దాహం తీర్చే హనుమంతుడు

భక్తాగ్రేసరుడిగా భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ప్రభావితం చేసిన హనుమంతుడు, అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించాడు. భక్తాంజనేయుడుగా .. అభయాంజనేయుడుగా .. వీరాంజనేయుడుగా .. ప్రసన్నాంజనేయుడుగా ... దాసాంజనేయుడుగా వివిధ నామాలతో తన భక్తులను అనుగ్రహిస్తూ వస్తున్నాడు.

గ్రహపరమైన పీడల నుంచి ... అనారోగ్యాల బారి నుంచి కాపాడటంలో ఎవరైనా హనుమంతుడి తరువాతనేనని చెబుతుంటారు. అంతే కాకుండా ఎవరైతే హనుమంతుడిని ఆరాధిస్తారో వారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని అంటారు. ఈ కారణంగానే హనుమంతుడి ఆలయాలు అనునిత్యం భక్తులతో రద్దీగా కనిపిస్తుంటాయి. అలా అశేష భక్త జనావళిచే పూజలందుకుంటోన్న హనుమంతుడి క్షేత్రం 'బొర్రగూడెం'లో దర్శనమిస్తుంది.

స్వామి స్వయంభువుగా ఆవిర్భవించిన ఈ క్షేత్రం, కృష్ణాజిల్లా మైలవరం మండలంలో దర్శనమిస్తుంది. ఇక్కడి హనుమంతుడు మహిమాన్వితుడని స్థానికులు చెబుతుంటారు. ఈ ఆలయానికి ముందు నుంచి వెళ్లే వాళ్లు ... వచ్చే వాళ్లు తప్పనిసరిగా ఆగి మరీ స్వామి దర్శనం చేసుకుని వెళుతుంటారు. అలా ఆగని వారు ప్రమాదాల్లో పడుతుంటారని ఇక్కడి వారు అనుభవ పూర్వకంగా చెబుతుంటారు.

ఇక్కడి స్వామి తన దర్శనార్థం వచ్చిన వారికి దాహం తీర్చమని ఓ భక్తుడికి చెప్పాడట. నాటి నుంచి ఆలయ సిబ్బంది అదొక నియమంగా పాటిస్తూ వస్తున్నారు. కాలమేదైనా చల్లని రుచికరమైన మంచినీళ్లు భక్తులకు అందిస్తుంటారు. కొన్ని సంవత్సరాలుగా ఈ నియమం కొనసాగుతూనే వస్తోంది. అందుకే ఇక్కడి స్వామిని దప్పిక తీర్చే హనుమంతుడుగా కొలుస్తుంటారు.

ఇక్కడికి దగ్గరలోనే శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయం దర్శనమిస్తూ వుంటుంది. పెనుగంచిప్రోలులో మాదిరిగానే ఇక్కడ భర్తతో పాటు తిరుపతమ్మ కొలువై కనిపిస్తుంది. అమ్మవారు ఇక్కడ కొలువై ఉండటానికి కారణంగా ఆసక్తికరమైన కథ ఒకటి వినిపిస్తూ వుంటుంది. ప్రతి గురు .. ఆదివారాల్లో అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య అధికంగా వుంటుంది. కంటికి రెప్పలా అమ్మవారు తమని కాపాడుతూ ఉంటుందనీ, కోరిన వరాలను కరుణతో ప్రసాదిస్తుందని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.


More Bhakti News