ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

డ్రైవింగ్ లో ఏ తప్పు చేస్తే ఎంత జరిమానా?

Sat, Aug 13, 2016, 11:02 AM
Related Image

ముఖ్యమైన పని ఉండి బైక్ పై వెళుతుండగా... మధ్యలో  ట్రాఫిక్ పోలీసులు ఎదురయ్యారు. బండి పక్కన పెట్టమన్నారు. నేమ్ ప్లేట్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని రూ.500 జరిమానా చలానా రాసి చేతిలో పెట్టారు. ఒక పక్క ముఖ్యమైన కార్యక్రమం ఉండడంతో మారు మాట్లాడకుండా రాసినంత కట్టేసి బయల్దేరాడు శ్రీనాథ్.

ఇలాంటి అనుభవం చాలా మందికి ఎదురయ్యే ఉంటుంది. నిజానికి ట్రాఫిక్ పోలీసులు రాసే చలాన్లపై చాలా మందిలో వ్యతిరేకత ఉంటుంది. వారు ఇష్టారీతిన చలానాలు రాస్తున్నారనే అపోహ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన సమయాల్లో ఎంత జరిమానా విధించాలన్నది నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. మోటారు వాహనాల చట్టం (ఎంవీఏ)లోని పలు సెక్షన్లలో వీటి గురించి వివరంగా పేర్కొన్నారు.  

డాక్యుమెంట్లు లేకుంటే...

1. 3r/w 181 సెక్షన్ ప్రకారం లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తుంటే... రూ.500 జరిమానా లేదా మూడేళ్ల జైలు లేదా రెండూ విధించే అధికారం ఉంటుంది.

2.130(3) r/w 177 సెక్షన్ ప్రకారం అవసరమైన పత్రాలను వెంట తీసుకెళ్లకపోతే రూ.100 జరిమానా విధించవచ్చు. రెండోసారి, ఆపై పట్టుబడితే 300 రూపాయల జరిమానా వసూలు చేస్తారు.

3. 130 r/w 177 సెక్షన్ ప్రకారం వాహనానికి ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయరాదు. ఇలా చేస్తే వెయ్యి రూపాయల జరిమానా లేదా మూడేళ్ల జైలు, లేదా రెండూ విధించవచ్చు.

4. 130 r/w 177 సెక్షన్ ప్రకారం సరైన అనుమతి లేకుండా... లేదా వాహనానికి తగిన సామర్థ్యం లేకుండా డ్రైవ్ చేస్తే రూ.2వేలకు తక్కువ కాకుండా రూ.5వేల వరకు జరిమానా విధించవచ్చు. రెండోసారి ఆపై ఇదేవిధంగా నిబంధనలను ఉల్లంఘించి దొరికిపోతే 10వేల రూపాయల వరకు జరిమానా, ఏడాది జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. 

5. 39 r/w 192 సెక్షన్ ప్రకారం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) లేకుండా డ్రైవ్ చేస్తూ పట్టుబడితే రూ.2వేలు చలానా రాసే అధికారం అధికారులకు ఉంటుంది.  

representation image

హెల్మెట్ లేకుంటే...?

1. హెల్మెట్ లేకుంటే జరిమానా రూ.100 (దీన్ని పలు చోట్ల సవరించారు). రెండో సారి ఆపై పట్టుబడితే 300 రూపాయలు విధించవచ్చు. 

2. మైనర్ డ్రైవింగ్ చేయడం నేరం. ఇందుకు 4 r/w 181 సెక్షన్ ప్రకారం 500 రూపాయలు జరిమానా.

3. సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా రూ.100 జరిమానా చెల్లించుకోవాలి. 

4. రఫ్, ర్యాష్ డ్రైవింగ్ కు గాను రూ.1000 జరిమానా చెల్లించాలి. 

5. ప్రమాదకర, తొందరపాటుతో కూడిన డ్రైవింగ్ కు వెయ్యి రూపాయల జరిమానా లేదా ఆరు నెలల జైలు లేదా రెండు విధించవచ్చు. 

6. సాధారణంగా రోడ్డు ఖాళీగా ఉంటే మధ్యలో వెళ్లడం చాలా మందికి అలవాటు. కానీ, నిబంధనల ప్రకారం రోడ్డుకు కచ్చితంగా ఎడమ భాగంలోనే వెళ్లాలి. ఒకవేళ రోడ్డు మధ్యలో డ్రైవ్ చేస్తూ పట్టుబడితే రూ.100 రూపాయల జరిమానా విధించే అధికారం పోలీసులకు ఉంటుంది. 

