గాంధీజీ భావజాలాన్ని పెంపొందించేందుకు పుస్తక ప్రదర్శన దోహదం: సీఎస్ సోమేశ్ కుమార్

Related image

  • ఎల్.బి స్టేడియంలో పుస్తక ప్రదర్శనను సందర్శించిన సి.ఎస్, డీజీపీ
హైదరాబాద్, ఆగస్టు 20 :: "మంచి పుస్తకం మన చెంత ఉంటే మంచి మిత్రుడు లేని లోటు తీరినట్లే" నన్న గాంధీ చెప్పిన సూక్తిని యువతరం ఆకలింపు చేసుకొని విస్తృత పుస్తక పఠనంచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పిలుపునిచ్చారు.

భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర సాహిత్య అకాడమీ, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా ప్రత్యేక పుస్తక ప్రదర్శనను ఎల్బీ స్టేడియం టెన్నిస్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేశాయి. డీజీపీ మహేందర్ రెడ్డి తోసహా ఇతర సీనియర్ అధికారులతో కలసి సి.ఎస్ సోమేశ్ కుమార్ ఈ పుస్తక ప్రదర్శనను సందర్శించారు. ఈ సందర్బంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంకల్పం మేరకు ద్విసప్తాహ కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ తెలిపారు. వజ్రోత్సవాల సందర్భంగా గాంధీ ఆశయాలను, భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేసే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వజ్రోత్సవ పుస్తక ప్రదర్శన మంచి సందేశాన్ని సమాజానికందించిందని తెలిపారు. ఈ తరంలోకి గాంధీ భావాలను తీసుకుపోవాలన్న కేసీఆర్ అలోచనలకు ప్రతీకగా పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేయటాన్ని అభినందించారు.

ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న వజ్రోత్సవ పుస్తక ప్రదర్శనను తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి శనివారం మధ్యాహ్నం సందర్శించి, మొదట మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పుస్తకాల స్టాల్స్ ను సందర్శించారు. అలాగే ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గాంధీ చరకాను, చేనేత మగ్గాన్ని, ఎద్దు గానుగ యంత్రాన్ని ఆసక్తిగా తిలకించారు. పుస్తక ప్రదర్శనను చక్కగా ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. అనంతరం సిఎస్ సోమేష్ కుమార్ కు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ చరకాను బహుకరించారు.

ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, అడిషనల్ డీజీ జితేందర్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఉన్నత విద్యా శాఖ కమీషనర్ నవీన్ మిట్టల్, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, రవాణా శాఖ కమీషనర్ బుద్ధా ప్రకాష్, జీహెచ్ ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ అమయ్ కుమార్, TSICC నరసింహారెడ్డి, సమాచార  శాఖ డైరెక్టర్ బి. రాజమౌళి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి, హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ సెక్రటరీ కోయ చంద్రమోహన్, యానాల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More Press Releases