ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

డిష్ వాషర్ కొనాలనుకుంటున్నారా.. ఇవి తెలుసుకోండి!

Wed, Jun 01, 2016, 02:38 PM
Related Image

ఉరుకులు పరుగుల జీవితం.. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ఇంట్లో పనులకూ సమయం చిక్కదు.. ఆఫీసుకు వెళ్లే ముందు హడావుడి, ఇంటికి తిరిగి రాగానే అలసట. అలాంటి వారికి తోడ్పడే గృహోపకరణాల్లో డిష్ వాషర్ చాలా ముందుంటుంది. గిన్నెలు, ప్లేట్లు, గ్లాసులు, చెంచాలు.. ఇలా అన్నింటినీ అది శుభ్రంగా తోమేసి, కడిగేసి పెడుతుంది. అంతేకాదు తడిగా ఉండి బ్యాక్టీరియా చేరకుండా పూర్తిగా ఆరబెడుతుంది కూడా. కానీ డిష్ వాషర్ ఎలా పనిచేస్తుంది, ధర ఎంత ఉంటుంది, ఇంట్లో వినియోగించుకోగలమా లేదా.. అనే సందేహాలతో చాలా మంది వాటికి దూరంగా ఉంటుంటారు. వినియోగం చాలా సులువు, విద్యుత్ ఖర్చూ తక్కువే, ధరలు మాత్రం కొంచెం ఎక్కువ.. ఈ వివరాలన్నీ తెలుసుకుందాం..

ఎలా వినియోగించుకోవచ్చు?

డిష్ వాషర్ లో ఒక్కో రకం పాత్రలు పెట్టడానికి వేర్వేరుగా ఏర్పాట్లు ఉంటాయి. ప్లేట్లు, గ్లాసులు, చెంచాలు, గిన్నెలను వాటికి కేటాయించిన చోట అమర్చి డిష్ వాషర్ మూత పెట్టేస్తే సరిపోతుంది. అలాగే నీటి పైపు కనెక్షన్, విద్యుత్ కనెక్షన్ సరిగా ఉన్నాయో లేదో చూడాలి అంతే. ఆ తర్వాత అంతా ఆటోమేటిగ్గా డిష్ వాషర్ పాత్రలను నానబెట్టడం, శుభ్రం చేయడం, కడగడం, ఆరబెట్టడం చేస్తుంది.

ఎలా పనిచేస్తుంది?

పాత్రలన్నీ పెట్టేసి ఆన్ చేసిన తర్వాత డిష్ వాషర్ లో నీళ్లు నిండుతాయి. ఆ నీటిని ఓ నిర్ణీత స్థాయి వరకూ వేడి చేసుకుంటుంది. ఆ వేడి నీటిలో పాత్రలను నానబెడుతుంది. తర్వాత ఆ నీటిని తొలగించి... లోపల ఏర్పాటు చేసి ఉన్న జెట్ స్ప్రే పైపుల ద్వారా వేడి నీటిని వేగంగా పాత్రలపైకి అన్ని మూలల నుంచి చిమ్ముతుంది.

డిష్ వాషర్ పనిచేసే విధానాన్ని ఇక్కడ చూడవచ్చు.

