ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

డైరెక్ట్ కూల్, ఫ్రాస్ట్ ఫ్రీ.. రిఫ్రిజిరేటర్లలో ఏది బెటర్?

Thu, May 26, 2016, 06:34 PM
Related Image

ఇంట్లో కూరగాయలను, ఇతర ఆహార పదార్థాలను నిల్వ ఉంచుకోవడానికి, నీళ్లు, ఇతర కూల్ డ్రింకుల వంటివి చల్లబరుచుకోవడానికి, ఐఎస్ క్యూబ్స్ కోసం రిఫ్రిజిరేటర్ ను వినియోగిస్తుంటాం. ప్రస్తుత వేగవంతమైన జీవితం కారణంగా మన నిత్యావసర వినియోగ వస్తువుల్లో రిఫ్రిజిరేటర్ తప్పనిసరి అవసరంగా మారిపోయింది. కానీ రిఫ్రిజిరేటర్లలో ఎన్ని రకాలున్నాయి, మనకు ఎలాంటిది అవసరం, ఏమేం సదుపాయాలు ఉండాలి, ఏ పరిమాణం గల ఫ్రిజ్ తీసుకుంటే సరిపోతుంది, విద్యుత్ వినియోగం ఎలా ఉంటుంది, విద్యుత్ ను పొదుపు చేసే ఇన్వర్టర్ ఫ్రిజ్ లు ఏమిటి, వారెంటీ ఏమైనా ఉంటుందా, ఫ్రిజ్ లకు వచ్చే సమస్యలు, పరిష్కారాలపై చాలా మందికి ఎన్నో సందేహాలు వస్తుంటాయి. మరి ఫ్రిజ్ కొనేటపుడు ఏమేం పరిశీలించాలి, మన అవసరాలకు తగినట్లు ఏలా ఎంచుకోవాలనేది చూద్దాం..

రిఫ్రిజిరేటర్ ఎలా పనిచేస్తుంది?

రిఫ్రిజిరేటర్లలో కీలకమైన భాగాలు కంప్రెసర్, రిఫ్రిజిరెంట్ (చల్లబరిచే రసాయనం). రిఫ్రిజిరెంట్ ను కంప్రెస్ చేస్తూ ఫ్రిజ్ లోపల బయట గొట్టాల ద్వారా ప్రయాణించేలా చేసేది కంప్రెసర్. ఫ్రిజ్ లోపలి భాగంలో ఏర్పాటు చేసే సన్నని గొట్టాల ద్వారా ప్రయాణించే రిఫ్రిజిరెంట్ లోపలి వేడిని గ్రహించి... బయటికి వచ్చాక ఫ్రిజ్ వెనుక భాగంలో ఉండే గొట్టాల ద్వారా ప్రయాణిస్తూ వేడిని బయటకు విడుదల చేస్తుంది. దీంతో ఫ్రిజ్ లోపలి భాగంలో ఉష్ణోగ్రత బాగా తగ్గిపోతుంది. ఫ్రిజ్ పనిచేసే ప్రాథమిక సూత్రం ఇదే. సాధారణంగా అన్ని రిఫ్రిజిరేటర్ల పనితీరు, వాటిల్లో అందించే సాధారణ సదుపాయాలు ఒకేలా ఉంటాయి. కానీ కంపెనీలు అదనపు ఫీచర్లను జోడించి విక్రయిస్తుంటాయి. అయితే ప్రధాన ఫీచర్లను బట్టి రిఫ్రిజిరేటర్లను డైరెక్ట్ కూల్, ఫ్రాస్ట్ ఫ్రీ అని రెండు రకాలుగా చెప్పవచ్చు.

డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్లు..

