ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తిరుమల తిరుపతి వైభవం

Wed, May 29, 2013, 09:21 AM
Related Image ''వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన,

వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి ''అనంతమైన ఈ బ్రహ్మాండంలో వేంకటాద్రికి సమానమైన పుణ్య క్షేత్రంగానీ, వేంకటేశ్వరస్వామికి సాటిరాగల దైవంగాని ఇటు భూతకాలంలో లేడు ... ఇక భవిష్యత్తులోనూ ఉండబోడు అనేది ప్రశస్తి.వేం - పాపాలను ... కటః - నశింపజేసే వేంకటపతిని తానేనంటూ వెంకటేశ్వరస్వామి వెలసిన పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి. పరమ పావనమైన ఈ పుణ్య క్షేత్రంలో అడుగు పెట్టాలంటే వంద జన్మల్లో చేసుకున్న పుణ్యం వెంట రావాలి. అక్కడ అడుగు పెట్టిన తరువాత మనకి తెలియకుండానే వేయి జన్మల పుణ్య ఫలం దక్కుతుంది. భూలోక వైకుంఠంగా ప్రసిద్ధిగాంచిన మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించాలనీ, స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని మనసారా చూసి తరించాలని అనిపించడం సహజం.

శేషాచలం ... గరుడాచలం ... వేంకటాచలం ... నారాయణాచలం ... వృషభాచలం ... వృషాచలం ... అంజనా చలం అనే ఏడు కొండలపై వెలసిన స్వామి వారు ఏడుకొండల వాడిగా భక్తులకు దర్శన మిస్తున్నారు. ఇక ఈ సౌందర్య మూర్తి , వక్షస్థలమున శ్రీ మహాలక్ష్మిని ధరించినందువలన శ్రీనివాసుడనీ ... తిరుమల కొండలపై కొలువు దీరిన కారణంగా తిరుమలేశుడనీ ... శివ రూపంగా శైవులు భావించిన కారణంగా వెంకటేశ్వరుడనీ ... శాక్తేయులు బాలా త్రిపుర సుందరిగా భావించడం వలన బాలాజీగా ... మొక్కుకుంటే చాలు ఆపదల నుంచి అవలీలగా బయట పడేస్తాడు కాబట్టి ఆపద మొక్కులవాడిగా ఆప్యాయంగా పిలిపించుకుంటూ వున్నాడు.

చుట్టూ పచ్చని చెట్లు ... చల్లని గాలి ... దూరంగా కొండలబారు కనిపించగానే '' కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు ... '' అనే అన్నమయ్య కీర్తన మధురంగా మనసును తాకుతుంది. మేఘాలను ముద్దాడుతూ ఆకాశ మార్గానికి దగ్గరగా చేసే కొండబాటలో నడవడం ఓ అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది.''గోవిందా'' అనగానే లేని శక్తిని ప్రసాదిస్తూ ఆయనే తన భక్తులను ఆలయ సమీపానికి చేర్చే బాధ్యతను తీసుకుంటాడు. కొండంత దైవాన్ని దర్శించడానికి ముందుగా ఆ పక్కనే ఉన్న వరాహస్వామి ఆలయాన్ని దర్శించుకోవాలి. ఆయనను వెంకటేశ్వర స్వామికి ఆది గురువుగా పేర్కొంటారు. గురువు ద్వారా దైవాన్ని దర్శించుకున్నప్పుడు మాత్రమే ఆ దర్శన ఫలం దక్కుతుంది కాబట్టి, సంప్రదాయాన్ని అనుసరించి వరాహ స్వామివారిని దర్శించుకున్న మీదటనే వెంకటేశ్వరస్వామివారి చెంతకు రావాలి. అహంకారాన్ని వదులుకున్న సూచికగా ఆయనకి తలనీలాలు సమర్పించుకుని, శుచిగా ఆ బ్రహ్మాండ నాయకుడిని దర్శించుకోవాలి.

