తరతరాలను అనుగ్రహిస్తోన్న తిరుమలనాథుడు

తిరుమల శ్రీనివాసుడు చక్కని రూపున్నవాడు ... చల్లని చూపున్నవాడు. మనోహరమైన ఆ రూపం ఎంతో మంది మహా భక్తులను కట్టి పడేసింది. ఆ చల్లని చూపు మరెంతో మంది జీవితాలను ధన్యం చేసింది. తిరుమల శ్రీనివాసుడు మంచులాంటి మనసున్న వాడు ... కంచులాంటి రక్షణను కల్పించేవాడు. తనని దర్శించిన ... స్మరించిన ... కీర్తించిన భక్తులను మాత్రమే కరుణించి స్వామి ఊరుకోలేదు. వారి వంశంలోని తరతరాల వారికి తన సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించాడు.

లక్షలాది మంది భక్తులు స్వామి వారిని ఒక్క క్షణం చూసినా చాలనుకుని రోజులుల తరబడి నిరీక్షించే మహా పుణ్యక్షేత్రంలో, మహా భక్తుల వంశీకులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబడుతూ వుండటం సాధారణమైన విషయం కాదు. శ్రీనివాసుడు పుట్టలో నుంచి బయటికి రావడానికి గొల్లవాడైన ఓ పశువుల కాపరి కారకుడవుతాడు. స్వామిని తొలిసారిగా దర్శించుకున్నది అతనే. ఈ కారణంగానే ప్రతి నిత్యం ఉదయాన్నే ఆ గొల్లవాని వంశస్తులు స్వామిని దర్శించుకున్న తరువాతనే మిగతా భక్తుల దర్శనానికి అనుమతుని ఇస్తారు.

ఇక భక్తుడైన 'కుమ్మరి నంబి' తన ఇంటికి విచ్చేసిన స్వామికి కొత్త కుండ పెంకులో సంకటిని సమర్పించుకుని సంతోషంతో పొంగిపోతాడు. ఆయన భక్తికి మెచ్చిన శ్రీ వారు నేటికీ కొత్త కుండ పెంకులోనే నైవేద్యాన్ని స్వీకరిస్తూ వస్తున్నాడు. ఇక వేల కీర్తనలతో తనని ఓలలాడించిన అన్నమయ్యనే కాదు, ఆయన వంశీకులను సైతం స్వామి అనుగ్రహించాడు. ప్రతి ఉదయం తుంబుర పట్టుకుని కీర్తిస్తూ స్వామివారిని అన్నమయ్య వంశీకులే మేల్కొల్పుతుంటారు ... రాత్రికి లాలి పాటలు పాడుతూ నిద్రపుచ్చుతుంటారు.

ఇక తరిగొండ వెంగమాంబ భక్తి పట్ల స్వామికి గల అనురాగం కారణంగా నేటికీ ప్రతి నిత్యం ఏకాంత సేవలో ఆమె పేరుతో 'ముత్యాల హారతి' ఇవ్వడం జరుగుతోంది. ఇక తనకి అంకిత భావంతో ఆభరణాలను ... ఇతర వస్తువులను కానుకగా ఇవ్వాలే గాని వాటిని వదలకుండా ఉపయోగించేలా స్వామి ఏర్పాట్లు చేసుకుంటాడు. స్వామి ఉపయోగించే ఆభరణాలు ... ఆయన సేవకు వాడే వస్తువులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంటాయి.

ఆంగ్లేయ అధికారి అయిన 'సర్ థామస్ మన్రో' చిత్తూరు జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు, స్వామి పట్ల భక్తితో ఓ గంగాళాన్ని కానుకగా సమర్పించుకున్నాడు. ఇప్పుడీ గంగాళాన్ని 'మన్రో గంగాళం' అని పిలుస్తుంటారు. ఆనాటి నుంచి ఈనాటి వరకూ ఈ గంగాళంలో స్వామివారికి ప్రసాదాలు నైవేద్యంగా సమర్పిస్తుంటారు. తన భక్తుల పట్ల స్వామివారికి గల అభిమానానికి ... అనుగ్రహానికి ఇదో నిలువెత్తు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.


More Bhakti News