రిఫ్రిజిరేటర్ లోపలి భాగంలోనే ఫ్రీజర్ ఉండే వాటిని డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్లుగా చెబుతారు. సాధారణంగా ఇవి సింగల్ డోర్ తోనే ఉంటాయి. వీటిల్లో రిఫ్రిజిరెంట్ మొదట ఫ్రీజర్ భాగంలో నుంచి మొదలై.. మిగతా భాగం వెంట ప్రయాణిస్తుంది. దాంతో ఫ్రీజర్ లో ఉష్ణోగ్రత చాలా తక్కువ స్థాయికి చేరుతుంది. అందువల్ల ఫ్రీజర్ లోపలి అంచుల వెంట మంచు ఏర్పడి పేరుకుపోతూ ఉంటుంది. రిఫ్రిజిరేటర్ ను ఆఫ్ చేయడం ద్వారా గానీ లేకపోతే రిఫ్రిజిరేటర్ లో ఏర్పాటు చేసే ‘డీ ఫ్రాస్ట్’ బటన్ ను నొక్కడం ద్వారాగానీ పేరుకుపోయిన మంచును తొలగించుకోవచ్చు. ‘డీఫ్రాస్ట్’ చేసినప్పుడు ఫ్రీజర్ లోపలివైపున అంతర్గతంగా ఏర్పాటు చేసిన హీటర్ మంచును కరిగిస్తుంది. ఇక ఈ రిఫ్రిజిరేటర్లు అత్యధికంగా 300 లీటర్ల సామర్థ్యం వరకే ఉంటాయి. వీటి విద్యుత్ వినియోగం కూడా తక్కువగా ఉంటుంది.

ఇవీ సౌకర్యాలు..

  • చిన్నగా ఉండడం వల్ల చిన్న కుటుంబాలకు, తక్కువ అవసరాలున్న వారికి ఉపయోగం.
  • ఫ్రాస్ట్ ఫ్రీతో పోల్చితే విద్యుత్ వినియోగం చాలా తక్కువ
  • ధరలు కూడా తక్కువగా ఉంటాయి. 170-190 లీటర్ల డైరెక్ట్ కూల్ ఫ్రిజ్ ల ధరలు 9,000-10,000 రూపాయల ధరల శ్రేణి నుంచి ప్రారంభమవుతాయి. 245 లీటర్ల ఫ్రిజ్ సుమారుగా అదనపు సౌకర్యాలను బట్టి 15,000 నుంచి 22,000 వరకూ లభిస్తుంది.

ఇబ్బందులు ఇవి..

  • ఫ్రీజర్, ఫ్రిజ్ పరిమాణం చిన్నగా ఉంటుంది. ఎక్కువ వస్తువులను పెట్టుకోలేం.
  • మంచు పేరుకుపోవడం మూలంగా మరింత ఇరుకుగా మారుతుంది. అందులో పెట్టినవి అంచులకు అతుక్కుపోతాయి.
  • ఫ్రీజర్ ను సాధారణంగా తక్కువగా వినియోగిస్తుంటాం. కానీ దీనికి, ఫ్రిజ్ కు ఒకే డోర్ ఉండడం వల్ల తెరిచినప్పుడల్లా చల్లదనం తగ్గిపోతుంటుంది.

ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్లు

వీటిల్లోని ఫ్రీజర్లలో ఉండే హీటింగ్ ఎలిమెంట్ నిత్యం పనిచేస్తూ మంచు ఏర్పడకుండా చేస్తుంది. సాధారణంగా ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్లు డబుల్ డోర్ లేదా అంతకన్నా పెద్దవిగానే ఉంటాయి. కనీసం 245 - 250 లీటర్ల సామర్థ్యం నుంచి వీటి శ్రేణి ప్రారంభమవుతుంది. వీటిల్లో పైభాగంలో ఫ్రీజర్ ఉండే ‘టాప్ మౌంట్ రిఫ్రిజిరేటర్’, కింది భాగంలో ఉండే ‘బాటమ్ మౌంట్ రిఫ్రిజిరేటర్’, రెండు కన్నా ఎక్కువ డోర్లుండే ‘మల్టీడోర్ రిఫ్రిజిరేటర్’, తలుపుల్లా పక్కపక్కన డోర్లు ఉండే ‘సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్’ వంటి రకాలు కూడా ఉన్నాయి.