అవసరాన్ని బట్టి పరిమాణాన్ని ఎంచుకోవచ్చు

శాంసంగ్, ఐఎఫ్ బీ, బోస్చ్, ఎల్ జీ, సీమెన్స్, వర్ల్ పూల్, ఎలక్ట్రోలక్స్ తదితర కంపెనీలు డిష్ వాషర్లను విక్రయిస్తున్నాయి. డిష్ వాషర్ల సామర్థ్యాన్ని ‘ప్లేట్ సెట్టింగ్’లలో కొలుస్తారు. ఒక ప్లేట్ సెట్టింగ్ అంటే.. ఒక ప్లేట్ (భోజనం చేసే పళ్లెం), ఒక డెసర్ట్ ప్లేట్ (చిన్న పళ్లెం), గ్లాసు, టీకప్పు, సాసరు, ఒక్కో చాకు, ఫోర్క్, సూప్ స్పూన్, డెసర్ట్ స్పూన్, టీస్పూన్లు, ఒక వంట (కర్రీ లేదా రైస్) పాత్ర పెట్టుకోవచ్చు. సాధారణంగా 12 ప్లేట్ సెట్టింగ్ అంతకన్నా ఎక్కువ సామర్థ్యంతో డిష్ వాషర్లు లభిస్తుంటాయి. అయితే మనం వివిధ పరిమాణాల్లో ఉండే వేర్వేరు రకాల పాత్రలు ఉపయోగిస్తుంటాం. వాటన్నింటినీ కలిపి మిక్స్ డ్ గా పరిశీలిస్తే... 12 ప్లేట్ సెట్టింగ్ డిష్ వాషర్ లో రెండు మూడు వంట పాత్రలు, 8 వరకు ప్లేట్లు, కడాయి, కుక్కర్, 15-20 చెంచాలు, ఫోర్కులు, నాన్ స్టిక్ ప్యాన్, 8 వరకు గ్లాసులు, టీ కప్పులు వంటివి ఒకేసారి శుభ్రం చేసుకోవచ్చు.

ధరలు ఎలా ఉంటాయి..?

సాధారణంగా 12 ప్లేట్ సెట్టింగ్ డిష్ వాషర్ ధర కంపెనీని బట్టి రూ.32,000 నుంచి రూ.40,000 వరకు ఉంటుంది. అదే 14 ప్లేట్ సెట్టింగ్, 15 ప్లేట్ సెట్టింగ్ ధరలు రూ.42,000 నుంచి రూ.50,000 వరకు ఉంటాయి. అయితే భారత్ లో డిష్ వాషర్లకు ఇంకా బీఈఈ స్టార్ రేటింగ్ ఇవ్వడం లేదు. అందువల్ల యురోపియన్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రమాణాలను అనుసరిస్తున్నారు. వీటిలో ఏ+++, ఏ++, ఏ+, ఏ, బీ ఇలా రేటింగులు ఉంటాయి. ఏ+++ రేటింగ్ ఉంటే అత్యుత్తమ విద్యుత్ ఆదా సామర్థ్యమున్నట్లు లెక్క. వీటి ధరలు మరింత ఎక్కువగా ఉంటాయి.

విద్యుత్ వినియోగం సంగతేంటి

డిష్ వాషర్లు వేర్వేరు పరిమాణాలలో ఉంటాయి. గిన్నెలు శుభ్రం చేసేందుకు వేర్వేరు ఆప్షన్లు ఉంటాయి. అందువల్ల పరిమాణం, క్లీనింగ్ ఆప్షన్లను బట్టి విద్యుత్ వినియోగం ఆధారపడి ఉంటుంది. సాధారణంగా తక్కువ మురికి ఉన్న పాత్రలను శుభ్రం చేసే ఆప్షన్ తో ఒకసారి వినియోగానికి (గిన్నెలు నానబెట్టడం, క్లీనింగ్, డ్రైయింగ్ కలిపి) 1 యూనిట్ విద్యుత్ ఖర్చవుతుంది. ఎక్కువ మురికి ఉంటే 2 యూనిట్లు అవుతుంది. ఈ లెక్కన డిష్ వాషర్ కు నెలకు సగటున 45 నుంచి 60 యూనిట్ల విద్యుత్ అవసరం.