విశాలమైన మాడ వీధులు ... మహా ప్రాకారాన్ని కలిగివున్న వెంకటేశ్వరుడిని చూసేందుకు 'పడికావలి' అనే మహాద్వార గోపురం ద్వారా లోపలికి ప్రవేశిస్తే ... ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఒక చోటునే చూసిన అనుభూతి కలుగుతుంది. ప్రదక్షిణ పూర్వకంగా లోపలికి వెళితే ... స్వామివారికి శ్రీ కృష్ణ దేవరాయలు కట్టించిన 'కృష్ణరాయ మండపం' ... ప్రతిరోజు మధ్యాహ్నం డోలోత్సవం జరిపించే 'అద్దాల మండపం' ... శ్రీ రంగ క్షేత్రంలోని రంగనాయకులవారికి కొంత కాలం పాటు ఆశ్రయం కల్పించిన 'రంగనాయక మండపం' ... స్వామివారు హంసతూలికా తల్పం పై ఊయల ఊగడం కోసం తిరుమల నాయుడు పునరుద్ధరించిన 'తిరుమలరాయ మండపం' ... భక్తుల మొక్కులు చెల్లించుకోవడం కోసం ఏర్పాటు చేయబడిన 'తులాదండం' ... స్వామివారి వైభవాన్ని చాటి చెబుతున్నట్టుగా నిలిచిన 'ధ్వజస్తంభ మండపం' ... తిరుమల క్షేత్ర పాలకుడైన శివుడికి గుర్తుగా 'క్షేత్ర పాలక శిల' ... స్వామివారి సేవల కోసం ఏర్పాటు చేసిన 'నాలుగు కాళ్ల మండపాలు' ... ప్రతి రోజు స్వామివారికి కళ్యాణోత్సవాలు జరిపించే 'శ్రీవివాసుని కల్యాణ మండపం' ... బావి రూపంలో కనిపించే 'విరజా తీర్థం' ... స్వామివారికి ప్రసాదాలు తయారు చేసే 'పడిపోటు' ...ఆలయంలోని మూర్తులకు అవసరమైన పూల మాలలను అందించే 'పూల అర' ... స్వామివారి కోసం ఉపయోగించిన పూల మాలలను (నిర్మాల్యాలను) వేసే 'పూలబావి' ... స్వామివారికి మూడు పూటలా నైవేద్యాలను అందించే 'వగపడి అర' ... ధ్వజ స్తంభానికి ఎదురుగా రెండో ప్రవేశ ద్వారంగా కనిపించే 'వెండి వాకిలి' ... దానిని దాటగానే 'విమాన ప్రదక్షిణం' ... ఆ ఎదురుగా శేషసాయి అయిన 'శ్రీ రంగనాథుడు' ... ఆ పక్కనే 'వరదరాజ స్వామి' ... ప్రధానమైన ఆలయానికి ముఖ మంటపంగా ఉన్న 'ఘంటా మండపం' ... బంగారు వాకిలికి ఎదురుగా ఉన్న 'గరుడ మందిరం' ... బంగారు వాకిలికి ఇరువైపులా ఉన్న 'జయవిజయులు' ... స్వామివారి సన్నిధికి ప్రధాన ద్వారమైన 'బంగారు వాకిలి' ... బాలాలయముగా పిలవబడే 'స్నపన మండపం' ... దానిని దాటగానే ఉండే 'రాములవారి మేడ' ... శ్రీనివాసుని సేవకు సిద్ధంగా ఉండే 'పరివార దేవతలు' ... స్వామివారికి పవళింపు సేవ జరిగే 'శయన మండపం' ... శ్రీవారి ముందుగా ఉండే 'కులశేఖరపడి' (గడప) దాటగానే గర్భాలయంలో వెలసిన దివ్య మంగళ 'మూలమూర్తి' అంగరంగ వైభవంగా దర్శనమిస్తాడు.

'ఆనందనిలయం'లో చిరునవ్వులు చిందిస్తూ శ్రీనివాసుడు కనిపించగానే, మనోహరమైన ఈ సౌందర్యాన్ని చూడటానికి చూపునిచ్చిన ఆ దైవానికి మొదటి సారిగా కృతజ్ఞతలు చెప్పాలనిపిస్తుంది. ఇంత కాలం ఈ స్వామిని విడిచి ఇంత దూరంగా ఎలా ఉండగలిగామనే బాధతో కూడిన ఆలోచన కలుగుతుంది. అనిర్వచనీయమైన ఈ అనుభూతిని తట్టుకోలేని కళ్ళు ... కన్నీటి ధారలతో పవిత్రమవుతాయి. లక్ష్మీపతి అయిన ఆయనను ఏదో ఒక కోరిక కోరుకోవాలని వెళ్లిన ప్రతి ఒక్కరూ ... ''స్వామీ ... నీ కొండకు నడచి రావడానికి కాళ్లు ఇచ్చావు ... నీ దివ్యమంగళ స్వరూపాన్నిచూసి తరించడానికి కళ్ళు ఇచ్చావు ... నీకు నమస్కరించడానికి చేతులనిచ్చావు ... జన్మను చరితార్థం చేయడానికి ఇంత కన్నా కావలసినదేముంటుంది? మా కష్టాల మాటెలా ఉన్నా ... నీ వైభవం మాత్రం ఎప్పటికీ ఇలానే వుండాలి స్వామి '' అని అనుకోకుండా వెనుదిరిగేవారు ఉండరనే చెప్పాలి.

