ap7am logo

లాభాలనిచ్చే లక్ష్మీదేవి

Tue, Dec 03, 2013, 02:32 PM
Related Image సాధారణంగా గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా వ్యవసాయంపైనే ఆధారపడి వుంటాయి. వ్యవసాయం చేయాలంటే ఎంతో కొంత డబ్బు కావాలి. ఆ డబ్బు కోసం రైతులు తమ స్తోమతకి మించి అప్పులు చేస్తుంటారు. ఇంత చేసినా పంటపై లాభాలు వస్తాయనే నమ్మకం లేదు. అయినా నానాతిప్పలు పడి వాళ్లు అప్పులు తీరుస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లోనే తమ ఆర్ధిక పరిస్థితిని మెరుగు పరచమని వాళ్లు దైవాన్ని ప్రార్ధిస్తుంటారు.

అప్పుడు దైవం ఆ మొరను ఆలకిస్తే వాళ్లకి అంతకన్నా ఆనందం ఏముంటుంది? అలాంటి ఆనందాన్ని పొందుతోన్న రైతులు కర్నూలు జిల్లా 'ఉప్పర్ హాల్' లో కనిపిస్తారు. వాళ్ల కష్టాలను తీర్చి కన్నీళ్లను తుడిచిన ఆ దైవం పేరే 'మారెమ్మవ్వ. ఈ గ్రామ ప్రజలను ఆరోగ్య పరంగానే కాదు ... ఆర్ధికంగా కూడా మారెమ్మవ్వ ఆదుకుంటూ వుంటుంది. ఈ గ్రామానికి చెందిన ప్రజలు అమ్మవారి ఆలయంలో వచ్చిన హుండీ ఆదాయంతో, ప్రతియేటా అమ్మవారి ఉత్సవాలు నిర్వహించేవారు.

అలాగే హుండీ ఆదాయాన్ని అమ్మవారి దగ్గర అప్పుగా తీసుకుని ఆమెకి వడ్డీతో సహా చెల్లించాలని నిర్ణయించుకున్నారు. అలా అమ్మవారి ఆశీస్సులతో ఆమె దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బుతో చేసిన వ్యవసాయం వలన అందరికీ ఎన్నడూ లేనంతగా లాభాలు వచ్చాయి. దాంతో వడ్డీతో సహా తాము తీసుకున్న మొత్తాన్ని రైతులు హుండీలో వేశారు. అప్పటి నుంచి గ్రామంలోని వారంతా అమ్మవారి దగ్గర అప్పు తీసుకుని వ్యవసాయం చేయడం ఆనవాయతీగా మారిపోయింది. అలా వ్యవసాయం చేసిన రైతులకు నష్టమనేది తెలియకుండా పోయింది.

రైతులు ఇచ్చే వడ్డీతో ఆలయం అభివృద్ధి చెందుతూ వస్తోంది. అలాగే ఒకప్పుడు వేల రూపాయలను మాత్రమే అప్పుగా ఇచ్చే అమ్మవారు, అనతికాలంలోనే లక్షల రూపాయలను రుణాలుగా ఇచ్చే ఆర్ధిక పరమైన సామర్థ్యాన్ని సంతరించుకుంది. ఈ ప్రాంతంలో కరవు అనేది కనిపించకుండా పోయింది ... నష్టమనేది నామరూపాలు లేకుండాపోయింది. ఇదంతా అమ్మవారి మహిమేనని గ్రామస్తులు ప్రగాఢమైన విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు. మనసున్న మారెమ్మవ్వ తమ పాలిట లాభాలనిచ్చే లక్ష్మీదేవి అంటూ ఆ తల్లికి కృతజ్ఞతలు తెలుపుతుంటారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy