దేవతల సరదా నుంచి పుట్టిన ఆచారం

కొన్ని పండుగలు ... పర్వదినాలే కాదు, కొన్ని ఆచారాలు కూడా దేవతల ద్వారా ఆచరణలోకి వచ్చినట్టుగా చెబుతుంటారు. అలాంటి ఆచారాలు పాటించేవారికి ఆనందంగాను ... చూసేవారికి ఆశ్చర్యంగాను అనిపిస్తూ వుంటాయి. అయితే ప్రతి ఆచారం వెనుక ఒక బలమైన విశ్వాసం వుంటుంది కనుక, అందరూ ఆ వేడుకలో పాలుపంచుకుంటూ వుంటారు. అలాంటి చిత్రమైన ఆచారం ఒకటి కర్నూలు జిల్లా 'కైరుప్పల' లో కనిపిస్తుంది.

ఈ క్షేత్రంలో శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రుడు దర్శనమిస్తూ వుంటాడు. వీరభద్రస్వామి ఆవిర్భవించిన విశిష్టమైన క్షేత్రాల్లో ఇది ముందువరుసలో కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఘనంగా ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు చూసి తీరవలసిందే. ఈ సమయంలో 'నుగ్గులాట' పేరుతో వేడుక జరపడం ఇక్కడ ఒక ఆచారంగా వస్తోంది.

భద్రకాళీ అమ్మవారు వీరభద్రుడి దగ్గర తమపెళ్లి విషయాన్ని ప్రస్తావించగా, తనకి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని స్వామి ఆమెని ఆటపట్టించాడట. దాంతో అలిగిన అమ్మవారు తన స్నేహితురాళ్లతో కలిసి స్వామిపై పిడకలు విసిరిందట. వాటి బారి నుంచి తప్పించుకుంటూ స్వామివారు మరికాస్త సందడి చేశాడట. ఈ కథలో నిజానిజాల మాటెలా వున్నా, అమ్మవారి వర్గం ... అయ్యవారి వర్గంగా గ్రామస్తులు విడిపోయి ఒకరిపై ఒకరు పిడకలు విసుకుంటూ వుంటారు.

కాస్త లోతుగా పరిశీలిస్తే చిత్రమైన ఈ ఆచారం వెనుక 'హోలీ' పండుగను గుర్తుచేసే అర్థమే కనిపిస్తుంది. పూర్వం పెళ్లీడు కొచ్చిన వరసైన బావా మరదళ్ల మధ్య చనువు పెరగడం కోసం హోలీ ఆడేవారు. అదే విధంగా వరసైన వారి మధ్య దూరాన్ని తగ్గించడానికీ ... చనువు పెరగడానికి పెద్దలు ఈ వేడుకను ఆధ్యాత్మికతతో ముడిన ఆచారంగా చేసి ఉంటారని చెప్పవచ్చు. ఏదేమైనా ఈ వేడుక గ్రామస్తులందరినీ ఏకంచేసి వారి మధ్య సఖ్యతను పెంచుతుంది. సరదాగా ... సందడిగా సాగిపోతూ సంతోషాల సంబరాలు చేస్తుంది.


More Bhakti News