7. వన్ వే రూట్ లో నిషేధిత వైపు నుంచి వాహనాన్ని నడిపితే రూ.100 జరిమానా. రెండో సారి ఆపై ఇలానే చేస్తే 300 రూపాయల జరిమానా విధిస్తారు.

8. వెనుకకు చూసుకోకుండా వాహనాన్ని రివర్స్ చేస్తే 100 జరిమానా.

9. నిషేధిత సమయాల్లో యూ టర్న్ తీసుకున్నా 100 జరిమానా చెల్లించుకోవాలి.

10. మూల మలుపులో వాహన వేగాన్ని తగ్గించి హార్న్ కొట్టి వెళ్లాలి. కానీ, ఇటువంటి భద్రతా చర్యలు పాటించకపోతే 100 జరిమానా.

11. ట్రాఫిక్ జామ్ అయిందని ఫుట్ బోర్డుపైకి వాహనాలను ఎక్కించి దూసుకుపోవడం నిబంధనల ఉల్లంఘనే అవుతుంది. ఈ చర్యకు 100 రూపాయల జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుంది. 

12. పాదచారులు నడిచే బాటలో వాహనాన్ని ఆపినా 100 రూపాయలు జరిమానా విధించవచ్చు.

13. త్రిబుల్ రైడింగ్ కు 100 రూపాయలు.

STOP లైన్ దాటితే జరిమానా

representation image

1. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర STOP అనే లైన్ దాటి ముందుకు వెళ్లి ఆగితే 100 రూపాయల జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ట్రాఫిక్ గుర్తులను పాటించకపోయినా, సిగ్నల్ జంప్ అయినా, సిగ్నల్ ఇవ్వకపోయినా అభ్యంతరకర నంబర్ ప్లేట్ ఉపయోగించినా, హెడ్ లైట్, టెయిల్ లైట్ లను సరిగా వినియోగించకున్నా,  అవసరం లేకపోయినా హై బీమ్ హెడ్ లైట్ వినియోగిస్తే, హార్న్ లేకుండా డ్రైవింగ్ చేస్తే, అనుచిత హార్న్ ను వినియోగించినట్టయితే 100 రూపాయల చొప్పున జరిమానాను అధికారులు విధించవచ్చు. 

పోలీసు అధికారిని గౌరవించకుంటే జరిమానా

విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసు అధికారి పట్ల దురుసుగా ప్రవర్తించినా, విధేయత చూపకపోయినా 100 రూపాయల జరిమానా విధింపునకు అవకాశం ఉంటుంది. సిగ్నల్ ను పాటించకపోయినా, అనుమతించిన దానికంటే వేగంగా వాహనాన్ని నడిపినా రూ.1000 జరిమానా విధించవచ్చు. ముందున్న వాహనాన్ని ప్రమాదకరంగా అధిగమిస్తూ మొదటి సారి పట్టుబడితే 100 రూపాయల జరిమానా విధిస్తారు. రెండోసారి ఆపై పట్టుబడితే ఈ జరిమానా 300 రూపాయలు. రాంగ్ సైడ్ నుంచి ఓవర్ టేక్ చేసినా 100 రూపాయల జరిమానా చెల్లించుకోవాల్సి వస్తుంది. 

చట్టబద్ధమైన మార్గ సూచీలను పాటించకపోతే 500 జరిమానా చెల్లించాల్సి రావచ్చు. ఆల్కహాల్, డ్రగ్స్ తీసుకుని డ్రైవింగ్ చేయడం నేరం. ఇందుకు గాను రూ.2వేల జరిమానా లేదా ఆరు నెలల జైలు లేదా రెండు విధించే అవకాశం ఉంది.

మొబైల్ లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే...

