ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మంగళగౌరీ వ్రతం

Tue, Jun 11, 2013, 10:36 AM
Related Image భారతీయ స్త్రీలంతా తమ సౌభాగ్యాన్ని సర్వదా కాపాడమంటూ 'సర్వమంగళ' అయిన పార్వతీ దేవిని ప్రతి నిత్యం ప్రార్ధిస్తుంటారు. అందుకు తగినట్టుగానే ఈ నోములు .. వ్రతాలు అన్నీ కూడా సకల శక్తి స్వరూపిణి అయిన పార్వతీ దేవి అనుగ్రహంతో ముడిపడి వుంటాయి. అలాంటి వ్రతాలలో 'మంగళగౌరీ వ్రతం' ఒకటి. వివాహమైన స్త్రీలు ఆ ఏడాది నుంచి అయిదు సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని చేసుకోవలసి ఉంటుంది. ఇక ఈ వ్రత విధానం గురించి ... ఇందుకు కారణమైన కథ గురించి తెలుసుకుందాం.

ఒక పీఠం పై అమ్మవారి చిత్ర పటాన్ని వుంచి కలశ స్థాపన చేసుకోవాలి. ఆచమనం ... గణపతి పూజ తరువాత సంకల్పం చెప్పుకుని కలశారాధన చేయాలి. ఆ తరువాత అమ్మవారిని ఆవాహన చేసి .. అర్ఘ్య పాద్యాలు సమర్పించి .. పంచామృతాలతో అమ్మవారి ప్రతిమకు అభిషేకం చేయాలి. అమ్మవారికి కొత్త వస్త్రములును .. ఆభరణాలను పూవులుగా భావించి సమర్పించాలి. మంగళగౌరిని అష్టోత్తర శతనామావళిచే పూజించి, ధూప .. దీప .. నైవేద్యాలను సమర్పించాలి. ఆ తరువాత ఈ వ్రత విధానానికి కారణమైన కథను చెప్పుకోవాలి.

పూర్వం 'కుండినపురం'అనే గ్రామంలో ధర్మ పాలుడు ... ఆయన భార్య నివసిస్తూ ఉండేవారు. ధర్మబద్ధులై అన్యోన్యంగా నడచుకుంటోన్న ఈ ఆదర్శ దంపతులకు ధనధాన్యాలకు లోటులేదు. కానీ సంతానలేమి వారిని మానసికంగా కుంగదీస్తూ ఉంది. ఒక రోజున బిక్షకి వచ్చిన ఓ సాధువు, మంగళ గౌరిని పూజిస్తే మనసులోని బాధ మటుమాయం అవుతుందని సలహా ఇవ్వడంతో, ఆ దంపతులు అది అమ్మవారి ఆదేశంగా భావించి అలాగే చేశారు.

ప్రత్యక్షమైన అమ్మవారు తన ఆలయ ప్రాంగణంలో ఉన్న మామిడి చెట్టు నుంచి ఒక ఫలాన్ని ప్రసాదంగా తీసుకోమని చెబుతుంది. ఆ ఫలం కోసం ధర్మ పాలుడు ఆ చెట్టు కింద వున్న వినాయకుడి విగ్రహంపై కాలు మోపడంతో, ఆగ్రహించిన వినాయకుడు ఆ దంపతులకు పుట్టబోయే బిడ్డ అల్పాయుష్కుడు అవుతాడనీ, 16 వ యేట పాము కాటు కారణంగా మరణిస్తాడని శపిస్తాడు. అమ్మవారి అనుగ్రహంతో ఆ దంపతులకు ఓ మగబిడ్డ జన్మిస్తాడు. ఆ బిడ్డకి 'శివుడు'అని నామకరణంచేసి, అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తారు. అయితే వినాయకుడి శాపం గుర్తుకు వచ్చినప్పుడల్లా ఆ దంపతులు బాధతో విలవిలలాడిపోసాగారు.

తల్లిదండ్రులు మానసికంగా కుమిలిపోతుండటానికి కారణం తెలుసుకున్న శివుడు ... వారికి ధైర్యం చెప్పి మేనమామతో కలిసి యాత్రలకు బయలుదేరాడు. అలా వాళ్లిద్దరూ ప్రతిష్ఠానపురం చేరుకుని అక్కడే ఓ సత్రంలో బసచేస్తారు. ఆ ఊళ్లోని శ్రీమంతుల కుటుంబానికి చెందిన 'సుశీల'అనే అమ్మాయి మంగళగౌరీ భక్తురాలని శివుడి మేనమామకు తెలుస్తుంది. ఆ యువతితో శివుడు వివాహం జరిపిస్తే, తన మేనల్లుడు శాపం బారినుంచి బయటపడతాడని భావించి,పథకం ప్రకారం వారి వివాహం జరిపిస్తాడు.

ఆ రోజు రాత్రి సుశీల కలలో మంగళగౌరీ కనిపించి జరిగినదంతా వివరించి, మరి కొంచెం సేపట్లో పాముకాటు వలన మరణించనున్న భర్తను కాపాడుకోమని హెచ్చరిస్తుంది. అమ్మవారు చెప్పినట్టుగా చేసి సుశీల తన భర్త ప్రాణాలు కాపాడుకుంటుంది. ఆమెను వెంటబెట్టుకుని తన ఇంటికి తీసుకువెళతాడు శివుడు. అమ్మవారి పట్ల సుశీలకున్న భక్తి తమ కుమారుడికి ఆయువు పోసినందుకు శివుడి తల్లిదండ్రులు ఆనందంతో పొంగిపోతారు. ఆ ఏడాది నుంచి అయిదేళ్ల వరకూ క్రమం తప్పక ప్రతి 'శ్రావణ మంగళవారం' రోజున 'మంగళ గౌరీ వ్రతం' చేసుకుంటూ సుశీల అమ్మవారి అనుగ్రహానికి పాత్రురాలైంది.

ఇక ఈ కథ చెప్పుకోవడం పూర్తయిన తరువాత అమ్మవారికి హారతి ఇచ్చి, అక్షితలను తలపై వేసుకోవాలి. ఆవునెయ్యితో వెలిగించిన వత్తుల నుంచి కాటుక తీసి కళ్లకు పెట్టుకుని, తల్లికీ ... ముత్తయిదు స్త్రీలకు శనగలు వాయనాలు ఇవ్వాలి. ఇక అయిదు సంవత్సరాల పాటు ఈ వ్రతం చేసుకున్నాక ఉద్యాపన చేసుకోవలసి ఉంటుంది.
X

Feedback Form

Your IP address: 67.225.212.107