ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వరాలనిచ్చే అన్నవరం

Wed, May 29, 2013, 10:10 AM
Related Image ప్రతిరోజూ సూర్యుడు ఉదయిస్తాడు ... అస్తమిస్తాడు. అయితే ఈ ఉదయానికి ... అస్తమయానికి మధ్య ఎంతోమంది జీవితాలు ఊగిసలాడుతూ వుంటాయి. కష్టాలు ... కన్నీళ్లతో వాళ్లంతా సతమతమైపోతుంటారు.ఈ సమస్యల సుడిగుండంలో నుంచి తమని బయటపడేసే నాథుడెవరో తెలియక గుళ్లూ గోపురాలు తిరుగుతుంటారు. అయితే తన 'వ్రతం' చేసుకుంటే చాలు ... అన్నీ తాను చూసుకుంటానని భక్తులకి హామీ ఇస్తూ 'సత్యదేవుడు' వెలసిన పవిత్ర పుణ్య క్షేత్రమే 'అన్నవరం'.

పచ్చని కొండలతో ప్రకృతి ఒడిలో సేదతీరుతున్నట్టుగా ఈ క్షేత్రం కనిపిస్తుంటుంది. తూర్పు గోదావరి జిల్లాలోని ఈ దివ్య క్షేత్రం ... భక్తులపాలిట కల్పవృక్షం - కామధేనువు అని చెప్పక తప్పదు. ఇక్కడి 'రత్నగిరి' పై కొలువుదీరిన సత్య దేవుడు కొండంత దేవుడై 'వీరవెంకట సత్య నారాయణ స్వామి'గా పూజలను అందుకుంటున్నాడు. అనుకున్నంతనే వరం లభిస్తుందనే కారణంగానే ఈ క్షేత్రానికి 'అన్నవరం' అనే పేరు వచ్చిందని తెలుస్తోంది. ఇక రత్నాకరుడు అనే భక్తుడికి రామావతారంలో ఇచ్చిన మాట కారణంగా విష్ణుమూర్తి ఇక్కడ వెలసినట్టు స్థలపురాణం చెబుతోంది.

ఇప్పుడు 'అన్నవరం'గా పిలవబడుతోన్న ఈ ప్రాంతం ఒకప్పుడు కిర్లంపూడి సంస్థానాధీశులు శ్రీ రాజా వెంకటరామరాయణిం బహద్దూర్ పాలనలో ఉండేదని తెలుస్తోంది. ఈ ఊరిలోని ఓ బ్రాహ్మణుడికి ... అలాగే రాజావారికి స్వామివారు ఒకే రోజు రాత్రి కలలో కనిపించి,రత్నగిరిపైనున్న 'అంకుడు చెట్టు' మొదట్లోని పుట్టలో తాను అర్చామూర్తిగా ఉన్నాననీ, తనని వెలికితీసి పూజాది కార్యక్రమాలను నిర్వహించమని సెలవిచ్చాడు. దాంతో ఇద్దరూ కూడా ఊరి ప్రజల సమక్షంలో ఆ అర్చామూర్తిని బయటకి తీసి వేదమంత్రాలతో సంప్రోక్షణ చేయించారు. కొత్తగా నిర్మించిన పందిరిలోకి స్వామిని మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఆ తరువాత కొంత కాలానికి రాజావారు ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రధాన దేవాలయం రథం ఆకారంలో ఉండేలా చూసుకున్నారు. అందులో సత్య దేవుడు - అనంత లక్ష్మి సమేతుడై దర్శనమిస్తాడు. ఇక ఇదే పీఠంపై ఈశ్వరుడు కూడా కొలువుదీరి ఉండటం విశేషం. ఈ కారణంగానే ఇటు వైష్ణవులు ... అటు శైవులచే పూజాది కార్యక్రమాలను అందుకుంటూ ఈ పుణ్య క్షేత్రం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది.

రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి రావడానికి రవాణా సౌకర్యాలే కాదు ... వచ్చిన తరువాత వసతి సౌకర్యాలు కూడా బాగానే ఉంటాయి. అనునిత్యం జరిగే సేవలతో ... విశేషమైన సంఖ్యలో జరిగే వ్రతాలతో ... అన్నదానాలతో ఇక్కడి వాతావరణం స్వామివారి వైభవానికి అద్దంపడుతూ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతూ వుంటాయి. ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ దశమి నుంచి బహుళ పాడ్యమి వరకూ స్వామివారికి కళ్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక ప్రతి నెలలో వచ్చే మఖ నక్షత్రం రోజు తెల్లవారు జామున సత్యదేవుడు - అనంతలక్షి మూల మూర్తులను పంచామృతాలతో అభిషేకిస్తారు. చాలా పుణ్య క్షేత్రాలలో ప్రసాదంగా లడ్డూను విక్రయిస్తుంటారు. కానీ ఇక్కడ స్వామి వారి ప్రసాదంగా గోధుమనూకతో తయారుచేసిన కేసరి లభిస్తుంది. దేవాలయంలో వందేళ్ల క్రితమే ఖగోళ పరిజ్ఞానంతో తయారు చేయబడిన సూర్య గడియారం ... శ్రీ గోకులం చూడటానికి ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. సామర్ల కోట ... పిఠాపురం ప్రాంతాలు ఇక్కడికి దగ్గరగా వుండటం వలన అక్కడి క్షేత్రాలను కూడా భక్తులు దర్శించి తరించవచ్చు.
X

Feedback Form

Your IP address: 67.225.212.107