మొబైల్ లో మాట్లాడుతూ వాహనాలను నడిపితే ప్రమాదాలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ చర్యలను నిషేధించారు. ఇందుకు గాను రూ. 1,000 రూపాయల జరిమానా విధిస్తారు. సురక్షితం కాని రీతిలో వాహనాన్ని విడిచి వెళితే దాన్ని సైతం నిషేధిత చర్యగా పరిగణించి 100 రూపాయల జరిమానా విధించవచ్చు. సంగీతం వింటూ డ్రైవ్ చేసినట్టయితే 100 రూపాయలు, సైలెన్సర్ లేకుండా డ్రైవ్ చేస్తే 100 రూపాయలు జరిమానా విధించే అధికారం ఉంది. శారీరకంగా, మానసికంగా డ్రైవింగ్ కు అర్హులు కాకపోతే కోర్టు చలానాకు బాధ్యులు అవుతారు. 

వాహనాన్ని తాళ్లతో కట్టి తీసుకెళ్లడం నేరం!

మోటారు వాహనం ఆగిపోతే దానికి తాళ్లు కట్టి వేరే వాహనం సాయంతో ఈడ్చుకుపోరాదు. ఇందుకు ద్విచక్ర వాహనానికి రూ.100 జరిమానా. కారు, జీపు, ట్యాక్సీ, ఆటో రిక్షాలకు 200 రూపాయలు, ట్రక్, ట్యాంకర్, ట్రెయిలర్ అయితే రూ.600 జరిమానా విధింపునకు అవకాశం ఉంది. 

కాలుష్యం వెదజల్లితే జరిమానాలు

ఓ వాహనం పొగ విడిచి పెడితే 100 రూపాయలు, కాలుష్యం నియంత్రణ పరిధిలో లేకుంటే 100 రూపాయల జరిమానా, భిన్న రకాల ధ్వనులతో కూడిన హార్న్ వాడితే రూ.500, ప్రెషర్ హార్న్ వినియోగిస్తే 100 రూపాయల జరిమానా, సైలెన్సర్, మఫ్లర్ కారణంగా శబ్దం వస్తే రూ.500 జరిమానా, నిశ్శబ్ద  ప్రాంతంలో హార్న్ కొట్టినా రూ.100 జరిమానాగా చెల్లించుకోవాలి. 

వేరే రాష్ట్రంలో అనుమతి లేకుండా నడిపితే

తమిళనాడు రిజిస్ట్రేషన్ బండిని ఏపీలో తిప్పి ఏడాది దాటిపోయిందనుకుంటే... 100 రూపాయల జరిమానా విధించవచ్చు. అందుకే ఏడాదిలోపు అనుమతి పొందాలి. త్రిచక్ర వాహనం, ఆపై వాహనాలకు వైపర్ (వర్షం పడినప్పుడు నీటిని పక్కకు తొలగించేది) తప్పనిసరిగా ఉండాలి. లేకుంటే 100 జరిమానా. సైడ్ మిర్రర్ లేకపోయినా ఇంతే మొత్తంలో జరిమానా చెల్లించుకోవాలి. టైర్లు దెబ్బతిని ఉంటే మార్చుకోవడం తప్పనిసరి. లేకుంటే 100 రూపాయల జరిమానా విధించే అధికారం ఉంటుంది. అలాగే, వాహనాల అద్దాలకు నల్ల ఫిల్మ్ అంటిచడం నేరం. ఇలా చేస్తే 100 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.  ప్రజా రవాణా వాహనం అయితే, వాహనంపై స్పష్టంగా పేర్కొనాలి. లేకుంటే 100 జరిమానా. వ్యక్తిగత వాహనాన్ని వాణిజ్య వాహనం కింద వినియోగిస్తూ పట్టుబడితే రూ.5వేలు జరిమానా. 

యూనిఫామ్ వేసుకోకుండా ప్రయాణికుల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్టయితే సదరు డ్రైవర్లకు రూ.100 జరిమానా విధించవచ్చు. సరుకుల వాహనంలో అధిక లోడ్ వేస్తే రూ.2వేలు జరిమానా విధిస్తారు. ప్రమాదకర రీతిలో సరుకుల రవాణా చేస్తే 3వేల రూపాయల జరిమానా, లేదా జైలు శిక్ష విధిస్తారు. 

వాణిజ్య వాహనాల విషయంలో

నో ఎంట్రీ సమయంలో వాహనం ప్రవేశిస్తే రూ.2వేల జరిమానా. జంతువులను వాహనంలో తరలిస్తే రూ.100 జరిమానా. గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులను చేరవేయడం నేరం. ఇందుకు గాను రూ.100 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. సరుకులను 11 అడుగుల ఎత్తుకు మించిన లోడ్ తో తీసుకువెళ్లినా, సురక్షితం కాని రీతిలో సరుకుల రవాణా చేసినా 100 జరిమానా చెల్లించుకోవాలి. 

