సర్వ దోషాలను నివారించే రుద్రాభిషేకం

జీవితం పూర్వజన్మ కర్మ ఫలితాలను బట్టి కొనసాగుతూ వుంటుంది. గత జన్మలో చేసిన పాపపుణ్యాలు సుఖదుఃఖాల తీరంవెంట నడిపిస్తూ వుంటాయి. ప్రస్తుతం తాము అనుభవిస్తున్న కష్టాలు ఆ జన్మకి సంబంధించినవని తెలియక, ఈ జన్మలోను తెలిసో తెలియకో పాపాలు ... దోషాలు తమ ఖాతాల్లో చేరిపోవడానికి కారకులవుతుంటారు.

దైవ దూషణ ... నమ్మినవారిని మోసం చేయడం ... ఆకలితో వచ్చినవారిని అవమానపరచడం ... ఇతరుల జీవనాధారంపై దెబ్బకొట్టడం ... మూగజీవుల ఆహారాన్ని నాశనం చేయడం వంటి పాపాలు జన్మజన్మల పాటు వెంటాడుతూనే వుంటాయి. ఈ పాపాలు - దోషాలు వ్యాధుల రూపంలోనూ ... దారిద్ర్యం రూపంలోనూ ... భూత ప్రేతాల రూపంలోనూ వేధిస్తుంటాయి. దాంతో కాలం తమపై పగబట్టిందని వాళ్లు నిరాశా నిస్పృహలకు లోనవుతుంటారు.

ఇలాంటి పాపాలను ప్రక్షాళనం చేసే శక్తి ఒక్క రుద్రాభిషేకానికి మాత్రమే వుందని పురాణాలు చెబుతున్నాయి. అన్ని రకాల దోషాలకు ... పీడించే పాపాలకు రుద్రాభిషేకం విరుగుడులా పనిచేస్తుంది. తరచూ రుద్రాభిషేకంచేసే వారిపైన ... చేయించేవారి పైన నవగ్రహ దోషాలు ప్రభావం చూపలేవు. జీవితాన్ని అతలాకుతలం చేసే పాపాలను హరించడం ... దోషాలను తొలగించడమే కాదు, అపమృత్యు భయాలు కూడా రుద్రాభిషేకం వలన నశిస్తాయి.

రుద్రాభిషేకం వలన పరమశివుడి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఆయన చల్లని చూపు వలన అనారోగ్యాలు దూరమై ఆయుష్షు పెరుగుతుంది. దారిద్ర్యం ... దుఃఖం నశించి సుఖ సంతోషాలు లభిస్తాయి. అందుకే మంచులాంటి మహాశివుడి మనసును కరిగించడానికీ ... కష్టాలతో కొడిబారుతోన్న జీవితాన్ని వెలిగించడానికి రుద్రాభిషేకానికి మించిన ప్రయత్నంలేదని గ్రహించాలి.


More Bhakti News