ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నారదుడిని పరీక్షించిన సర్పవరం

Wed, May 29, 2013, 06:06 PM
Related Image పంచ భావనారాయణ స్వామి క్షేత్రాలలో 'పాతాళ భావనారాయణ స్వామి క్షేత్రం' ఒకటి. ఈ క్షేత్రం తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడకి అత్యంత సమీపంలో అలరారుతోంది. ఇక రెండవది పశ్చిమ గోదావరి జిల్లాలోని 'పట్టసాచల క్షేత్రం' ... మూడవది కృష్ణా జిల్లాలోని 'భావదేవరపల్లిలోని క్షేత్రం' ... నాల్గొవది గుంటూరు జిల్లా పొన్నూరులో వెలసిన 'సాక్షి భావనారాయణ క్షేత్రం' ... అయిదవది బాపట్లలో వెలసిన 'భావనారాయణ క్షేత్రం'. ఈ పంచభావనారాయణ స్వామి క్షేత్రాలలోని ఆలయాలను ఒకే రాత్రిలో దేవతలు కట్టారని అంటారు. నిర్మాణం పూర్తి కావొస్తుండగా తెల్లవారడంతో మిగతా రాళ్లను అలాగే వదిలి వాళ్లు అదృశ్యమయ్యారు. ఆ తరువాత ఆ స్థానాల్లో నిర్మాణం పూర్తి చేద్దామని ఎవరు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయిందట. దేవతలు వదిలేసినట్టుగా చెబుతోన్న ఆ రాళ్లు ఇప్పటికీ మనకి కనిపిస్తుంటాయి. ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో అలాంటి రాయి కనిపించదు కాబట్టి ఇది నిజంగానే దేవతల నిర్మాణమేననిపిస్తుంది. సర్పాలు ఎక్కువగా వుండటం వలన ఈ ప్రాంతానికి 'సర్పవరం' అనే పేరు వచ్చిందని అంటారు.

ఈ క్షేత్రానికి సంబంధించిన పురాణ సంబంధమైన కథ ఒకటి ప్రచారంలో వుంది. పూర్వం ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుడితో సమావేశమైనప్పుడు విష్ణు మాయ గురించిన ప్రస్తావన వచ్చింది. అందరూ కూడా విష్ణుమాయను కనుగొనడం ఎవరివల్లాకాదనే నిర్ధారణకి వచ్చారు. అయితే అక్కడే వున్న నారదుడు వారితో ఏకీభవించకుండా, అనుక్షణం విష్ణు నామాన్ని జపించే తనకి ఆయన మాయను తెలుసుకోవడం సులభమే అని అన్నాడు. దాంతో ఈ సంగతి కాస్త విష్ణు మూర్తికి తెలిసింది. ఆ తరువాత కొంతకాలానికి నారదుడు భూలోక విహారానికి వెళ్లాడు. సంధ్యావందన సమయం కావడంతో ఓ కొలనులోకి దిగాడు. ఆ నీటిలో మునిగి లేచిన నారదుడు తాను స్త్రీగా మారిపోయినట్టు తెలుసుకుని ఆశ్చర్య పోయాడు. గట్టున పెట్టిన మహతి (వీణ) కానీ ... కమండలం కాని కనిపించకపోవడంతో అయోమయానికి లోనయ్యాడు. నారదుడిగా సర్వ శక్తులను కోల్పోయి ... గతం మరిచిపోయి ఇష్టానుసారంగా తిరగసాగాడు.

ఆ సమయంలోనే స్త్రీ రూపంలో వున్న ఆయనను చూసి మోహించిన పీఠికాపురం ( పిఠాపురం) పాలకుడైన నికుంఠ మహారాజు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత ఆ రాజు శత్రు రాజుల చేతిలో హతంకాగా, స్త్రీ రూపంలో వున్న నారదుడు పారిపోయి అడవుల్లో తిరగసాగాడు. ఆకలితో ఓ చెట్టు నుంచి పండును కోయడానికి ప్రయత్నిస్తూ, అది అందక ఇబ్బంది పడసాగాడు. ఆ సమయంలోనే మారువేషంలో శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చాడు. అక్కడికి దగ్గరలోని కొలనులో స్నానం చేసి వస్తేనే గాని ఆ పండు అందదని చెప్పాడు. దాంతో నారద స్త్రీ కొలనులోకి వంగిన ఓ చెట్టుకొమ్మ పట్టుకుని నీళ్ళలోకి దిగి ఓ మునకవేసింది. అంతే స్త్రీ రూపం పోయి నారద రూపం వచ్చేసింది. కాకపోతే కొమ్మని పట్టుకోవడం వలన తడవని చేతి గాజులు మాత్రం అలాగే వున్నాయి. వాటిన చూసి ఆశ్చర్య పోతూ ఒడ్డుకువచ్చిన నారదుడికి అదంతా విష్ణుమాయ అని అర్థమైంది.దాంతో శ్రీ మహా విష్ణువు అనుగ్రహం కోసం ఈ ప్రదేశంలో పాతాళ భావనారాయణ స్వామిని ప్రతిష్ఠించి వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షం కావడంతో,ఆయన మాయకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిన ఆ ప్రదేశంలో కొలువుదీర వలసిందిగా నారదుడు కోరడంతో, భావనారాయణ స్వామిగా ఆయన అక్కడ వెలిశాడు. ఆ తరువాత రాజ్య లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని స్వామివారికి ఎదురుగా ప్రతిష్ఠించడం జరిగింది.

నారదుడు ముందుగా స్నానం చేసి స్త్రీ రూపాన్ని పొందిన కొలను ... ఆ తరువాత స్నానం చేసి స్త్రీ రూపాన్ని వదిలించుకున్న కొలను నేటికీ ఇక్కడ పక్కపక్కనే దర్శనమిస్తాయి.విశాలమైన ప్రాంగణం ... శిల్ప కళా శోభితమైన గాలి గోపురం ఆహ్లాదాన్ని ... ఆనందాన్ని ... ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ క్షేత్ర మహిమ గురించి శ్రీ నాథుడు తన కావ్యాల్లో ప్రస్తావించాడు. 'వైశాఖ శుద్ధ ఏకాదశి' రోజున స్వామివారికి అంగరంగ వైభవంగా కల్యాణోత్సవం జరపబడుతుంది. శేష ... గజ ... అశ్వ వాహనాలపై ఊరేగే లక్ష్మీ నారాయణులను చూడటానికి భక్తులు ఈ ఉత్సవంలో విశేష సంఖ్యలో పాల్గొంటారు.
X

Feedback Form

Your IP address: 67.225.212.107