పరకాయప్రవేశం చేసిన శంకరుడు

మండన మిశ్రుడు ... ఉభయభారతిలతో వాదనకి దిగుతాడు శంకరాచార్యులు. సమస్త విషయాలపట్ల పరిపూర్ణమైన అవగాహనతో చర్చిస్తోన్న శంకరాచార్యులను వాదనలో వాళ్లు అందుకోలేకపోతారు. శంకరులవారికి ఏ మాత్రం తెలియని కామశాస్త్రం గురించిన ప్రస్తావన తెస్తారు. ఈ విషయానికి సంబంధించిన సమాధానం ఇవ్వడానికి తనకి కొంతసమయం కావాలని అడుగుతాడు శంకరులు. అందుకు వాళ్లు అంగీకరించడంతో శిష్య బృందంతో కలిసి బయలుదేరుతాడు.

మార్గమధ్యంలోనున్న శంకరులవారికి అమరుక మహారాజు చనిపోయాడనే విషయం తెలుస్తుంది. దాంతో ఆయన శరీరంలోకి ప్రవేశించి, కామకళను గురించి తెలుసుకోవాలని శంకరాచార్యులు నిర్ణయించుకుంటాడు. శిష్యులకు ఆ విషయం చెప్పి, తను తిరిగి వచ్చేంత వరకూ తన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళతాడు. మూడవ కంటికి తెలియకుండా ఓ కొండగుహలో ఆయన దేహాన్ని శిష్యులు భద్రపరుస్తారు.

అమరుక మహారాజు దేహంలో శంకరాచార్యులు ప్రవేశించడం వలన ఆయన లేచి కూర్చుంటాడు. రాజుగారు బతికారని భావించిన రాణులు ... పరివారం ... రాజ్య వాసులు ఆనందంతో పొంగిపోతారు. అమరుక మహారాజు శరీరంలో ఉంటూ ఒక వైపున కామకళ గురించి తెలుసుకుంటూ, మరోవైపున సుభిక్షంగా రాజ్యపాలన చేస్తుంటాడు శంకరాచార్యులు. అంతకు ముందు రాజుగారికి లేని అలవాట్లు ... అభిరుచులు చూసి అంతఃపుర వాసులకు సందేహం కలుగుతుంది.

రాజుగారి శరీరంలో ఎవరో యోగి పుంగవుడు ప్రవేశించాడని మంత్రులు పసిగడతారు. అతని శరీరం ఎక్కడో భద్రపరచబడి ఉంటుందని గ్రహిస్తారు. రాజ్యంలో అనాథ శవాలను అన్వేషించి ఎక్కడ శవం కనిపించినా దహన సంస్కారాలు జరిపించమని భటులను ఆదేశిస్తారు. దాంతో గుహలో దాచబడిన శంకరులవారి శరీరం రాజభటుల కంట పడుతుంది. దానిని వారు దహనం చేయడానికి ప్రయత్నిస్తున్నారనే విషయం శంకరుల వారికి తెలిసిపోతుంది.

దాంతో ఆయన అమరుక మహారాజు శరీరాన్ని వదిలి సూక్ష్మ రూపంలో తిరిగి తన శరీరంలోకి ప్రవేశిస్తాడు. మంత్రులు వేసిన పథకం విఫలం కావడం ... కామకళను గురించి తెలుసుకున్న శంకరులువారు తిరిగి మండన మిశ్రుడు - ఉభయభారతిలతో వాదనకి దిగడం జరిగిపోతాయి.


More Bhakti News