వీటితో ఉపయోగాలెన్నో..

  • పెద్ద కుటుంబాలకు, ఎక్కువ అవసరాలు ఉండే వారికి ఇవి ఉపయోగకరం.
  • ఫ్రీజర్ లో, ఫ్రిజ్ లో స్థలం ఎక్కువగా ఉంటుంది.
  • మంచు ఏర్పడే సమస్య తప్పుతుంది. ఐస్ ట్రేలు, బాటిళ్లు అతుక్కునే బాధ ఉండదు.
  • అవసరమైనప్పుడే ఫ్రీజర్ తెరవడం వల్ల చల్లదనం తగ్గిపోకుండా ఉంటుంది.
  • సైడ్ బై సైడ్ రకంలో మరింత ఎక్కువగా ఫ్రీజర్ స్థలం ఉంటుంది. అంతేకాదు ఇరుకైన స్థలంలోనూ పెట్టుకునే వీలుంటుంది.
  • ప్రారంభ స్థాయి అయిన 240 లీటర్ల ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్ ధర సౌకర్యాలను బట్టి 21,000 నుంచి 24,000 వరకు ఉంటుంది.
  • ఐస్ డిస్పెన్సర్, వాటర్ డిస్పెన్సర్ వంటి అదనపు సౌకర్యాలూ కొన్నింటిలో ఉంటాయి.

ఇబ్బందులూ ఉన్నాయి..

  • ఫ్రాస్ట్ ఫ్రీ హీటింగ్ ఎలిమెంట్ కారణంగా విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఒకే సామర్థ్యం, ఒకే స్టార్ రేటింగ్ ఉండే డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్లకన్నా.. ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్లు 30% నుంచి 50% దాకా ఎక్కువ విద్యుత్ ఖర్చు చేస్తాయి.
  • ఇందులోనూ బాటమ్ మౌంట్, సైడ్ బై సైడ్ తరహావి మరింత ఎక్కువగా విద్యుత్ వినియోగించుకుంటాయి.
  • డైరెక్ట్ కూల్ తో పోలిస్తే ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్ల ధరలు ఎక్కువ.

విద్యుత్ పొదుపు చేసే ఇన్వర్టర్ టెక్నాలజీ రిఫ్రిజిరేటర్లు

ఇన్వర్టర్ టెక్నాలజీతో రూపొందిన రిఫ్రిజిరేటర్లతో దాదాపు 40% వరకు విద్యుత్ పొదుపు కావడంతోపాటు నిల్వ చేసిన ఆహార పదార్థాల నాణ్యత కూడా బాగుంటుంది. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ టెక్నాలజీతో రూపొందిన రిఫ్రిజిరేటర్లు ఇన్వర్టర్లపై ఆధారపడి నడవగలవు. సాధారణ రిఫ్రిజిరేటర్లలో థర్మోస్టాట్ సహాయంతో కంప్రెసర్ నియంత్రణ ఆధారపడి ఉంటుంది. ఫ్రిజ్ లోపలి భాగంలో చల్లదనం నియమిత స్థాయికి చేరగానే థర్మోస్టాట్ కంప్రెసర్ ను పూర్తిగా ఆపివేస్తుంది. దాంతో ఫ్రిజ్ లో ఉష్ణోగ్రత పెరగడం మొదలవుతుంది. ఇది ఒక నియమిత స్థాయికి చేరగానే థర్మోస్టాట్ తిరిగి కంప్రెసర్ కు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో చల్లబడడం మొదలవుతుంది. అంటే ఫ్రిజ్ లోపలి ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు జరుగుతూ ఉంటాయి. కంప్రెసర్ ఆన్ అయినప్పుడల్లా ఎక్కువగా విద్యుత్ ను తీసుకుంటుంది. ఆన్ లో ఉన్నంత సేపూ పూర్తిస్థాయిలో పనిచేస్తూ గరిష్ట స్థాయిలో విద్యుత్ ను వినియోగించుకుంటుంది. అదే ఇన్వర్టర్ టెక్నాలజీ ఉన్న రిఫ్రిజిరేటర్లలో ఫ్రిజ్ లోపలి ఉష్ణోగ్రతకు అనుగుణంగా అవసరమైన వేగంతో కంప్రెసర్ పనిచేస్తుంది. మధ్యలో కంప్రెసర్ ఆఫ్ కావడం, తిరిగి ఆన్ కావడం ఉండదు. ఫ్రిజ్ లోపలి ఉష్ణోగ్రతలు కూడా స్థిరంగా ఉండి, ఆహార పదార్థాల నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది.