డిష్ వాషర్లలో ఉండే ఆప్షన్లు

  1. ఇంటెన్సివ్ మోడ్: బాగా మురికిగా ఉన్న వంట పాత్రలు, ప్యాన్ లు, ఇతర డిష్ లు, ఆహారం అంటుకుని ఎండిపోయి పాత్రలు శుభ్రం చేయడానికి ఈ మోడ్ బాగుంటుంది. దీనిలో నీరు ఎక్కువగా వేడవుతుంది. విద్యుత్ వినియోగం ఎక్కువ.
  2. ఆటో/నార్మల్ మోడ్: సాధారణ సమయాల్లో వినియోగించుకునే ఆప్షన్.
  3. ఎకానమీ మోడ్: సాధారణ సమయాల్లోనే అయినా.. వంట పాత్రలు తక్కువగా ఉండి ప్లేట్లు, గ్లాసులు, స్పూన్ ల వంటివి ఉన్నప్పుడు
  4. ప్రీ వాష్ మోడ్: శుభ్రం చేసి ఉన్నా కొద్ది రోజులుగా వాడకుండా ఉండడం లేదా మరోసారి పైపైన కడగడం కోసం ఈ మోడ్ పనికొస్తుంది. దీనిలో క్లీనింగ్ డిటర్జెంట్ వినియోగించడం, పాత్రలను ఆరబెట్టడం ఉండదు.
  5. క్విక్ వాష్ మోడ్: తక్కువ మురికిగా ఉన్న పాత్రలను అతి తక్కువ సమయంలోనే శుభ్రం చేయడం కోసం ఈ ఆప్షన్. దీనిలో పాత్రలను ఆరబెట్టడం ఉండదు.

(కంపెనీలను బట్టి ఆప్షన్లు, వాటి పేర్లు మారుతుంటాయి. వాటిని గమనించాలి)

డిష్ వాషర్ తో ఎన్నో ప్రయోజనాలు..

  • భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేసే కుటుంబాల్లో, ఇతర వ్యాపకాలతో సమయం చిక్కని వారికి, వయసు మీద పడడంతో ఎక్కువసేపు పని చేయలేని వారికి డిష్ వాషర్ తో ఎంతో ప్రయోజనం ఉంటుంది.
  • డిష్ వాషర్ ను పూర్తి సామర్థ్యంతో వినియోగిస్తే సాధారణంగా చేతితో శుభ్రం చేసేకన్నా సగమే నీటి వినియోగం ఉంటుందని డిష్ వాషర్లు తయారు చేసే కంపెనీలు చెబుతున్నాయి. వాటిని ప్రయోగ పూర్వకంగా పరిశీలించిన నిపుణులూ నీటి ఆదా ఉంటుందని తేల్చారు.
  • సాధారణంగా చేతులతో శుభ్రం చేసిన వాటికన్నా డిష్ వాషర్ లో పాత్రలు మరింత బాగా శుభ్రమవుతాయని, బ్యాక్టీరియా ఇతర క్రిములు నశిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
  • చర్మ సమస్యలు ఉన్నవారు, డిటర్జెంట్ పడనివారికి డిష్ వాషర్ వినియోగం వల్ల ప్రయోజనం ఉంటుంది.  

ఈ నష్టాలు, సమస్యలూ ఉంటాయి

  • సాధారణంగా శుభ్రం చేసుకోవడం కన్నా డిష్ వాషర్ ను వినియోగించుకోవడం ఖర్చుతో కూడుకున్నది. డిష్ వాషర్ ఖరీదు ఎక్కువ. ఎప్పుడైనా మరమ్మతులు చేయించాల్సి వస్తే అది అదనపు ఖర్చు.
  • డిష్ వాషర్ లో ఎక్కువ వేడి నీటి ఆప్షన్ వినియోగం, వేడి గాలి ద్వారా పాత్రలు ఆరబెట్టడం వంటి వాటితో విద్యుత్ వినియోగం బాగా పెరుగుతుంది.
  • సాధారణ సామర్థ్యం ఉన్న డిష్ వాషర్ కు కూడా ఎక్కువ స్థలం అవసరం. పరిమాణం పెద్దగా ఉండడం వల్ల చిన్న కిచెన్ ఉన్నవారికి ఇబ్బందికరం. అందువల్ల కొనే ముందే సామర్థ్యం, పరిమాణం చెక్ చేసుకోవాలి.
  • డిష్ వాషర్ లో పాత్రలను సరిగ్గా అమర్చాలి. లేకపోతే గాజు, ప్లాస్టిక్, ఫైబర్ వస్తువులు, చెంచాలు, పింగాణి వస్తువులు పాడయ్యే అవకాశం ఉంటుంది.
  • డిష్ వాషర్లు వినియోగించినప్పుడు నీరు బయటకు చిమ్మే అవకాశం ఉంటుంది. దీంతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

