ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శ్రీరామనవమి

Sat, Jun 08, 2013, 02:20 PM
Related Image భారతీయులు జరుపుకునే అతి ముఖ్యమైన పర్వదినాల్లో 'శ్రీరామనవమి'ఒకటి. శ్రీరామనవమి వచ్చిందంటే చాలు, ఎవరికి వారు తమ ఇంట్లో పెళ్లి అన్నట్టుగా హడావిడి చేస్తుంటారు. మామిడి తోరణాలతో ... మంగళ వాద్యాలతో ఆ రోజున ప్రతి ఊరు ఓ పుణ్య క్షేత్రంలా ... ప్రతి వాడా ఓ జాతరలా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సీతారాములు ప్రతి ఒక్కరి మనసులోనూ ... ప్రతి ఊరి హృదయంలోను గుడికట్టుకున్నారు.

సీతారాములను ... దివ్యలోకాల్లో కొలువుండే దేవుళ్లుగా జానపదులు ఎప్పుడూ భావించలేదు. వాళ్లూ తమలా మామూలు మనుషులేననీ ... సత్య ధర్మాలను నిలబెట్టడం కోసం నానాపాట్లు పడ్డారనే అనుకున్నారు. ఆ కారణంగానే వారి పట్ల మరింత ప్రేమానురాగాలను కనబరుస్తూ వచ్చారు. పెద్దవారి ద్వారా రామాయణ కథామృతాన్ని రుచి చూడటం కూడా ఇందుకు ప్రధాన కారణమై ఉండొచ్చు

ఇక ఈ శ్రీరామనవమి రోజున ఉదయాన్నే తలారా స్నానం చేసి .. సంప్రదాయబద్ధమైన కొత్త బట్టలు ధరించి ... పూజా మందిరంతో సహా ఇంటిని శుభ్ర పరచుకుంటారు. వాకిట్లో రంగవల్లులు దిద్ది .. గుమ్మానికి తోరణాలు కట్టి .. గడపకు పసుపు పూసి కుంకుమ బొట్లు పెడతారు. లక్ష్మణుడు ... భరతుడు ... శతృఘ్నుడు మరియు హనుమంతుడుతో కూడిన సీతారాముల చిత్ర పటమును అలంకరించి, శ్రీరామచంద్రుడి అష్టోత్తరమును చదవడం గానీ ... రామాయణంలోని పట్టాభిషేక అధ్యాయాన్ని పారాయణగాని చేస్తారు. నైవేద్యంగా వడపప్పు - పానకాన్ని సమర్పిస్తారు.

ఇక దేవాలయ మంటపంలో ఉత్సవ మూర్తులకు జరిగే కల్యాణం కనుల పండువుగా ఉంటుంది కాబట్టి అక్కడికి చేరుకుంటారు. ఇక్కడ జరిగే భజనలు ... కోలాటాలు భక్తిని ఉత్సాహపు మార్గంలో ఉరకలు వేయిస్తాయి. కల్యాణం పూర్తి అయిన తరువాత స్వామివారి తరఫున గాని ... అమ్మవారి తరఫున గాని కట్న కానుకలు చదివించుకుని, అక్షింతలను తలపై వేసుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయని భావిస్తారు.

అయోధ్యా నగరంలో పుట్టి పెరిగిన ఈ అందాల రాముడు ... ఎందుకు ఇందరి హృదయాల్లో దేవుడై నిలిచాడో ఒకసారి పరిశీలిద్దాం ... అయోధ్యనేలే దశరథ మహారాజు 'పుత్రకామేష్టి యాగం' చేయగా, ఆయన ముగ్గురి భార్యల్లో ఒకరైన 'కౌసల్య' కు శ్రీ రాముడు జన్మించాడు. 'చైత్ర శుక్ల నవమి' తిథిలో పునర్వసు నక్షత్రం నాల్గవ పాదంలో ... కర్కాటక లగ్నంలో శ్రీ మహావిష్ణు అంశతో ఆయన అవతరించాడు. అష్టాక్షరీ మంత్రంలోని రెండవ అక్షరమైన 'రా' ... పంచాక్షరీ మంత్రంలోని రెండవ అక్షరమైన 'మ' కలిసి 'రామ' అయిందనీ ... శివకేశవులకు భేదంలేదని చెప్పడమే రామ నామంలో దాగిన పరమార్ధమని అంటారు.

యవ్వనంలోకి అడుగుపెట్టిన శ్రీరాముడికి జనకమహారాజు కూతురైన జానకీదేవితో వివాహం జరిగింది. రాముడు సమ్మోహనాకారుడు ... సద్గుణ సంపన్నుడు ... మూర్తీభవించిన ధర్మ స్వరూపుడు. ఆయన ఎంతటి పరాక్రమవంతుడో అంతటి శాంతమూర్తి . దయ .. క్షమా ఆయన సహజలక్షణాలు. వీటి కారణంగానే పట్టాభిషేక ప్రస్తావనకి ముందే రాముడు ప్రజలకు చేరువైపోయాడు. రాముడు అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు ప్రజలంతా ఆయనను అనుసరిస్తుంటే సున్నితంగా వారించాడు, లేదంటే ఆ క్షణంలోనే అయోధ్యా నగరం ఖాళీ అయ్యేది.

తండ్రిమాట జవదాటక అరణ్యవాసం చేసిన రాముడు, సీతను అపహరించిన రావణాసురుని సంహరించాడు. సీత నిప్పు లాంటిదని ఈ లోకానికి నిరూపించడం కోసం ఆమెతో అగ్నిప్రవేశం చేయించాడు. రావణుని చెరలో వుండగా తనని విడిపించుకు వెళ్లడం రాముడికి సాధ్యమయ్యే పనేనా? అనే సందేహం సీతకి ఎన్నడూ కలగలేదు. ఎందుకంటే తన భర్తకి తనపైగల ప్రేమానురాగాలు ... ఆయన శక్తి సామర్ధ్యాలు ఆమెకి తెలుసు.

అయోధ్యా రాముడు అన్ని విషయాల్లోనూ ... అందరి విషయాల్లోనూ చెక్కుచెదరని ఆత్మ విశ్వాసాన్ని ఆవిష్కరించాడు. ఆదర్శ వంతమైన కొడుకుగా ... సోదరుడుగా ... భర్తగా ... శిష్యుడుగా ... ప్రభువుగా ధర్మ మార్గాలను అనుసరించి ... ఆచరించి చూపించాడు. ఇక పతివ్రతా ధర్మాన్ని ఎలా పాటించాలనేది సీతమ్మవారు చాటిచెప్పింది. నిజము - నీడ, పాలు - నీళ్లు ఎలా కలిసి పోతాయో అలాగే ఇద్దరూ కలిసి ఆదర్శవంతమైన దంపతులు ఎలా ఉంటారనేది ఈ లోకానికి తెలియజెప్పారు. అందుకే సీతారాములు జనజీవితంలో ఓ భాగమైపోయారు ... ప్రతి హృదయాన్ని విడదీయరాని విధంగా పెనవేసుకుపోయారు.

రావణ సంహారం అనంతరం సీతతో సహా బయలుదేరిన రాముడు, తాను తిరిగిరావడం భరతుడికి ఇష్టమేనని తెలుసుకున్న తరువాతనే అయోధ్యలోకి అడుగుపెట్టాడు. అలా లోకానికే ఆదర్శ ప్రాయమైన ఈ జంటను ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు ... అందరూ అయోధ్యా నగర వాసులమనే భావనతో వారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తారు.
X

Feedback Form

Your IP address: 67.225.212.107