ప్రతీ జిల్లాల్లో అటవీ శాఖ పరిధిలో ఒక సెంట్రల్ నర్సరీ ఏర్పాటు: ఆర్ఎం డోబ్రియాల్

Related image

  • రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రహదారుల్లో ఎవెన్యూ ప్లాంటేషన్
  • మరింత చిక్కగా, పచ్చగా రాజీవ్ రహదారి
  • అన్ని జిల్లాల అటవీ అధికారులతో పీసీసీఎఫ్ & హెచ్ఓఓఎఫ్ వీడియో కాన్ఫరెన్స్
తెలంగాణకు హరితహారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మరింత చిక్కటి పచ్చదనం పెంచేలా చర్యలు తీసుకోవాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్ & హెచ్ఓఓఎఫ్) ఆర్.ఎం. డోబ్రియాల్ అన్ని జిల్లాల అటవీ అధికారులను కోరారు. అరణ్య భవన్ నుంచి ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

త్వరలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు జిల్లాల పర్యటన ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో హరితహారం నిర్వహణ, అటవీ పునరుద్దరణ, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, అటవీ అనుమతుల ప్రక్రియపై సమావేశంలో చర్చించారు.

ప్రతీ జిల్లాకు ఒకటి చొప్పన తక్షణం ఒక సెంట్రల్ నర్సరీని ఏర్పాటు చేయాలని తెలిపారు. కనీసం ఐదు లక్షల పెద్ద మొక్కలు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. దశల వారీగాఈ సెంట్రల్ నర్సరీల సంఖ్యను పెంచాలని అటవీ శాఖ నిర్ణయించింది. రహదారి వనాలు (ఎవెన్యూ ప్లాంటేషన్) రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రహదారులకు విస్తరించాలని, ఇప్పటికే పూర్తయిన చోట్ల ఎక్కడైనా చెట్లు చనిపోతే గ్యాప్ ప్లాంటేషన్, అంతే ఎత్తయిన మొక్కలతో చేపట్టాలని తెలిపారు. రాజీవ్ రహదారి వెంట పచ్చదనం మరింతగా పెంచేలా ఆయా జిల్లాల పరిధిలోకి వచ్చే అధికారులు శ్రద్ద పెట్టాలని సూచించారు. అర్బన్ ఫారెస్ట్ పార్కుల నిర్వహణపై ఎలాంటి ఫిర్యాదుల రాకుండా చూడాలని, పచ్చదనం, పరిశుభ్రతలో అర్బన్ ఫారెస్ట్ పార్కులు పర్యావరణహితంగా ఉండాలన్నారు.

అటవీ పునరుద్దరణ పనులు, పురోగతిపై పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్ సమీక్షించారు. అడవుల ప్రాధాన్యత, పునరుద్దరణ ద్వారా సాధించిన ప్రగతిని ముఖ్యమంత్రితో పాటు, ప్రముఖుల పర్యటనల సందర్భంగా ఫోటోలు, వీడియోలతో ప్రదర్శించాలని జిల్లాల అధికారులకు సూచించారు.

వివిధ అభివృద్ది, సంక్షేమ పథకాల కోసం అటవీ భూముల మళ్లింపు అవసరమైన చోట్ల అనుమతుల ప్రక్రియ వేగంగా జరిగేలా క్షేత్ర స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని పీసీసీఎఫ్ (ప్రొడక్షన్) ఎం.సీ. పర్గెయిన్ కోరారు. మళ్లింపులో భాగంగా రెవెన్యూ నుంచి తీసుకున్న భూములను నోటిఫై చేయటంతో పాటు, ప్రత్యామ్నాయ అటవీకరణ సత్వరం చేపట్టాలని తెలిపారు.

ఈ సమీక్షా సమావేశంలో అన్ని అటవీ సర్కిళ్లకు చెందిన చీఫ్ కన్జర్వేటర్లు, జిల్లాల అటవీ అధికారులు, డీసీఎఫ్ శాంతారాం, శ్రీనివాసరావులు పాల్గొన్నారు.

More Press Releases