గొర్రెల పెంపకంలో రాజస్థాన్ ను మించిన తెలంగాణ

Related image

 మాంసం ఉత్పత్తిలో స్వయం సమృద్ది వైపు వేగంగా పయనిస్తున్న తెలంగాణ రాష్ర్టం
 మొదటి విడతలో రూ 5 వేల కోట్లతో 3.94 లక్షల మందికి 82.74 లక్షల గొర్రెలను పంపిణీ చేసిన ప్రభుత్వం
 రెండవ విడతలో 3.50 లక్షల మంది లబ్దిదారులకు రూ. 6125 కోట్ల వ్యయంతో 73.50 లక్షల గొర్రెలను పంపిణీ చేయనున్న ప్రభుత్వం
 గొర్రెల యూనిట్ విలువను రూ.1,25,000/- నుండి రూ.1,75,000/- లకు పెంచిన ప్రభుత్వం.
 తెలంగాణ లో గణనీయంగా పెరిగిన మాంసం వినియోగం.
 జాతీయ మాంసం సగటు వినియోగం 5.4 కేజీలు వుంటే , తెలంగాణ సగటు మాంసం వినియోగం 21.17 కేజీలు.
 గొర్రెల పంపిణీ పథకంతో రాష్ట్రానికి తగ్గిన మాంసం దిగుమతులు

      ఉమ్మడి పాలనలో వివక్షకు , నిర్లక్ష్యానికి గురైన పల్లెలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటంతో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు దార్శనిక పాలనలో నూతన జవసత్వాలు సంతరించుకుంటున్నాయి. జీవనాధారం కోల్పోయిన కులవృత్తులపై ఆధారపడిన కుటుంబాలు పునరుజ్జీవం పొందుతున్నాయి. గొల్ల కుర్మ కుటుంబాలకు సబ్సిడి పై గొర్రెల యూనిట్లను అందచేసే పధకాన్ని 2017 సంవత్సరం లో ప్రభుత్వం ప్రారంభించింది.

గొర్రెల పంపిణీ పధకము ప్రారంభించడానికి ముందు రాష్ట్రం లో 3,969 ప్రాధమిక గొర్రెల మేకల సహకార సంఘాల లో మొత్తంనమోదుచేయబడిన సభ్యులు 2,24,457 మంది మాత్రమే ఉన్నారు. దీనిని దృష్టి లో వుంచుకొని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమం నిర్వహించి రాష్ట్రంలో ఉన్న 18 సంవత్సరములు నిండిన ప్రతిఒక్క గొల్ల కురుమ ను సొసైటీలలో సభ్యులుగా చేర్పించడంతో సంఘాల సంఖ్య 8109 కు పెరిగి, సభ్యుల సంఖ్య 7.61 లక్షల మంది కి చేరింది.

   గ్రామసభల ద్వారా 8109 సంఘాల లో వున్న అర్హులైన 7.31 లక్షల మంది లబ్దిదారులను ఎంపిక చేసి మొదటి విడుతలో 3.94 లక్షల మందికి రూ. 5001.53 కోట్ల (దీనిలో ప్రభుత్వ సబ్సిడీ రూ. 3,751.14 కోట్లు కాగా లబ్దిదారుల వాటా రూ.1250.38 కోట్లు.)ఖర్చు తో 82.74 లక్షల గొర్రెల ను ప్రభుత్వం పంపిణీ చేసింది.

గొర్రె కాపరుల సంక్షేమాన్ని దృష్టి లో వుంచుకొని రెండవ విడత లో గొర్రెల యూనిట్ధ రను రూ. 1,25,000/- నుండి రూ. 1,75,000/- లకు ప్రభుత్వం పెంచింది. రెండవ విడతలో 3.50 లక్షల మంది గొల్ల కుర్మ లకు 73.50 లక్షల గొర్రె లను పంపిణీ చేయుటకు ప్రభుత్వము ప్రణాళిక రూపొందించింది.  

దీనికిగానూ రూ. 6,125 కోట్లను ఖర్చుచేయడం జరుగుతుంది. దీనిలో ప్రభుత్వ సబ్సిడి రూ. 4,593.75 కోట్లు కాగా లబ్దిదారుని వాటా రూ.1,531.25 కోట్లు వుంటుంది మాత్రమే. రెండవ విడత గొర్రెల యూనిట్ల పంపిణీ పధకానికి జాతీయ సహకార అభివృద్ది సంస్థ (NCDC) రూ. 4,563.75 కోట్ల ఋణమును మంజూరు చేసింది. త్వరలో ఈ నిధులు కూడా విడుదల అవుతాయి. వెంటనే 8109 సంఘాలలో వున్న ప్రతి లబ్దిదారునికీ ఈ పధకం క్రింద గొర్రెల యూనిట్లను ప్రభుత్వం అందజేస్తుంది.