కరెంటు లేకున్నా చల్లదనం

కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా లేకున్నా కూడా రిఫ్రిజిరేటర్ లో చల్లదనం కొనసాగేలా సరికొత్త సాంకేతికతతో కొన్ని కంపెనీలు రిఫ్రిజిరేటర్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. ఎల్ జి కి చెందిన డ్యూరాచిల్, పవర్ కట్ ఎవర్ కూల్, వర్ల్ పూల్ సంస్థకు చెందిన పవర్ కూల్, ఎలక్ట్రోలక్స్ సంస్థ యూరో చిల్, సామ్ సంగ్ కూల్ ప్యాక్ తదితర పేర్లతో ఇటువంటి రిఫ్రిజిరేటర్లను ప్రవేశపెట్టాయి.

ఫ్రీజర్ ను ఫ్రిజ్ లా.. ఫ్రిజ్ ను ఫ్రీజర్ లా...

కొన్ని కంపెనీలు ఫ్రీజర్ ను ఫ్రిజ్ లా.. ఫ్రిజ్ ను ఫ్రీజర్ లా ఉపయోగించుకోగలిగే రిఫ్రిజిరేటర్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. ఐస్ క్రీములు, ఫ్రాజెన్ ఫుడ్స్ వంటి వాటిని ఎక్కువగా ఉంచాల్సి వచ్చినప్పుడు ఫ్రిజ్ మోత్తాన్నీ ఫ్రీజర్ లాగా... ఫ్రీజ్ చేయవలసిన వస్తువులేమీ లేనప్పుడు ఫ్రీజర్ ను కూడా సాధారణ ఫ్రిజ్ లాగా వాడుకోవచ్చు. దీనివల్ల అవసరాలను తీర్చుకోవడంతోపాటు విద్యుత్ నూ పొదుపు చేసుకోవచ్చు. ఈ రిఫ్రిజిరేటర్ల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి.

స్టార్ రేటింగ్ చూడండి

స్టార్ రేటింగ్ ఎక్కువగా ఉన్న రిఫ్రిజిరేటర్ ను ఎంచుకోవడం వల్ల విద్యుత్ ఖర్చు తగ్గుతుంది. మంచి కంపెనీకి చెందిన ఎక్కువ స్టార్ రేటింగ్ ఉన్న రిఫ్రిజిరేటర్ విద్యుత్ వినియోగం అదే సామర్థ్యమున్న సాధారణ రిఫ్రిజిరేటర్ కంటే 15% నుంచి 25% దాకా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు 210 లీటర్ల సామర్థ్యమున్న డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్ 2 స్టార్ రేటింగ్ తో అయితే ఏటా 270 యూనిట్లు, 3 స్టార్ తో 250 యూనిట్లు, 4 స్టార్ తో 230 యూనిట్లు, 5 స్టార్ తో 210 యూనిట్ల వరకు విద్యుత్ ను వినియోగించుకుంటుంది. 

విద్యుత్ వినియోగం ఎలా ఉంటుంది?

