తెలంగాణ రాష్ట్ర పర్యటనకు ఏప్రిల్ లో రానున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ

Related image

  • పచ్చదనం పెంపు, అడవుల పునరుజ్జీవనం, ప్రత్యామ్నాయ అటవీకరణ పనులపై అధ్యయనం
  • తెలంగాణలో పర్యటించనున్న జై రామ్ రమేశ్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ
  • అన్ని జిల్లాల అటవీ అధికారుల వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడించిన పీసీసీఎఫ్ ఆర్.శోభ
హైదరాబాద్: తెలంగాణకు హరితహారం ద్వారా పచ్చదనం పెంపులో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాష్ట్రానికి మరో గుర్తింపు దక్కనుంది. పచ్చదనం పెంపు, అడవుల పునరుజ్జీవనం, ప్రత్యామ్నాయ అటవీకరణ పనుల్లో తనదైన ముద్ర వేసిన తెలంగాణ రాష్ట్రంలో పర్యటించి అధ్యయనం చేయాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. సీనియర్ పార్లమెంటేరియన్ జై రామ్ రమేశ్ నేతృత్వంలో సుమారు 25 మంది ఎంపీలు, ఉన్నతాధికారుల బృందం ఏప్రిల్ నెలలో ఐదురోజుల పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తారని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్.శోభ వెల్లడించారు. అరణ్య భవన్ నుంచి అన్ని జిల్లాల అటవీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

అడవుల్లో వేసవి సమస్యలు, అగ్ని ప్రమాదాల నివారణ, జంతువులకు నీటి లభ్యత, కంపా నిధుల ద్వారా చేపట్టిన పనుల పురోగతి, వచ్చే సీజన్ హరితహారం కోసం ఏర్పాట్లు, అటవీ అనుమతులు తదితర విషయాలపై చర్చించారు.

డెభై ఐదు సంవత్పరాల స్వాతంత్ర్య ఉత్సవాల సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయని, అటవీ శాఖ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. జిల్లాకు ఒకటి చొప్పున సమస్యాత్మక అటవీ గ్రామాలను గుర్తించటం, అడవుల ప్రాముఖ్యత, అటవీ నేరాల అదుపు, ఆక్రమణలు, జంతువుల వేట, అగ్ని ప్రమాదాల నివారణ, తదితర అటవీ సంబంధిత విషయాలపై అక్కడి ప్రజలను చైతన్యవంతం చేయాలని నిర్ణయించారు.

వివిధ ప్రమాదాలు, దాడుల్లో చనిపోయిన జంతువుల నమూనాల సేకరణ, విచారణకు సంబంధించి క్షేత్రస్థాయి అటవీ అధికారులకు సీసీఎంబీ (Centre for Cellular & Molecular Biology) మార్చి నెలలో రెండు రోజుల పాటు (18,19న) శిక్షణా కార్యక్రమం అందిస్తుందని వెల్లడించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, మన్ననూరులో ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు. అటవీ జంతువుల దాడులు, ఇతర కేసుల్లో సంక్లిష్టతలను చేధించేందుకు, కేసుల విచారణ వేగవంతం చేసేందుకు కచ్చితమైన నమూనాల సేకరణ కీలకమని అన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ)ఆర్.ఎం.దోబ్రియల్, పీసీసీఎఫ్ (అడ్మిన్) స్వర్గం శీనివాస్, అదనపు పీసీసీఎఫ్ లు, సర్కిల్ ఇంఛార్జ్ లు, అన్ని జిల్లాల అటవీ అధికారులు పాల్గొన్నారు.

More Press Releases