భారీ  వాహనాన్ని తూకం వేసేందుకు నిరాకరిస్తే కోర్టు చలానా విధిస్తారు. టెయిల్ బోర్డు (అంచులో) లోడ్ వేసినా, అసభ్యకరంగా డ్రైవర్ వ్యవహరించినా, ట్యాక్సీ ప్రయాణికుల నుంచి అధికంగా వసూలు చేసినా, మీటర్ లేకుండా చార్జీ తీసుకున్నా రూ.100 జరిమానా విధిస్తారు. యూనిఫామ్ లేకుండా, బ్యాడ్జీ లేకుండా కనిపించినా, కండక్టర్ సైతం యూనిఫామ్ ధరించకపోయినా 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 

వాహనాల రాకపోకల మార్గంలో వాహనాలను పార్క్ చేస్తే ఇబ్బందులు ఎదురై ట్రాఫిక్ నిలిచిపోతుంది. అందుకే ఇలా పార్క్ చేసే వారి నుంచి రూ.100 జరిమానా విధిస్తారు. మూల మలుపులో వాహనాన్ని పార్క్ చేయడం నేరం. ఇందుకు రూ.100 జరిమానా. బస్ స్టాప్ కు 15 మీటర్ల పరిధిలో మరే బస్సు కూడా ఆగకూడదు. వంతెనపై వాహనాన్ని పార్క్ చేస్తే, నో పార్కింగ్ ప్రాంతంలో పార్క్ చేస్తే, గేటు ఎదురుగా పార్క్ చేస్తే కూడా 100 రూపాయల జరిమానా చెల్లించుకోవాలి.

ట్రాఫిక్, రవాణా శాఖ అధికారులు ఆపి కోరిన సమాచారాన్ని ఇవ్వకపోతే 500 రూపాయల జరిమానా లేదా మూడు నెలల వరకు జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంటుంది. రోడ్లపై వాహనాల రేసింగ్ లు నిర్వహిస్తే రూ.500 జరిమానా, ఒక నెల వరకు జైలు శిక్ష లేదంటే రెండూ విధించే అధికారం ఉంది. మొదటి సారి 100 రూపాయల జరిమానా విధించి... రెండో సారి అదే విధమైన ఉల్లంఘనకు పాల్పడితే జరిమానా 300 రూపాయలకు తక్కువ కాకుండా విధిస్తారు. 

కొత్త చట్టంలో భారీ జరిమానాలు

కేంద్ర ప్రభుత్వం తీసుకురాదలచిన నూతన మోటారు వాహనాల చట్టంలో నిబంధనల ఉల్లంఘనులకు భారీ జరిమానాలను ప్రతిపాదించారు. సాధారణ నిబంధనలు ఉల్లంఘించిన సమయాల్లో రూ.100 రూపాయల జరిమానా విధిస్తున్నారు. దీన్ని కొత్త చట్టం ప్రకారం మొదటి సారి పట్టుబడితే రూ.2,500, రెండోసారి ఆపై పట్టుబడితే రూ.5వేల జరిమానా ప్రతిపాదించారు. అధిక వేగంతో వెళితే ప్రస్తుతం జరిమానా రూ400గా ఉంది. దీన్ని రూ.1,000 నుంచి రూ.2,000కి పెంచారు. 

వాహనాన్ని ప్రమాదకరంగా నడిపితే ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.1,000 వరకు జరిమానా విధించేవారు. రెండో సారి ఆపై ఇదే విధంగా ఉల్లంఘిస్తే రూ.2వేలు, రెండేళ్ల జైలు శిక్షకు అవకాశం ఉంది. దీన్ని మొదటి సారి రూ.2,500, రెండోసారి ఆపై ఘటనలకు రూ.5వేల జరిమానాగా మార్చారు. పైగా జైలు శిక్ష స్థానంలో 15 నుంచి 30 గంటల పాటు కమ్యూనిటీ సేవ చేయాలనే నిబంధన ప్రతిపాదించారు.

