ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పూరీ జగన్నాథుడు

Wed, Jul 10, 2013, 03:59 PM
Related Image పూరీలో వెలసిన జగన్నాథస్వామి తన లీలా విశేషాలు ... విన్యాసాలు ఎవరికీ అంతు చిక్కవని నిరూపిస్తూ ఉంటాడు. అంతర్యామి ఆంతర్యం అంత త్వరగా అర్థం కాదు. ఆ లీలా మానుష వేషధారికి ప్రదక్షిణ చేయగలం తప్ప, ఆయన తత్త్వాన్ని గురించిన పరిశోధన మాత్రం చేయలేం. పూరీ క్షేత్రంలో అడుగు పెడితే ఈ విషయం మరింత స్పష్టంగా అర్థమవుతుంది. సాధారణంగా మూలమూర్తులు దేవేరులతో కలిసి దర్శనమిస్తుంటారు. అలాంటిది ఇక్కడి గర్భాలయంలో తన సోదరుడు బలరాముడితో ... సోదరి సుభద్రతో కలిసి జగన్నాథుడు దర్శనమిస్తుంటాడు.

ఇక ఈ విగ్రహాలు రాయితో కాకుండా చెక్కతో చేయడం ... ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి కొత్త చెక్క విగ్రహాలను తయారు చేసి పాతవి ఖననం చేయడం కూడా వింతగా విచిత్రంగా అనిపిస్తూ వుంటుంది. ఇక ఈ మూడు విగ్రహాలను కూడా ఒకే రథంలో కాకుండా, వేరు వేరు రథాలలో ఊరేగించడం కొత్తగా అనిపిస్తుంది. జగాలనేలే జగన్నాథుడి ఉత్సవం శుభ మాసాల్లో కాకుండా శూన్య మాసంగా పిలుచుకునే 'ఆశాడం'లో జరగడం మరో ప్రత్యేకతగా కనిపిస్తుంది.

ఇక ఈ క్షేత్ర ఆవిర్భావం విషయానికి వస్తే ... పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే రాజు అవంతీ నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన అర్థాంగి గుండికాదేవి. ఒకసారి 'నీలమాధవస్వామి' గురించి విన్న రాజు, ఎలాగైనా ఆయనను ప్రత్యక్ష దర్శనం చేసుకోవాలని ఆరాటపడసాగాడు. నీలమాధవస్వామి ఎక్కడ కొలువై వున్నది తెలుసుకోవడం కోసం రాజ పురోహితుడి కుమారుడైన 'విద్యాపతి' బయలుదేరతాడు.

అలా ఓ గ్రామానికి చేరుకున్న ఆయన విశ్వావసు అనే పూజారి ఆశ్రయాన్ని కోరతాడు. ఆ ఇంట్లో ఉంటూ విశ్వావసు కూతురైన 'లలిత'ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ప్రతి రోజు మామగారు వెళుతున్నది నీలమాధవస్వామి ఆలయానికని తెలుసుకుని, తనకి కూడా దానిని చూపించమంటూ పట్టుపడతాడు. దాంతో అతని కళ్లకి గంతలు కట్టి తీసుకువెళతాడు విశ్వావసు. అది వర్షాకాలం కావడంతో ఆ మార్గాన్ని గుర్తించేందుకు ఆవాలు జారవిడుస్తూ వస్తాడు విద్యాపతి. నీలమాధవస్వామి ఆలయాన్ని చూసిన విద్యాపతి పరవశించిపోతాడు.

ఆ తరువాత రాజుగారిని కలుసుకుని ఆ ఆలయాన్ని చూపించడానికి ఆవాల మొక్కలు మొలిచిన దారిలో తీసుకువెళతాడు. అయితే అక్కడ ఏమీ కనిపించకపోవడంతో రాజు ఆత్మహత్య చేసుకోబోతాడు. అప్పుడు స్వామి ... తాను జగన్నాథ ... బలరామ ... సుభద్ర రూపాలలో దర్శనమిస్తాననీ, చక్ర తీర్థంలోకి వచ్చే కొయ్య దుంగను మూడు రూపాలుగా చెక్కించి పూజించ వలసిందిగా చెప్పాడు. అయితే రాజు తెచ్చిన కొయ్య దుంగను సాధారణ శిల్పులు చెక్కలేకపోతారు.

అప్పుడు ఒక బ్రాహ్మణ శిల్పి అక్కడికి వచ్చి తనకి 21 రోజులు సమయమిస్తే తాను ఆ దుంగను విగ్రహాలుగా మలుస్తాననీ, ఈ లోగా ఎట్టి పరిస్థితుల్లోను తన గదికి ఎవరూ రాకూడదని చెబుతాడు. అందుకు అంగీకరించిన రాజు ఆ పనిని ఆ శిల్పికి అప్పగిస్తాడు. అలా పదిహేను రోజులు గడిచాక లోపల నుంచి ఎలాంటి శబ్దాలు రాకపోవడంతో, రాణి ఆ తలుపులను తెరిపిస్తుంది. అంతే అప్పటి వరకూ ఆ విగ్రహాలు చెక్కిన శిల్పి అదృశ్యమై పోగా, ఆ విగ్రహాలు కాళ్లు - చేతులు లేకుండా అసంపూర్ణంగా మిగిలిపోయాయి.

జరిగింది తెలుసుకుని రాజు బాధపడుతుండగా ఆ విగ్రహాలను అలాగే ప్రతిష్ఠించి పూజించమని అశరీరవాణి పలికింది. ఆనాటి సూచనలకు అనుగుణంగా నేటికీ అదే సంప్రదాయాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. శివుడు కొలువుదీరి ఉన్న ఆలయ శిఖరాన్ని చూసినా ... రథంపై ఊరేగుతున్న కేశవుడిని చూసినా పునర్జన్మ అనేది ఉండదని పురాణాలు చెబుతున్నాయి. అందువలన పూరీ రథయాత్రని దర్శించడానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు.

పూరీలో రథయాత్ర ఎంతటి విశిష్టమైనదో ... అన్నప్రసాదం అంత పవిత్రమైనదిగా భావిస్తుంటారు. ఇక్కడ ప్రతి యేడు రథోత్సవానికి రెండు నెలల ముందుగానే చెక్క రథాన్ని తయారుచేస్తారు. అలా తయారు చేసిన రథాన్ని ఒకసారి మాత్రమే ఉపయోగిస్తారు. స్వామి ప్రతి సంవత్సరం రథాన్ని మార్చుకుంటూ, ఈ శరీరమనే రథం శాశ్వితం కాదనీ ... ప్రాణం ఉండగానే పుణ్య కార్యాలు చేయాలనే సత్యాన్ని మానవులకి తెలియజెపుతుంటాడు.
X

Feedback Form

Your IP address: 67.225.212.107