ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మర్రిచెట్టులో మనసున్న తల్లి

Sat, Oct 19, 2013, 10:01 AM
Related Image సమస్త లోకాలకు తల్లి అయిన జగన్మాత, అపారమైన తన శక్తులకు అనేక రూపాలు కల్పించి, వివిధ ప్రాంతాలలో ఆవిర్భవించింది. తన బిడ్డల ఆలనాపాలన చూసేందుకు గాను, ఊరూరా గ్రామదేవతగా అవతరించింది. గ్రామదేవతగా కూడా అమ్మవారు అనేక నామాలతో కొలువై నిత్యపూజలు అందుకుంటోంది. అలా అమ్మవారు గ్రామదేవతగా ఆరాధించబడుతోన్న క్షేత్రం మెదక్ జిల్లా రాంపూర్ దగ్గరలో దర్శనమిస్తుంది.

సాధారణంగా గ్రామదేవతల మందిరాలు చాలా చిన్నవిగా గట్టుమీదో ... గుట్టమీదో కనిపిస్తుంటాయి. అయితే అందుకు భిన్నంగా ఈ గ్రామంలో అమ్మవారు 'మర్రిచెట్టు' మొదట్లో గల తొర్రలో కొలువై కనిపిస్తుంది. మర్రిచెట్టు తొర్రకి రెండు వైపులా కిందికి దిగి భూమిలో పాతుకుపోయిన మర్రి ఊడలు, ముఖద్వారానికి ఏర్పాటుచేయబడిన బలమైన స్తంభాలుగా కనిపిస్తూ ఆశ్చర్యచకితులను చేస్తుంటాయి.

మర్రిచెట్టు లోపల విశాలమైన ప్రదేశంలో అమ్మవారి మందిరం దర్శనమిస్తూ వుంటుంది. అమ్మవారి ఎదురుగా చాలా పెద్ద పుట్టకూడా వుంటుంది. ఇక్కడి అమ్మవారిని అంతా 'పెద్దమ్మతల్లి'గా కొలుస్తుంటారు. ఒకప్పుడు మర్రిచెట్టు నీడయే ముఖమంటపంలా భక్తులు భావిస్తూ వుండేవారు. ఆలయానికి ఆదరణ పెరుగుతూ వస్తుండటంతో, అందుకు అవసరమైన నిర్మాణాలు జరుగుతున్నాయి.

ఇక్కడి అమ్మవారిని దర్శించడం వలన వ్యాధులు ... బాధలు మటుమాయమైపోతాయని అంటారు. విద్య .. ఉద్యోగం .. వివాహం .. సంతానం .. సౌభాగ్యం .. విషయాల్లో సమస్యలు ఎదుర్కుంటున్న వాళ్లు, ఈ అమ్మవారిని పూజిస్తే వెంటనే ఫలితం కనిపిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. నమ్ముకున్న వారిని అమ్మవారు ఆపదల నుంచి గట్టెక్కిస్తుందనీ, అనారోగ్యాల బారి నుంచి బయటపడేస్తుందని అనుభవపూర్వకంగా చెబుతుంటారు.

గ్రామస్తులంతా అమ్మవారిని ఇలవేల్పుగా భావించి భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. విశేషమైన పుణ్య తిథుల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుపుతుంటారు. ముఖ్యంగా దసరా నవరాత్రులు ... శమీపూజ ఉత్సవం ఇక్కడ ఘనంగా జరుగుతాయి. అత్యధిక సంఖ్యలో భక్తులు ఇక్కడి శమీపూజలో పాల్గొంటారు. అమ్మవారిపట్ల కృతజ్ఞతగా కానుకలు ... మొక్కుబడులు చెల్లిస్తుంటారు.
X

Feedback Form

Your IP address: 67.225.212.107