ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మలేసియా... మరచిపోలేని పర్యాటక ప్రదేశం

Sat, Mar 26, 2016, 08:44 PM
Related Image

ప్రపంచ పర్యాటకులను అధిక సంఖ్యలో ఆకర్షిస్తున్న మలేసియాలో... చూడచక్కని అందమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఇది ఆసియాలో ప్రముఖ పర్యాటక దేశం. రాజధాని కౌలాలంపూర్ సందర్శకులకు విశ్వ నగరం అనుభూతిని పరిచయం చేస్తుంది. 451 మీటర్ల ఎత్తులో ఉండే పెట్రోనాస్ టవర్లు ప్రత్యేక ఆకర్షణ. 

హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ కు విమాన టికెట్ ధరలు 10వేల రూపాయల నుంచి ప్రారంభం అవుతున్నాయి. అదే విశాఖ నుంచి అయితే కేవలం 5 వేల రూపాయలకే వెళ్లవచ్చు. చెన్నై నుంచి 8 వేల రూపాయలు, బెంగళూరు నుంచి 17వేల రూపాయలు చార్జీ ఉంటుంది. హోటల్ లో విడిదికి గాను ఒక రోజుకు 1500 రూపాయల వ్యయం అవుతుంది. హోటల్ ను బట్టి ఈ బడ్జెట్ పెరుగుతుంది. 

ఆహారం చౌకే

భారతీయ ఆహారం ప్రారంభ ధర 80 రూపాయలు. అక్కడకు వెళ్లిన తర్వాత స్థానికంగా బస్సుల్లో ప్రయాణించాలంటే టికెట్ ధర రెండు రింగిట్స్ (ఒక రింగిట్ 16 రూపాయలకు సమానం). ట్యాక్సీ తీసుకుంటే మూడు రింగిట్స్ ప్రారంభ చార్జీ. ప్రతి కిలోమీటర్ కు ఒకటిన్నర రింగిట్ వసూలు చేస్తారు. ఒక గంట వేచి ఉండాలంటే 25 రింగిట్స్ చెల్లించుకోవాలి. ఒక అంచనా ప్రకారం మలేసియాలో జీవన వ్యయం భారత్ లో కంటే 65 శాతం అధికంగా ఉంటుంది. కోక్, పెప్సీ కావాలంటే 330 మిల్లీ లీటర్ల బాటిల్ 2.25 రింగిట్స్ చెల్లించాలి. ఇదే పరిమాణంలో తాగే నీటి కోసం 1.34 రింగిట్స్ వెచ్చించాలి.  

టూర్ ప్యాకేజీలు

మూడు రాత్రులతో కూడిన నాలుగు రోజుల పర్యటనకు థామస్ కుక్ 52,600 చార్జ్ చేస్తోంది. కౌలాలంపూర్ లో దిగిన తర్వాత  స్థానిక ప్రతినిధి సాదర స్వాగతంతో హోటల్ కు తీసుకెళతారు. రీఫ్రెష్ అయిన తర్వాత పుత్రజయలో పర్యటన, మధ్యాహ్నం తర్వాత నగర సందర్శన ఉంటుంది. జాతీయ మసీదు, జాతీయ స్మారక చిహ్నం, పెట్రోనాస్ జంట టవర్లు, పార్లమెంట్ భవనం, రాజప్రాసాదంలో ఫొటో ప్రదర్శన, చైనా ఆలయాల సందర్శన ఉంటాయి. రెండో రోజు జెంటింగ్ హైలాండ్స్, బటు గుహలను సందర్శించవచ్చు. మూడో రోజు విశ్రాంతి లేదంటే ప్లాన్ ప్రకారం సందర్శనకు వెళ్లవచ్చు. నాలుగోరోజు తిరుగు ప్రయాణం. 

