జగనన్న జన్మదిన కానుక 'సంపూర్ణ గృహ హక్కు పథకం': ఎమ్మెల్యే మల్లాది విష్ణు

Related image

  • అర్హులందరూ ఓటీఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజ‌య‌వాడ‌:వాంబే కాలనీ హెచ్ బ్లాక్ కమ్యూనిటీ హాల్ నందు ఓటీఎస్ పై నియోజకవర్గ ప్రజలకు శాసనసభ్యులు మల్లాది విష్ణు అధ్యక్షతన అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) శ్రీవాస్ నుపుర్ అజయ్ కుమార్, సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్, నవరత్నాలు కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌ నాగ నారాయణమూర్తి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమములో శాసన సభ్యులు మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గారి జన్మదిన కానుక సంపూర్ణ గృహ హక్కు పథకమని దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఒక్క మాటతో వాంబే కాలనీలో దాదాపు 1,200 మంది పేదలు గృహ యజమానులుగా మారారని గుర్తు చేశారు. ప్రభుత్వం కేవలం రూ. 20 వేలకు లబ్ధిదారులకు సంపూర్ణ ఇంటి హక్కులను కల్పిస్తూ వారికి ఆస్తిని సృష్టిస్తున్నారన్నారు.

గత ప్రభుత్వం  హయాంలో రూ. 60 వేలు చెల్లించిన లబ్ధిదారులకు కూడా మిగిలిన మొత్తం వెనక్కి ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తామని హామీనిచ్చారు. వీరితో పాటు నున్న సబ్ రిజిస్ట్రార్ పరిధిలో 2,800 మందికి, గాంధీనగర్ సబ్ రిజిస్ట్రార్ పరిధిలో నిషేధిత జాబితా(చేతులు మారిన ఇళ్లు)లో ఉన్న 2,500 మందికి కూడా ఓటీఎస్ వర్తించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

అదే విధంగా వాంబే కాలనీలోకి సంబంధించి 3,373 ప్లాట్లను కూడా ఒకేసారి రిజిస్ట్రేషన్ చేసే విధంగా ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. దీని వల్ల లబ్ధిదారులకు సంపూర్ణ హక్కులు వస్తాయని, 22 ఏ నిబంధన కింద సమస్యలు కూడా ఉత్పన్నం కావని స్పష్టం చేశారు.

నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ లబ్ధిదారుడు స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే రిజిస్ట్రేషన్‌ చేస్తామని తెలిపారు. హౌసింగ్ కార్పొరేషన్ వద్ద ఋణం తీసుకోని వడ్డీ మీద వడ్డీలు కట్టలేని పరిస్థితిలో ఆ స్థలముపై ఏ విధమైన హక్కులు లేకపోవుట చేత రిజిస్ట్రేషన్ జరుగక అత్యవసర పరిస్థుతులలో అమ్ముకొనుటకు అవకాశం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారికీ ఏ విధమైన షరతులు లేకుండా డిసెంబర్ 21వ తేది నుండి సచివాలయములలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని అన్నారు.

ఇందుకొరకు లోన్ పొందిన వారు రూ.20,000/- మరియు లోన్ పొందని వారు రూ. 10 చెల్లించి వన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీం కింద రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చన్నారు. తద్వారా ఆ స్థలంపై పూర్తి హక్కు వస్తుందని చెప్పారు. దీనిపై ఏమైనా అనుమానాలు ఉన్న యెడల నగరపాలక సంస్థ అధికారులను సంప్రదించవలెనని, అపోహలు సృష్టిoచే వారి మాటలు నమ్మవద్దని అన్నారు.

తదుపరి జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) శ్రీవాస్ నుపుర్ అజయ్ కుమార్, సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ వన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీం యొక్క విధానమును వివరిస్తూ, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, కార్పొరేటర్లు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం బ్రోచర్ ను ఆవిష్కరించారు.

కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉమ్మడి రమాదేవి వెంకట్రావు, అలంపూర్ విజయలక్ష్మి, ఇసరపు దేవి, జానారెడ్డి, యర్రగొర్ర తిరుపతమ్మ, పీడీ హౌసింగ్ కె.రామచంద్రన్, నగరపాలక సంస్థ  సిటీ ప్లానర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 

More Press Releases