ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అనంతపద్మనాభ స్వామి

Thu, Jul 11, 2013, 06:04 PM
Related Image తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయ నేలమాళిగలోని అనంతమైన సంపద బయటపడటంతో, ఒక్కసారిగా ఈ క్షేత్రం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. నిర్మాణ పరమైన విశేషాల వల్లనే కాదు ... సంపద కారణంగా కూడా ఈ క్షేత్రం ఇప్పుడు ప్రత్యేకమైన స్థానంలో నిలిచింది. భారతదేశంలోని 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో 12 క్షేత్రాలు కేరళ రాష్ట్రంలో దర్శనమిస్తుంటాయి. వీటిలో అనంతపద్మనాభ స్వామి ఆలయం అగ్రస్థానంలో కనిపిస్తుంటుంది.

శ్రీమన్నారాయణుడు ఇక్కడ అనంత పద్మనాభుడిగా ఆవిర్భవించడానికి గల కారణం స్థల పురాణంగా ఇక్కడ వినిపిస్తుంటుంది. పూర్వం దివాకరముని అనే విష్ణు భక్తుడు స్వామిని ఎంతగానో ఆరాధించేవాడు. ఆయన కోరిక మేరకు స్వామి బాలుడి రూపంలో దివాకర ముని ఇంట్లో తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి ఆ బాలుడి అల్లరి భరించలేక దివాకర ముని విసుక్కోవడంతో, స్వామి అక్కడికి దగ్గరలోని అడవిలోకి పరుగుతీసి ఓ ప్రదేశంలో అనంతశయనుడిగా వెలిశాడు.

ఆ వెనుకే పరిగెత్తుకు వచ్చిన దివాకరముని ... అనంతమైన ఆ రూపాన్ని ఒక్కసారిగా దర్శించడం కష్టంగా వుందనీ, ప్రదక్షిణకి అనుకూలంగా ఆకారాన్ని తగ్గించమని ప్రార్ధించాడట. దాంతో స్వామి తన ఆకారాన్ని తగ్గించి మూడు ద్వారాల ద్వారా తనని దర్శించుకోవాలని చెప్పాడు. మొదటి ద్వారం( తల భాగం ) దగ్గర జరిపే పూజలు శివుడికీ ... రెండవ ద్వారం (నడుము భాగం ) దగ్గర జరిగే పూజలు బ్రహ్మకి ... మూడవ ద్వారం (పాదాలు ) దగ్గర జరిగే పూజలు తనకి చెందుతాయని అన్నాడు.

ఆ మాటలు వింటోన్న దివాకరమునికి అది స్వామి ఆకలితో వుండే సమయమని గుర్తొచ్చింది. అక్కడికి దగ్గరలోని మామిడి చెట్టు నుంచి కొన్ని పిందెలు కోసి ... ఎండు కొబ్బరి చిప్పలో వేసి సముద్రపు నీటిని అందులోకి తీసుకుని వాటిని మెదిపి నైవేద్యంగా సమర్పించాడు. ఇప్పటికి కూడా స్వామికి ఇలాగే నైవేద్యాన్ని సమర్పిస్తుండటం విశేషం. క్రీ. శ.4 వ శతాబ్దంలోనే స్వామివారి ఆలయానికి సంబంధించిన ఆధారాలు వున్నాయి. ఇక ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయం మాత్రం ట్రావెన్ కోర్ రాజ వంశానికి చెందిన మార్తాండ వర్మ నిర్మించాడు.

గర్భాలయంలో ఆదిశేషుడి పడగ నీడలో యోగనిద్రలో వున్న 18 అడుగుల పద్మనాభుడి విగ్రహం దర్శనమిస్తుంది. శంఖు చక్రాలు ధరించిన స్వామికి తల వైపున శివరూపం ... నాభిలోని కమలంలో బ్రహ్మ దేవుడు ... పాదాల చెంత శ్రీదేవి - భూదేవి వుంటారు. ఇక్కడి ఆలయంలోకి అడుగు పెడితే ఆధ్యాత్మిక పరమైన ఒక అద్భుత లోకంలోకి అడుగుపెట్టినట్టుగా వుంటుంది. మహాగోపురం ... విశాలమైన ప్రాంగణం ... పద్మ తీర్థంగా చెప్పుకునే కోనేరు ... ఆశ్చర్య చకితులను చేసే శిల్పకళ స్వామి వైభవానికి అద్దం పడుతుంటాయి.

క్రీ.శ.17 వ శతాబ్దం ప్రధమార్థంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మార్తాండ వర్మ, ఇతర రాజ్యాలపై దండెత్తగా వచ్చిన సంపదలో కొంత భాగాన్ని స్వామికి సమర్పించే వాడు. అలా సంపద పెరిగిపోవడంతో శత్రువుల కన్ను పడింది. దాంతో తన రాజ్యాన్ని ... అధికారాలను ... సమస్త సంపదలను పద్మనాభ స్వామికి అప్పగిస్తున్నానంటూ మార్తాండ వర్మ తన ఖడ్గాన్ని స్వామి పాదాల చెంత ఉంచాడు. తాను నిమిత్త మాత్రుడననీ ... దేవుడి పేరిటే పరిపాలన కొనసాగుతుందని ప్రకటించాడు.

దేవుడి రాజ్యంపైకి దండెత్తడం మహా పాపమని భావించిన శత్రు రాజులు, తమ సంపదలోని కొంత భాగాన్ని కూడా స్వామివారికి కానుకలుగా పంపించారు. అలా నేలమాళిగలోకి అనంతమైన సంపద చేరింది. ఇక సంపద సంగతి అటుంచితే అనంతశయనుడు అడిగినంతనే అనంతమైన వరాలను ప్రసాదిస్తాడని భక్తులలో బలమైన విశ్వాసం వుంది. అందుకే వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. విశేషమైనటు వంటి పర్వదినాల్లో స్వామివారికి జరిగే ఉత్సవాలను చూసి తీరవలసిందే.
X

Feedback Form

Your IP address: 67.225.212.107