కౌలాలంపూర్, సన్ వే లాగూన్ పార్క్ పర్యటన ప్యాకేజీని యాత్రా సంస్థ 32,990 రూపాయలకు ఆఫర్ చేస్తోంది. విమాన ప్రయాణం, హోటల్లో బస, పరిమిత ఉచిత సైట్ సీయింగ్, అల్పాహారం చార్జీలు కూడా వీటిలో కలిసే ఉంటాయి. నాలుగు రోజుల కౌలాలంపూర్ స్పెషల్ ప్యాకేజీని మేక్ మై ట్రిప్ సంస్థ 37,594 రూపాయలకు అందిస్తోంది. ఇందులో భాగంగా జెంటింగ్ హైలాండ్స్, కౌలాలంపూర్ నగర పర్యటన ఉంటుంది. ఇదే సంస్థ ఆరు రోజుల మలేసియా ప్యాకేజీని 40,300 రూపాయలకు అందిస్తోంది. కౌలాలంపూర్, జెంటింగ్ హైలాండ్స్, సన్ వే లాగూన్ సందర్శనకు తీసుకెళతారు. థామస్ కుక్ సంస్థ బాలి, కౌలాలంపూర్ తో కూడిన ఏడు రోజుల ప్యాకేజీని కేవలం 25,229 రూపాయలకే అందిస్తోంది. 

సందర్శనీయ ప్రదేశాలు

బటు కేవ్స్: గుహలతో కూడిన పర్వతం. హిందూ దేవాలయాలతో ఉన్న ఈ పర్వతం ముందు భాగంలో పెద్ద సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంటుంది. వెనుక భాగంలో మెట్లు ఉంటాయి. 272 మెట్లను ఎక్కితే పర్వతం పై భాగానికి చేరుకోవచ్చు.  సున్నపురాయితో కూడిన ఇక్కడి గుహలు అనిర్వచనీయ అనుభూతిని అందిస్తాయి. 

జెంటింగ్ హైలాండ్స్: ఇదో శీతల ప్రాంతం. 2000  మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతానికి ఆహ్లాదం కోసం ఎక్కువగా స్థానికులు వస్తుంటారు. సాయం సమయాల్లో ఐస్ స్కేటింగ్, మ్యాజిక్ షో, ఇండోర్, అవుట్ డోర్ పార్కులు, నోరూరించే వంటకాలను అందించే రెస్టారెంట్లతో సేదతీరడానికి అనువైన ప్రాంతం. 

గునుంగ్ ములు నేషనల్ పార్క్: ప్రపంచంలో అతి పెద్ద గుహల సముదాయం ఇది. ప్రపంచంలోనే విశాలమైన భూగర్భ చాంబర్ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడి సర్వాక్ చాంబర్ 40 బోయింగ్ 747 విమానాలను పార్క్ చేసుకునేంత విశాలంగా ఉంటుంది. ఇంకా మలేసియన్ల సాంస్కృతిక సంపదను తెలియపరిచే 'ద మలయ్ హెరిటేజ్ మ్యూజియం', సరవాక్ కల్చరల్ విలేజ్, కెమెరాన్ హైలాండ్ తదితర స్థలాలను మలేసియా వెళ్లిన వారు తప్పక చూడాలి. 

లాంగ్ కవీ ఐలాండ్: 99 దీవుల సమూహం. అందమైన బీచులు, ప్రపంచ స్థాయి వసతులు, మడ అడవులు, పన్నుల్లేని షాపులు ఇలా ఎన్నో విశేషాలు ఇక్కడ ఉన్నాయి. తొమ్మిది సంరక్షక దీవులతో దక్షిణ చైనా తీరంలో ఉన్నదే పులా రిడాంగ్. ఇక్కడి సాగర జలాలు క్లిస్టర్ క్లియర్ గా ఉండడం ప్రత్యేకత. డైవింగ్ ప్రియులకు ఇష్టమైన ప్రదేశం. 

X

Feedback Form

Your IP address: 23.20.50.242
Articles (Education)