తానా ప్రపంచసాహిత్యవేదిక ఆద్వర్యంలో “విశిష్ట విశ్వ మహిళా అష్టావధానం” విజయవంతం

Related image

డాలస్, టెక్సాస్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం “తానా ప్రపంచసాహిత్యవేదిక” ఆద్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” (ప్రతి నెలా ఆఖరి ఆదివారం) లో భాగంగా ఆదివారం, నవంబర్ 27న జరిగిన 42వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం అతి వైభవంగా జరిగింది.

“అవధాన విద్వన్మణి” డా. బులుసు అపర్ణ అవధానిగా ఒక్కొక్క ఖండంనుండి ఒక మహిళా సాహితీవేత్త పృచ్చకురాలిగా పాల్గొన్న ఈ “విశిష్ట విశ్వ మహిళా అష్టావధానం” ప్రపంచంలోనే తొలి మహిళా అష్టావధానం గా తెలుగు సాహిత్యచరిత్రలో సరిక్రొత్త అధ్యాయం సృష్టించింది.

తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి తన స్వాగతోపన్యాసంలో ఈ నాటి ఈ సాహిత్య సభ వినూత్నము, విశిష్టమైనదని అతిథులందరకూ ఆహ్వానం పలికి సభను ప్రారంభించారు.

తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ – “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం ఎన్నో వైవిధ్య భరితమైన సాహిత్య అంశాలతో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న తానా ప్రపంచసాహిత్య వేదిక మీద ఈ నాటి డా. బులుసు అపర్ణగారి అష్టావధానం తెలుగు సాహిత్యలోకంలో ఒక మహత్తరఘట్టం అని అభివర్ణించారు.

తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహాకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ భారత దేశంనుండి మహిళా అవధాని, ప్రతి ఖండం నుండి పృచ్చకులు అందరూ మహిళలే పాల్గొన్న ఈ “విశిష్ట విశ్వ మహిళా అష్టావధానం” తెలుగు సాహిత్యచరిత్రలో మొదటిసారి అని, తానా సంస్థ సాహిత్య కిరీటంలో యిదొక కలికి తురాయి అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో తెలుగు ఉపాధ్యాయినిగా పనిచేస్తూ, ఇప్పటికే వివిధ నగరాలలో 5 శతావధానాలు, 200 కు పైగా అష్టావధానాలతో ఎంతోమంది సాహితీప్రియుల విశేష అభిమానాన్ని సంపాదించుకున్న అవధాని డా. బులుసు అపర్ణను మరియు వివిధ దేశాలనుండి పాల్గొన్న పృచ్చకురాండ్రకు తానా ప్రపంచసాహిత్యవేదిక తరపున ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ డా. తోటకూర అతిథులందరనూ క్లుప్తంగా పరిచయం చేశారు. .

ఈ అవధాన సంధానకర్తగా – ఉత్తరఅమెరికా ఖండం, అమెరికా, చికాగో నుండి డా. శారదాపూర్ణ శొంఠీ వేదమంత్రాలతో సభను ప్రారంభించి, ప్రతిభావంతంగా సభను సమన్వయం చేశారు.

పృచ్చకురాండ్రుగా -: సరోజ కొమరవోలు, ఉత్తరఅమెరికా ఖండం, కెనడా దేశంనుండి – “ఆశువు”; రాధిక మంగిపూడి, ఆసియా ఖండం, సింగపూర్ దేశంనుండి – “నిషిద్ధాక్షరి”; అరవిందా రావు, ఐరోపా ఖండం, ఇంగ్లాండ్ దేశంనుండి – “దత్తపది”; డా. శ్రీదేవి శ్రీకాంత్, దక్షిణాఫ్రికా ఖండం, బోట్స్వానా దేశంనుండి – “అప్రస్తుత ప్రసంగం”; ఉమ దేశభొట్ల, దక్షిణఅమెరికా ఖండం, గయానా దేశంనుండి – “వర్ణన”; డా. నాగలక్ష్మి తంగిరాల, ఆస్ట్రేలియాఖండం, న్యూజిలాండ్ దేశంనుండి - “వ్యస్తాక్షరి”; డా. నిడమర్తి నిర్మలాదేవి, ఉత్తరఅమెరికా ఖండం, అమెరికా దేశం, సియాటిల్ నుండి – “సమస్య”; శారద రావి, ఆసియా ఖండం, సౌదీఅరేబియా దేశంనుండి – “వార గణనం” అనే అంశాలలో పాల్గొన్నారు.

