విశాఖ గ్యాస్ లీకేజీ సంఘటనపై ఏపీ గవర్నర్ దిగ్ర్బాంతి

Related image

  • విశాఖ గ్యాస్ లీకేజీ సంఘటనపై గవర్నర్ దిగ్ర్బాంతి
  • మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం ప్రకటించిన బిశ్వ భూషణ్
  • సహాయ, పునరావాస చర్యలపై సియంతో చరవాణిలో మాట్లాడిన గవర్నర్
  • వైద్య శిబిరాల నిర్వహణలో సహాయపడాలని రెడ్ క్రాస్ శ్రేణులకు ఆదేశం
 విజయవాడ, మే 07: విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం సమీపంలోని ఆర్ఆర్ వెంకటపురం గ్రామంలోని ఎల్ జి పాలిమార్స్ కర్మాగారంలో గురువారం తెల్లవారుజామున గ్యాస్ లీకైన సంఘటనపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూసన్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటన నేపధ్యంలో గవర్నర్ ప్రభుత్వ పరంగా జరుగుతున్న సహాయ, పునరావాస చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చరవాణి ద్వారా మాట్లాడారు.

బాధితులకు సత్వర సహాయం అందించే దిశగా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గవర్నర్ కు వివరించారు. జిల్లా యంత్రాంగం చేపట్టిన వేగవంతమైన చర్యలతో పాటు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించడం, సాయిధ దళాలు స్వచ్ఛందంగా సహాయ చర్యలలో పాల్గొనటం వంటి అంశాలను గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివరించారు.

సహాయ, తాత్కాలిక పునరావాస కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టామని, వివిధ శాఖల మధ్య సమన్వయంతో బాధితులకు మెరుగైనా సేవలు అందుతున్నాయని సిఎం గవర్నర్‌కు తెలియజేశారు. ఈ సంఘటనలో ఎనిమిది మంది మరణించారని, మూడు వందలకు పైగా ప్రజలు ఆసుపత్రులలో ప్రాణాపాయ స్దితిలో ఉన్నారని గవర్నర్ గుర్తించారు. బాధిత వ్యక్తులకు ఆస్పత్రులలో అత్యున్నత వైద్యం అందించాలని గవర్నర్ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రమాద ఫలితంగా మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు గవర్నర్ తీవ్ర సంతాపం తెలిపారు.

చికిత్స పొందుతున్న బాధితులు వేగంగా కోలుకోవాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు గవర్నర్ నేతృత్వంలో సేవా కార్యక్రమాలు నిర్వహించే రెడ్ క్రాస్ వ్యవస్ధను సమాయత్త పరిచిన బిశ్వ భూషన్ సహాయ కార్యక్రమాలలో పాల్గొనాలని ఆదేశించటమే కాక, రెడ్ క్రాస్ వైద్య బృందాలు ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పని చేసేలా చూడాలని రాజ్ భవన్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాకు సూచించారు. అవసరాన్ని బట్టి ఇతర ప్రాంతాల రెడ్ క్రాస్ వాలంటీర్లు కూడా సేవా కార్యక్రమాలలో పాల్గొనేలా చూడాలన్నారు.

More Press Releases