కార్తీక మంగళవారం

స్త్రీల మాటలకు శుద్ధిని కలిగించే నోముగా 'కార్తీక మంగళవారాల నోము' చెప్పబడింది. ఇందుకు కారణమైన కథ ఒకటి వ్రత విధానంలో ప్రధానంగా మనకి కనిపిస్తోంది. పూర్వం ఉజ్జయిని నగరంలో ఓ బ్రాహ్మణ కుటుంబం నివసిస్తూ వుండేది. ఆ బ్రాహ్మణ దంపతుల సంతానమే వైజయంతి. అందచందాలతో పాటు అంతకు మించిన మంచి మనసు ఆమె సొంతం. తన చుట్టుపక్కల వారికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఆమె అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకొని ఊళ్లో వాళ్లకి మంచి చెడులు చెప్పేది.
వైజయంతి కుటుంబ నేపథ్యం ... ఆమె భక్తి శ్రద్ధలు ... మంచితనం గురించి తెలిసిన వారంతా ఆమె ఏది చెబితే అదే చేసే వారు. అయితే ఆమె మంచి జరుగుతుందని చెప్పిన ప్రతి ఒక్కరికీ ... ప్రతి సారి కూడా చెడే జరిగింది. దాంతో వైజయంతి ఎంతో మానసిక క్షోభకి గురైంది. తన భక్తురాలు బాధపడటాన్ని చూడలేకపోయిన పార్వతీదేవి, సదాశివుడితో సహా ప్రత్యక్షమైంది.
వైజయంతి మంచి మనసును ప్రశంసిస్తూ పార్వతీదేవి ఓదార్చింది. కార్తీక మంగళవారాల నోము నోచుకోమంటూ విధి విధానాలను వివరించింది. ఈ నోము నోచుకోవడం వలన 'వాక్ శుద్ధి'కలుగుతుందనీ, ఫలితంగా ఏదైతే చెప్పామో అదే జరుగుతుందని అంది. దాంతో వైజయంతి ఆది దంపతుల పాదాలకు నమస్కరించి, కార్తీక మాసం రాగానే మంగళవారాల నోము పట్టింది.
ఉదయాన్నే స్నానం చేసి పూజా మందిరంలో కుమారస్వామి వెండి ప్రతిమను ఉంచింది. షోడశోపచారాలతో స్వామివారిని పూజించి తీపి పదార్ధాలను నైవేద్యంగా సమర్పించింది. అలా 18 మంగళవారాల పాటు నోము నోచుకుని, ఆ తరువాత బ్రహ్మచారిగానున్న ఓ బ్రాహ్మణుడిని పిలిచి, కుమారస్వామి ప్రతిమతో పాటు వాయన దానమిచ్చింది. అప్పటి నుంచి ఊళ్లో వాళ్ల బాగుకోరి వైజయంతి ఏదైతే చెబుతూ వచ్చిందో, అదే జరుగుతూ ఉండటంతో అందరూ ఆమెను మరింత అభిమానంగా చూసుకోసాగారు.