  • 190 లీటర్ల నుంచి 300 లీటర్ల వరకు డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్లకు ఏడాదికి 185 నుంచి 275 యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతుంది. ఇన్వర్టర్ టెక్నాలజీ ఉన్న 245 లీటర్ల డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్ కు కేవలం 200 యూనిట్లలోపే విద్యుత్ ఖర్చవుతుంది.
  • 240 లీటర్ల సామర్థ్యమున్న ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్ కు ఏడాదికి 270 యూనిట్లు అవసరం. అదే ఇన్వర్టర్ టెక్నాలజీ ఉన్న రిఫ్రిజిరేటర్ 220 యూనిట్లనే ఖర్చు చేస్తుంది.

కొనే ముందు ఈ అంశాలను గమనించండి

  • మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు, ఎంత వరకు ఫ్రిజ్ ను వినియోగిస్తారనే అంశాలను బేరీజు వేసుకుని రిఫ్రిజిరేటర్ ను కొనుగోలు చేయండి. అవసరానికి మించి పెద్ద ఫ్రిజ్ ను కొనుగోలు చేస్తే విద్యుత్ బిల్లులు మోత మోగిపోతాయి. చిన్నది కొంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
  • ఫ్రిజ్ లు వివిధ రంగులు, డిజైన్లతో ఉంటాయి. ఒకే మోడల్, సామర్థ్యమున్న ఫ్రిజ్ అయినా... ఒకే రంగు (ప్లెయిన్)తో ఉన్నదానికంటే, డిజైన్లు ఉన్న వాటికి ధరలు 1,500 రూపాయల నుంచి 3 వేల రూపాయల వరకు ఎక్కువగా ఉంటాయి. పనితీరులో ఏ మాత్రం తేడా ఉండదని గుర్తుంచుకోండి.
  • ఐస్ (మంచు) క్యూబ్స్ డిస్పెన్సర్, వాటర్ డిస్పెన్సర్, ఎల్ఈడీ డిస్ప్లే, మాయిశ్చర్ కంట్రోల్ వంటి ఫీచర్లతో వచ్చే ఫ్రిజ్ ల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ ఫీచర్ల కారణంగా విద్యుత్ వినియోగం పెరగడంతోపాటు రిఫ్రిజిరేటర్ ధర కూడా బాగా ఎక్కువగా ఉంటుంది.
  • కొన్ని రకాల ఫ్రిజ్ లలో షెల్ఫ్ లను పైకి, కిందకి జరుపుకోగలిగేలా లేదా మధ్యలో నుంచి పూర్తిగా తొలగించగలిగేలా ఏర్పాట్లు ఉంటాయి. గుడ్లు, నీటి బాటిళ్లు, మందులు వంటివి పెట్టుకోవడానికి ప్రత్యేకంగా ట్రేలు, పార్టిషన్ లు ఉంటాయి. ఫ్రిజ్ అడుగు భాగంలో ఉల్లిపాయల వంటివి నిల్వ ఉంచుకోవడానికి వీలుగా ట్రే ఉంటుంది. మన అవసరాన్ని బట్టి ఇలాంటి సదుపాయాలున్న ఫ్రిజ్ లను ఎంచుకోవచ్చు. వీటి వల్ల ధరలో పెద్దగా మార్పేమీ ఉండదు కూడా.
  • కొన్ని కంపెనీలు కంప్రెసర్ వంటి ప్రధాన భాగాలపై ఏకంగా పదేళ్ల వరకూ వారెంటీ ఇస్తున్నాయి. ఇలా ఎక్కువ కాలం వారెంటీ ఇచ్చే మంచి కంపెనీల ఫ్రిజ్ ను ఎంచుకుంటే మంచిది.
  • అన్నింటికన్నా ముఖ్యంగా ఇన్వర్టర్ టెక్నాలజీతో పనిచేసే, ఎక్కువ స్టార్ రేటింగ్ కలిగిన రిఫ్రిజిరేటర్ ను తీసుకోవడం మంచిది.