ఆసియాఖండం, సింగపూర్ దేశంనుండి – రాధిక మంగిపూడి “నిషిద్దాక్షరి” లో ఘంటసాల పాటలవైభవాన్ని కందపద్యరూపంలో చెప్పమని కోరుతూనే తాను నిషిద్దంచేసిన అక్షరాలను తప్పుకుంటూ అవధాని అపర్ణ చేసినపూరణ. శ్రీ మయ గాత్రాధీరా నీమములెల్లను గళాబ్ది నిత్య వికార స్తోమా! మహిసుర భావా! క్షేమ సుధల ఘంటసాల సీమల మీరున్ ఉత్తరఅమెరికా ఖండం, అమెరికా దేశంనుండి – డా. నిడమర్తి నిర్మలాదేవి ఇచ్చిన “సమస్య” పందిరల్లెను కృష్ణపక్షము పండువెన్నెల శోభతోన్ అన్న పాదానికి అవధాని అపర్ణ చేసిన పూరణ ... అందమౌ రసభావనావళినద్దినట్లుగ కావ్యమున్, స్పందనల్ కలుగంగ జేసెడు సర్వసుందరపేటియై, చిందులేయగ కృష్ణశాస్త్రియె స్నిగ్ధరంజితశబ్దమున్, పందిరల్లెను కృష్ణపక్షము పండువెన్నెలశోభతోన్. 

ఐరోపా ఖండం, ఇంగ్లాండ్ నుండి – అరవిందారావు ఇచ్చిన “దత్తపది” అంశం లో ఉత్పలమాల లో రామాయణార్ధం వచ్చేటట్లు చెప్పమని ఇచ్చిన రాధ కృష్ణుడు యశోద దేవకి అనే పదాలకు అవధాని అపర్ణ చేసిన పూరణ “మాధవుడి ద్దరిత్రి పెనుమాయను వర్ణము నందు కృష్ణుడా రాధన తత్వధర్మువు పరాత్పర మూర్తియు దేవ కీర్తికై సాధన చేసి రాముడిల సత్పథదర్శక మంత్ర వాగ్మియై బాధను తీర్ప జేరెను ప్రభాయుత బోధన నీయ శోధనన్” 

దక్షిణఅమెరికా ఖండం, గయానా దేశం నుండి - ఉమ దేశిభొట్ల కోరిన “వర్ణన” అంశం: కోవిడ్ పుణ్యమా అని అన్నీ ఆన్లైన్లో జరిగాయి. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు చెరోచోట ఉండగా జూంలో ధూంధాంగా జరిగిన పెళ్ళిని మీకు ఇష్టమైన పద్యరూపంలో వర్ణించండి. అవధాని అపర్ణ పూరణ: వరునకు కన్యకున్ మనకు బ్రహ్మకు బందుగులెల్లవారికిన్, పరులకు పాకవీరులకు పందిరి వేసిన శ్రామికాళికిన్, తరమది కాదు చూచుటకు తథ్యము నొండొరులెంత కోరినన్, మర బ్రతుకయ్యె నీ కలిని మారకయుండును మార్పు నొక్కటే 

ఉత్తరఅమెరికా ఖండం, కెనడా దేశంనుండి – సరోజ కొమరవోలు “ఆశువు” అనే అంశంలో ప్రతి ఆవృత్తంలోను ఒకొక్క సందర్భంఇచ్చి ఆశువుగా పద్యాలు చెప్పమని కోరగా అవధాని అపర్ణ చెప్పిన ఆశుకవిత్వం. సందర్భం: ఇందిరాగాంధీ, మార్గరేట్ థాచర్లను మొల్లతో సమన్వయిస్తూ ఆశువుగా .. పద్యం: దేశమును నడుపు దేశమున్న యటుల దీక్ష బూనునట్టి దక్షతలను మొల్ల కావ్యమందు అల్లెను నేర్పులను నడిపె కావ్యామందు నరుని బ్రతుకు. సందర్భం: ఈరోజు ఈ మహిళా అవధానం కె. విశ్వనాథ్ గారు "అవధానం" అనే పేరుతో అమూల్యమైన సినిమా తీస్తే, అందులో మీరు కథానాయకి అయితే ..ఎలావుంటుంది? పద్యం: బ్రహ్మ సృష్టిచేయ భవ్యవధానమందు ఈ అపర్ణయందు విశ్వనాధు లొకట వేదిక నుండగా విశ్వనాథ మహిమ విలసిల్లు. సందర్భం: జనవరి, ఫిబ్రవరి నెలల్లో కెనడాలో విపరీతంగా చలి, మంచు, ఐస్ తో జారుతూంటుంది. అది మీరు చూస్తే మీ అనుభూతి ఎట్లా ఉంటుంది? పద్యం: వణికించెడు చలి యొకటను గణములు ప్రాసలు యతులును గళమున నొకటను గణగణ ద్వనులను చేయగ గణుతింపదె కెనడనన్ను ఘనమగు రీతిన్. సందర్భం: నాయకురాలు నాగమ్మ, రంగాజమ్మలతో ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ని పోల్చుతూ .. ఆశువు పద్యం: పురుష జాతికేల పూర్ణ రంగశ్రీలు అతివ లఘువు కాదు అవనిలోన నాతి పూనుకొనిన నాయకురాలగు ఆమె ఖ్యాతి ముందు అణగునన్ని. 