కొనే ముందు ఇవి గమనించండి

  • మీ అవసరం, కిచెన్ లో అందుబాటులో ఉండే స్థలం, మీరు ఖర్చు చేయగలిగిన మొత్తం ఆధారంగా మంచి బ్రాండ్ డిష్ వాషర్ ను ఎంచుకోండి
  • డిష్ వాషర్ డోర్, పంపు సీల్ లు, వాటర్ వాల్వులు, పైపులు, హీటర్, బ్లోయర్ వంటి వాటిని చెక్ చేసుకోవాలి.
  • దీనిని వినియోగించేటప్పుడు ధ్వని వస్తుంటుంది. కొన్ని కంపెనీల మోడళ్లలో తక్కువగా, కొన్ని కంపెనీల మోడళ్లలో ఎక్కువ శబ్దం ఉంటుంది. దానిని గమనించి.. మీకు తగినది ఎంపిక చేసుకోండి.
  • డిష్ వాషర్ లోపలి భాగాలు, కేబినెట్ స్టెయిన్ లెస్ స్టీల్, ప్లాస్టిక్ వి ఉంటాయి. మీ అవసరాన్ని బట్టి ఏది కావాలో ఎంచుకోండి.
  • స్టీల్ అయితే ఎక్కువ కాలం మన్నుతుంది, పాత్రలు త్వరగా ఆరిపోతాయి. కానీ అప్పుడప్పుడూ శుభ్రం చేయాల్సి ఉంటుంది.
  • ప్లాస్టిక్ భాగాలున్న డిష్ వాషర్ ధర తక్కువగా ఉంటుంది. డిష్ క్లీనింగ్ లో తేడాలేమీ ఉండవు. కానీ ఆరబెట్టడంలో ఆలస్యమవుతుంది. మన్నిక తక్కువ.
  • కొన్ని కంపెనీల డిష్ వాషర్లలో ఎన్నో ఆప్షన్లు ఉంటాయి. ఆప్షన్లు పెరిగే కొద్దీ ధర పెరుగుతుంది. అందువల్ల అవసరం లేని ఆప్షన్లు ఉన్నవి తీసుకోకపోవడం మేలు.

డిష్ వాషర్ లో పాత్రలు ఎలా అమర్చాలో ఈ వీడియోలో చూడొచ్చు..

వినియోగించేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తే చాలు

  • డిష్ వాషర్ లో అవసరమైతే తప్ప అత్యధిక వేడి నీటిని వినియోగించే ఆప్షన్ ను వినియోగించవద్దు.
  • వివిధ రకాలైన పాత్రలను ఆ డిష్ వాషర్ తయారీదారు సూచించిన తరహాలోనే అమర్చాలి. దానివల్ల నీటి సర్క్యులేషన్ బాగుండి పాత్రలు బాగా శుభ్రం అవుతాయి. పాత్రలు దెబ్బతినకుండా ఉంటాయి.
  • డిష్ వాషర్ నుంచిగానీ, పైపుల నుంచిగానీ నీరు బయటికి లీకేజీ అయ్యే అవకాశం ఉంటుంది. అది గుర్తించి సరిచేయాలి లేదా మరమ్మతు చేయించుకోవాలి.
  • డిష్ వాషర్ కు నీరు అందే, బయటకు వెళ్లే పైపులు, ఫిల్టర్ల ను తరచూ పరీక్షించి శుభ్రం చేస్తూ ఉండాలి.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Articles (Education)