రాజీనామా విషయంలో మీడియా అత్యుత్సాహంఎలక్ట్రానిక్ మీడియాలో నిజానికి విలువ లేదు. వేగానికి మాత్రమే విలువ ఉంటుంది. తమకు తెలిసిన సమాచారం నిజమా? కాదా? అని నిర్ధరించుకోవడంకంటె... ప్రయారిటీతో, తమకు తెలిసిన సమాచారాన్ని అందరికంటె ముందు ప్రజల ముందు ఉంచడం మాత్రమే వారి ప్రాధాన్యంగా ఉంటుంది. ఇదే ధోరణిలో బుధవారం నాడు వైఎస్ జగన్ రాజీనామా విషయంలో కూడా దాదాపుగా అన్ని టీవీ ఛానెళ్లు కూడా కొంచెం అత్యుత్సాహాన్ని ప్రదర్శించాయనే చెప్పాలి. జగన్ సొంత ఛానెల్ అయిన సాక్షి తప్ప... మిగిలిన అన్ని ఛానెళ్లలోనూ జగన్ రాజీనామాను లోక్ సభ స్పీకరు వెంటనే ఆమోదించేశారని... క్షణాల్లో రాజీనామా ఆమోదం పొందిందని రకరకాలుగా స్క్రోలింగ్ లు వేసేశారు. నిజానికి జగన్ రాజీనామా ఇప్పటివరకు కూడా ఆమోదం పొందలేదు. జగన్ రాజీనామా లేఖ ఫ్యాక్స్ ద్వారా తమకు అందిందని మాత్రమే ఢిల్లీలోని స్పీకరు కార్యాలయం స్పష్టం చేసింది. అంతే తప్ప... మరే విషయాన్ని కూడా వారు నిర్ధరించలేదు. ఫిజికల్ గా లేఖ అందితే తప్ప లేదా నేరులో వచ్చి లేఖను సమర్పిస్తే తప్ప దాన్ని ఆమోదించడం కుదరదని వారు తేల్చిచెప్పారు. ఆ తర్వాత జగన్ తన రాజీనామా లేఖ కాపీని కొరియర్ ద్వారా పంపే ఏర్పాటు కూడా చేశారు. ఈలోగా ఛానెళ్లు అన్నీ లేఖ ఆమోదం పొందినట్లుగా వార్తలు పెట్టేయడం విశేషం. టీవీ ఛానెళ్ల మాయలో పడి కొన్ని పెద్ద పత్రికల్ వెబ్ సైట్ ఎడిషన్లు కూడా... జగన్ రాజీనామా క్షణాల్లో ఆమోదం పొందినదంటూ... వార్తలను నిన్న ఇచ్చేశారు. ఇలాంటివి జరిగినప్పుడు కనీసం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల పొరబాటుగా అలాంటి తప్పుడు సమాచారం ప్రసారం అయిపోయిందంటూ... వారు లేట్ నైట్ బులెటిన్స్ లో అయినా ఒక వివరణ లేదా సంజాయిషీ ఇచ్చుకునే సంప్రదాయాన్ని అలవాటు చేసుకుంటే బాగుంటుంది.