    గొర్రెల పధక అమలు వలన కలిగిన ఫలితాలు:


భారత ప్రభుత్వము వారి లెక్కల ప్రకారం, తెలంగాణలో పధక అమలుకు ముందు మరియు పధక అమలు తరువాత గొర్రెల సంఖ్య , మాంస ఉత్పత్తి లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తున్నది. గత 4 సంవత్సరాలలో రాష్ట్రం లో 9.75 లక్షల మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తి జరిగినది. 2019 లో జరిగిన 20 వ జాతీయ పశు గణ లెక్కల ప్రకారము 190.63 లక్షల గొర్రెలతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానం లో నిలిచింది. ఇది 2012 లో జరిగిన 19 వ జాతీయ పశు గణ లెక్కల తో పోలిస్తే (గొర్రెల సంఖ్య 128.35 లక్షలు) 48.52 శాతం ఎక్కువగా వున్నది.

    
పంపిణీ చేసిన గొర్రెల ద్వారా సుమారు 1 కోటి 32 లక్షల గొర్రె పిల్లలు పుట్టడం జరిగినది . వీటి ద్వారా గ్రామాలలో రూ. 7920 కోట్ల సంపద సృష్టించబడినది. వీటిద్వారా 1.11 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు మాంసం వుత్పత్తి జరిగినది. 

ఈ పధక అమలుతో మాంసం ఉత్పత్తి లో గణనీయమైన మార్పు వచ్చింది. భారత ప్రభుత్వము వారి ఆమోదిత లెక్కల ప్రకారం రాష్ట్రం లో 2015-16 లో గొర్రె మాంసం ఉత్పత్తి 1.35 లక్షల మెట్రిక్ట న్నులు కాగా 2020-21 లో గొర్రె మాంసం ఉత్పత్తి 3.03 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. 2015-16 తో పోల్చితే మాంస ఉత్పత్తిలో 124% పెరుగుదల ఉన్నది. గొర్రె యాట మాంసం యొక్క వినియోగం రాష్ట్రం లో బాగా పెరిగింది. మన రాష్ట్రం లో మాసాహారుల శాతం బాగా పెరిగింది.(98.70% ). జాతీయ సగటు మాంస వినియోగము 5.4 కేజీ లు కాగా తెలంగాణలో సగటు మాంస వినియోగము 21.17 కేజీలుగా వున్నది . గతము తో పోలిస్తే గొర్రెల పధకము అమలు తరువాత ఇతర రాష్ట్రాలనుండి దిగుమతి అయ్యే గొర్రెలు మేకల సంఖ్య గణనీయముగా తగ్గినది. పధక ప్రారంభానికి ముందు ప్రతి రోజూ సుమారు 600-700 లారీల గొర్రెలు మేకలు మన రాష్ట్రానికి వచ్చేవి ప్రస్తుతం వాటిసంఖ్య గణనీయంగా సుమారు 80 - 100 లారీలకు తగ్గింది.

గొల్ల, కురమ వర్గాల కుటుంబాలు తమ సంప్రదాయ వృత్తులలో సాధికారత సాధించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందనే ఉద్దేశ్యంతో రెండు విడతలలో కలుపుకుని మొత్తంగా రూ.11 వేల కోట్లను ఇప్పటి వరకు ఈ పథకం కోసం ప్రభుత్వం కేటాయించింది. మొదటి విడతలో లాగానే గొర్రెల యూనిట్ సంఖ్య 21 ఉండగా.. గతంలో రూ.1,25,000గా ఉన్న యూనిట్ ధరను రూ.1,75,000కు పెంచింది. ఇందులో రూ.1,31,250ను తెలంగాణ ప్రభుత్వం గ్రాంటుగా భరిస్తుండగా.. రూ.43,750ను లబ్దిదారుడు తన వాటా క్రింద భరించాలి. ఒక్కో యూనిట్ కింద 21 గొర్రెలను ఇస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో తెలంగాణలో గొర్రెల సంఖ్య భారీగా పెరిగి రాజస్థాన్‌ను అధిగమించి, దేశంలోనే అగ్రస్థానానికి చేరుకుంది.

ఒకవేళ ఈ పథకంలో పొందిన గొర్రెలు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం ఒక్కో గొర్రెకు రూ.5 వేల ఇన్సూరెన్స్ఇ స్తుంది. పొట్టేలుకు రూ.7 వేలను అందిస్తుంది. పది రోజుల్లోనే ఈ ఇన్సూరెన్స్ డబ్బులను లబ్దిదారుల ఖాతాల్లోకి వస్తుంది.గొర్రెలకు, పొట్టేళ్లకు కావాల్సిన మేత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం 75 శాతం రాయితీని ఇస్తున్నది.

గొర్రెల యూనిట్లతో గొల్ల కుర్మల జీవనోపాధి పెంపుదలతో పాటు మాంసం ఉత్పత్తిలో స్వయం సమృద్దివైపు తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ది చెందుతున్నది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతున్నది.

More Press Releases