దక్షిణఅమెరికా ఖండం, న్యూజిలాండ్ దేశంనుండి – డా. తంగిరాల నాగలక్ష్మి “వ్యస్తాక్షరి” అంశంలో.. 21 అక్షరాలను అడ్డదిడ్డంగా ఇస్తే వాటిని 4వ ఆవృత్తంలో అవధాని అపర్ణ చేసిన పూరణ “మహిళావధాని మణిరత్నరంజిత శారదాంబ ఈ అపర్ణ”

ఆసియా ఖండం, సౌదీఅరేబియా దేశంనుండి – దీపికా రావి “వార గణనం” అంశంలో నాల్గు ఆవృత్తాలలో అడిగిన నాల్గు ప్రశ్నలు మే 1, 1861 ఏ రోజు అంటే – అవధాని ‘బుధవారం’ అని, ఏప్రిల్ 20, 1950 – ‘గురువారం’ అని, డిసెంబర్ 8, 1932 – ‘గురువారం’ అని, ఏప్రిల్ 2 , 2121 – ‘బుధవారం’ అని వెనువెంటనే సమాధానాలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరచారు.

దక్షిణాఫ్రికా ఖండం, బోట్స్వానా దేశంనుండి – అవధానికి ఆద్యంతం అంతరాయం కల్పిస్తూ డా. శ్రీ దేవి శ్రీకాంత్ “అప్రస్తుత ప్రసంగం” అనే అంశంలో “రాయిని రాముడు తాకితే అహల్య అయ్యింది కదా! మేముండే బోట్స్వానా వజ్రాలకు ప్రసిద్ది. శ్రీ రాముడు బోట్స్వానా వచ్చి వజ్రాలను తాకితే వజ్రం ఎవరుగా మారుతుంది?” “ముగ్గురు మూర్తుల జూట. మూలము నెరుగుట బాట అన్నారు. ఈ ముగ్గురు ఎవరు? మూలము ఏమిటి?” “గుర్రం, గాడిదలలో ఏది గొప్పది? మా ఆఫ్రికాలో గాడిద గొప్పదంటారు. మీకు గాడిద బహుమానంగా ఇస్తే ఏ దేశీయులకు అమ్ముతారు? ఎందుకని?” “అత్రికి మహాపతివ్రత యైన అనసూయ ధర్మ పత్ని... మరి పత్రికి ప్రీతి పాత్రుడు ఎవరు? ఎందుకని?” అంటూ శ్రీదేవి అడిగిన చిలిపిప్రశ్నలకు అవధాని అపర్ణ తన కొంటె సమాధానాలతో సభలో నవ్వులు పూయించారు. ఆద్యంతం ఛలోక్తులతో రసవత్తరంగా అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాలం లో జరిగిన ఈ “విశిష్ట విశ్వ మహిళా అష్టావధానం” లో అవధాని డా. బులుసు అపర్ణ కు తానా ప్రపంచసాహిత్యవేదిక సాహిత్యాభిమానులందరి తరపున “అవధాన సరస్వతి” అనే బిరుదును ప్రదానం చేశారు.

అవధాని డా. బులుసు అపర్ణ తన ముగింపుసందేశంలో అనేక దశాబ్దాల చరిత్రగల్గిన తానా లాంటి విశ్వవేదిక మీద అష్టావధానం చేయడం తన అదృష్టమని, ఈ అవకాశం కల్పించిన తానా సంస్థకు, పృచ్చకులకు, సాహితీప్రియులకు, ప్రసారమాధ్యమాలకు పత్యేక కృతజ్ఞతలు అన్నారు.

More Press Releases