గరుడపక్షుల రాకను నిషేధించిన దేవుడు

యాగంటి వంటి కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించినప్పుడు అక్కడ కాకులు అసలు కనిపించవనీ, అందుకు కారణం రుషుల శాపమని చెబుతుంటారు. అలాగే గరుడపక్షులు ప్రవేశించలేని క్షేత్రం కూడా ఒకటుంది. అదే కర్ణాటక ప్రాంతానికి చెందిన 'కుక్కె సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం'. ఈ ప్రాంతంలో ఏడాది పొడవునా ఒక్క గరుడపక్షి కూడా కనిపించక పోవడానికి కారణం సాక్షాత్తు శ్రీ సుబ్రహ్మణ్య స్వామియేనని చెబుతుంటారు.

తారకాసురుడిని సంహరించిన తరువాత తన 'శక్తి' ఆయుధాన్ని కుమారస్వామి ఇక్కడి నదిలో కడిగాడట. ఈ కారణంగా ఈ నదిని 'కుమారధార' పేరుతో పిలుస్తుంటారు. ఇక రాక్షస సంహారం చేసిన పాపాన్ని పోగొట్టుకోవడానికి కుమారస్వామి ఇక్కడి పర్వతంపై తపస్సు చేశాడని అంటారు. అందువలన ఈ పర్వతాన్ని 'కుమార పర్వతం' అని అంటారు. ఇంతటి విశిష్టతను సొంతం చేసుకున్న ఈ క్షేత్రంలోకి గరుడ పక్షులు రాకుండా స్వామివారు నిషేధించడానికి కారణం లేకపోలేదు.

వాసుకి అనే మహా సర్పం కోరికమేరకే సుబ్రహ్మణ్యస్వామి ఈ క్షేత్రానికి వస్తాడు. వాసుకి మాటను కాదనలేకే ఈ ప్రదేశంలో ఆవిర్భవిస్తాడు. అలాంటి వాసుకిని ఒకసారి గరుడపక్షి తరుముతుంటుంది. ప్రాణభయంతో కుమారస్వామిని ఆశ్రయించిన వాసుకి విషయం చెబుతుంది. దాంతో ఇక మీదట వాసుకికి అలాంటి పరిస్థితి రాకూడదని భావించిన కుమారస్వామి, ఆ ప్రదేశంలో గరుడపక్ష్లులు తిరగడానికి వీల్లేదంటూ నిషేధాన్ని విధించాడు. ఆ రోజు నుంచి ఇక్కడికి ఒక్క గరుడపక్షి కూడా రాదని స్థల పురాణం చెబుతోంది.

అయితే పక్షిరాజు ప్రార్ధనమేరకు ... ప్రతి సంవత్సరం 'చంపా షష్ఠి' ఉత్సవరోజున తనని దర్శించడానికి రావచ్చని స్వామి చెప్పాడట. అందువల్లనే స్వామివారి ఉత్సవం జరిగే ఈ రోజున గరుడ పక్షులు గుంపుగా వచ్చి ఆకాశ మార్గంలో ప్రదక్షిణలు చేసి వెళుతుంటాయి. మహిమాన్వితమైన ఈ దృశ్యం చూడటానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. దైవలీలను ప్రత్యక్షంగా చూసి తరిస్తుంటారు.


More Bhakti News