సమస్యలు.. పరిష్కారాలు

కూలింగ్ సరిగా కాకపోతుండడం, ఫ్రీజర్ లో మంచు దట్టంగా గడ్డకట్టుకుపోవడం, డబుల్ డోర్ ఫ్రిజ్ లలో పైన ఫ్రీజర్ లో కూలింగ్ అవుతూ కింద ఫ్రిజ్ లో కూలింగ్ కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. కూలింగ్ కాకపోవడానికి ప్రధాన కారణం కంప్రెసర్ లో గ్యాస్ తగ్గిపోవడం, గ్యాస్ లీకేజీ, గ్యాస్ సర్క్యులేషన్ జరిగే పైపుల్లో అడ్డంకులు ఏర్పడడం, కంప్రెసర్ సరిగా పనిచేయకపోవడం వంటివే కారణం. వీటిని పరిశీలించడం ద్వారా పైపులను సరిచేయడం, కంప్రెసర్ లో గ్యాస్ నింపించడం ద్వారా కూలింగ్ పరిస్థితి మెరుగుపడుతుంది. ఇక ఫ్రీజర్ లో మంచు పేరుకుపోయి, డీఫ్రాస్ట్ బటన్ ను నొక్కినా మంచు అలాగే ఉండిపోతుంటుంది. కూలింగ్ సెన్సార్ లేదా హీటర్ సరిగా పనిచేయకపోవమే, డబుల్ డోర్ ఫ్రిజ్ లలో టైమర్ పనిచేయకపోవడం దీనికి కారణం. ఈ భాగాలను పరిశీలించి.. సంబంధిత భాగాన్ని మార్చడమో, మరమ్మతు చేయడమో చేస్తే సమస్య పరిష్కారమవుతుంది. ఇందుకోసం ఆ రిఫ్రిజిరేటర్ కంపెనీ ప్రతినిధితోగానీ, మంచి నిపుణులతోగానీ మరమ్మతు చేయించుకోవడం మంచిది.

ఫ్రిజ్ నిర్వహణలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

  • ఫ్రిజ్ లోని రిఫ్రిజిరెంట్ చుట్టుపక్కల ఆరేడు అంగుళాల దూరం నుంచి కూడా వేడిని గ్రహిస్తుంది. అందువల్ల ఎండపడే చోట, వేడిని విడుదల చేసే స్టవ్ ల వంటి వాటికి ఫ్రిజ్ ను దూరంగా ఉంచాలి
  • ఫ్రిజ్ ను పూర్తిగా గోడలకు, ఇతర పరికరాలకు ఆనించి ఉంచకూడదు. కనీసం ఐదారు అంగుళాలు ఖాళీ ఉండేలా చూడాలి
  • విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల కారణంగా ఫ్రిజ్ లోని పరికరాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందువల్ల తప్పనిసరిగా స్టెబిలైజర్ ను వాడండి
  • సమతలంగా ఉన్న ప్రదేశంలో ఫ్రిజ్ ను ఉంచడం మంచిది. లేకపోతే రిఫ్రిజిరెంట్ ను పంపిణీ చేసేటపుడు కంప్రెసర్ నుంచి శబ్దం వస్తుంది.
  • ఫ్రిజ్ తలుపును వీలైనంత త్వరగా మూసివేయాలి. లేకపోతే బయటి వేడి లోపలికి వెళుతుంది. తిరిగి చల్లబడడానికి విద్యుత్ ఖర్చు పెరుగుతుంది. విద్యుత్ సరఫరా లేని సమయంలో ఫ్రిజ్ తలుపు తెరవకుండా ఉంటే.. కూలింగ్ ఉండిపోయి ఆహార పదార్థాలు పాడవకుండా ఉంటాయి.
  • అవసరానికి మించి, పాడయిపోని వాటిని అన్నింటినీ ఫ్రిజ్ లో పెట్టవద్దు. దాంతో విద్యుత్ వినియోగం పెరుగుతుంది.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Articles (Education)