రాముడికి నమ్మకం కలగడం కోసం సీతాదేవి చూడామణిని చూపిస్తాడు. ఆ చూడామణి స్పర్శతోనే శ్రీరాముడు పులకించిపోతాడు.

ఆ తరువాత మేఘనాథుడితో యుద్ధం చేస్తూ కుప్పకూలిపోయిన లక్ష్మణుడిని తిరిగి ఈ లోకంలోకి తీసుకురావడానికి సంజీవిని పర్వతాన్నే హనుమంతుడు పెకిలించుకు వస్తాడు. తనకి ప్రాణసమానులైన సీత ... లక్ష్మణుడు తనకి దక్కేలా చేసిన హనుమంతుడిని ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటాడు రాముడు. హనుమంతుడిని ఆరాధిస్తే సమస్త దేవతలను పూజించిన ఫలితం కలుగుతుందని అనుగ్రహిస్తాడు.


More Bhakti News