representation image

మద్యం తాగి వాహనం నడిపితే

ప్రస్తుత నిబంధనల ప్రకారం మద్యం తాగి వాహనం నడిపితే మొదటి సారి అయితే రూ.2వేల జరిమానా, ఆరు నెలల వరకు జైలు శిక్షకు అవకాశం ఉంది. రెండో సారి ఆపై ఘటనలకు రూ.3వేలు జరిమానా ఉంది. కొత్త చట్టంలోని నిబంధనల మేరకు ఇది తొలిసారి రూ.5వేలు, 50 గంటల  కమ్యూనిటీ సేవ, ఆరు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి చర్యలు ఉన్నాయి. రెండోసారి ఆపై ఘటనలకు రూ.10వేలు జరిమానా, ఏడాది పాటు లైసెన్స్ సస్పెన్షన్ కు అవకాశం కల్పించారు. అదే హెవీ మోటారు వాహనాలు అయితే జరిమానా మొదటి సారి రూ.10వేలు, రెండోసారి రూ.20వేలు ప్రతిపాదించారు.  పైగా ఆరు నెలల నుంచి ఏడాది పాటు లైసెన్స్ సస్పెన్షన్ కూడా విధించనున్నారు. మరో మార్పు ఏమిటంటే ప్రస్తుత నిబంధనల ప్రకారం వాహన చోదకుల రక్తంలో ప్రతీ 100 మిల్లీ లీటర్లకు ఆల్కహాల్ శాతం 30 ఎంజీ ఉంటే నేరంగా పరిగణిస్తున్నారు. కానీ, కొత్త చట్టంలో దీన్ని 20 ఎంజీకి తగ్గించారు.

నార్కోటిక్ డ్రగ్స్ అయితే

డ్రగ్స్ తీసుకుని వాహనం నడుపుతూ పట్టుబడితే మొదటి సారి రూ.2వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష ప్రస్తుతం అమల్లో ఉంది. రెండోసారి ఆపైన రూ.3వేలు, రెండేళ్లు జైలు శిక్ష అమల్లో ఉంది. కొత్త చట్టంలో పేర్కొన్న నిబంధనల మేరకు ఇది మొదటి సారి 10వేలు, ఆరు నెలల లైసెన్స్ సస్పెన్షన్, రెండో సారి ఆపై అయితే రూ.20వేలు ఆరు నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష విధించనున్నారు.

శారీరక, మానసిక సామర్థ్యం లేకుండా...

శారీరక, మానసిక సామర్థ్యం లేకుండా డ్రైవింగ్ చేస్తే ప్రస్తుతం మొదటి సారి రూ.200, ఆపైన రూ.500 జరిమానా విధిస్తున్నారు. కొత్త చట్టంలో దీన్ని రూ.5వేలుగా పేర్కొన్నారు.

రిజిస్ట్రేషన్ లేకుండా నడిపితే...

వాహనం రిజిస్ట్రేషన్ లేకుండా నడిడితే మొదటిసారి గరిష్టంగా రూ.5వేలు, రెండోసారి ఆపై అయితే 10వేల వరకు జరిమానా విధిస్తున్నారు. అలాగే, ఏడాది పాటు జైలు శిక్ష నిబంధన కూడా అమల్లో ఉంది. కొత్త చట్టంలో అయితే, ద్వి, త్రిచక్ర వాహనాల విషయంలో మొదటి సారి పట్టుబడితే రూ.1,500, ఆపైన రూ.3వేల జరిమానా ప్రతిపాదించారు. భారీ వాహనాలు అయితే మొదటిసారి రూ.5వేలు జరిమానా, తర్వాత రూ.10వేల జరిమానాకు అవకాశం కల్పించారు. 

పర్మిట్ లేకుండా నడిపితే ప్రస్తుతం గరిష్టంగా రూ.5వేల వరకు, రెండోసారి ఆపైన రూ.10వేల వరకు జరిమానాతోపాటు ఏడాది వరకు జైలు శిక్షకు అవకాశం ఉంది. కొత్త చట్టంలో పేర్కొన్న దాని ప్రకారం ఇది 2, 3 చక్రాల వాహనాల విషయంలో మొదటి సారి రూ.1,500... రెండోసారి, ఆపై రూ.3వేలుగా ఉండనుంది. భారీ వాహనాల విషయంలో మొదటిసారి ఇది రూ.5వేలు, రెండోసారి రూ.10వేలుగా ప్రతిపాదించారు.

X

Feedback Form

Your IP address: 54.211.121.63
Articles (Education)