అలా బంగారు వాకిలిలో నుంచి బయటకి వచ్చిన తరువాత 'అంగ ప్రదక్షిణ' మార్గంలో ప్రధాన వంటశాల అయిన 'పోటు'... అందులో ఓ వైపున స్వామివారికి పంపించే నివేదనలను పర్యవేక్షిస్తూ కనిపించే 'వకుళమాత' విగ్రహం ... పోటు పక్కనే 'బంగారు బావి' ... 'నాణాల పరకామణి' ... 'నోట్ల పరకామణి' ... 'చందనపు అర' ... 'విమాన వేంకటేశ్వరుడు' ... 'తాళ్ళపాక అర' ... 'రామానుజుల సన్నిధి' ... 'యోగానరసింహ స్వామి మందిరం' 'పరిమళపు అర' ... 'శ్రీవారిహుండి 'దర్శనమిస్తాయి. చుట్టూ వుండే గుళ్ళను 'చుట్టుగుళ్ళు' అని పిలుస్తూ వుంటారు.


అలా స్వామివారి కరుణా కటాక్ష వీక్షనాలతో మనసును పునీతం చేసుకుని వెనుదిరిగాక స్వామి వారి లడ్డూ ప్రసాదం లభిస్తుంది. స్వామివారు ఎంగిలి చేశారో ... లేదంటే ఆయన అమృత హస్తాలతో స్పర్శించారో తెలియదు గానీ, ఈ ప్రసాదం రుచిని ఇంకెక్కడా చూడలేము. శ్రీవారి అనుగ్రహాన్ని ... ఆత్మీయతని కలిపి చేసిన ఆ ప్రసాదం తిన్న తరువాత గాని మనసు కుదుట పడదు. ఇక ఆధ్యాత్మికతకు అద్దం పడుతూ ఆహ్లాదాన్ని కలిగించే ఇక్కడి స్వామి పుష్కరిణి ... బేడీ ఆంజనేయ స్వామి ఆలయం ... శ్రీవారి పాదాలు ... ఆకాశ గంగ ... పాపనాశనం ... స్వామివారి ప్రవేశ ద్వారంగా చెప్పబడుతోన్న 250 కోట్ల సంవత్సరాలనాటి 'శిలాతోరణం' చూసి భక్తులు తరించవచ్చు. కలియుగ ఆరంభంలో అవతరించిన వెంకటేశ్వర స్వామి కోసం నారాయణ వనం అధిపతులు ఆకాశరాజు ... తొండమాన్ చక్రవర్తి ... పల్లవ రాణి పెరుందేవి విజయనగర రాజులు నిరంతరం ఆయన సేవలలో పాల్గొంటూ తగు రీతిలో నిర్మాణాలు చేపట్టారు. శ్రీ కృష్ణ దేవరాయలు కూడా స్వామివారికి అపర భక్తుడై ఆరాధించారు. తన దేవేరులతో కలిసి 7 సార్లు స్వామివారిని దర్శించుకుని అమూల్యమైన కానుకలను స్వామివారికి సమర్పించారు.

ఇక నిత్యోత్సవ ... వారోత్సవ ... పక్షోత్సవ ... మాసోత్సవ ... సంవత్సరోత్సవాలతో నిత్య కల్యాణం ... పచ్చతోరణంగా వెలుగొందుతోన్న వెంకటేశ్వర స్వామిని, అన్నమయ్య ... తిరుమల నంబి ... కురువనంబి ... అనంతాచార్యులు ... తరిగొండ వెంగమాంబ ... హథీ రామ్ బావాజీ వంటి ఎందరో భక్త శిఖామణులు స్మరిస్తూ తరించారు. వారినే కాకుండా వారి వంశీకులను సైతం అనుగ్రహించిన స్వామివారి లీలా విశేషాలను గురించి తెలుసు కోవడానికి ఒకరోజు ... చెప్పుకోవడానికి ఒక పేజీ సరిపోవు. అందుకే తిరుమల స్థల ప్రాశస్త్యం ... స్వామివారి ఆవిర్భావం ... అనునిత్యం ఆయనకు జరిగే సేవలు ... ఉత్సవాలు ... నివేదనల విశేషాలతో పాటు, స్వామివారికి ప్రభువులు సమర్పించిన కానుకల వివరాలు ... ఆయన సేవలో తరించిన భక్తుల జీవిత విశేషాలను ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ముందుకు సాగుదాం ... !
X

Feedback Form

Your IP address: 67.225.212.107