మూవీ రివ్యూ : 'హ్యాపీ బర్త్ డే '

Happy Birthday

Movie Name: Happy Birthday

Release Date: 2022-07-08
Cast: Lavanya tripathi, Vennela Kishore, Sathya, Rahul Ramakrishna
Director:Rithesh Rana
Producer: Hemalatha
Music: Kalabhairava
Banner: Mythri Movie Makers
Rating: 2.00 out of 5
  • ఈ రోజునే థియేటర్లకు వచ్చిన 'హ్యాపీ బర్త్ డే'
  • ప్రధానమైన పాత్రను పోషించిన లావణ్య త్రిపాఠి 
  • బలహీనమైన కథాకథనాలు 
  • సిల్లీ కామెడీతో కూడిన సన్నివేశాలు 
  • ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్షనే

త్రిపాఠి ప్రధానమైన పాత్రగా 'హ్యాపీ బర్త్ డే' సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ .. క్లాప్ ఎంటర్టైన్ మెంట్స్  వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి రితేశ్ రానా దర్శకత్వం వహించాడు. వెన్నెల కిశోర్ .. సత్య .. నరేశ్ అగస్త్య .. రాహుల్ రామకృష్ణ .. గుండు సుదర్శన్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. కామెడీ కంటెంట్ ను ఒక కొత్త ట్రీట్మెంట్ తో అందించడానికి దర్శకుడు ప్రయత్నించాడనే విషయం అప్ డేట్స్ ను బట్టి అర్థమైపోయింది. కాలభైరవ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో మెప్పించిందనేది చూద్దాం.

హ్యాపీ (లావణ్య త్రిపాఠి) తన బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం ఒక హోటల్ కి వెళుతుంది. ఆ హోటల్లో లక్కీ (నరేశ్ అగస్త్య) వెయిటర్ గా పనిచేస్తుంటాడు. తన తల్లిని బ్రతికించుకోవడం కోసం .. తన చెల్లెళ్ల పట్ల తన బాధ్యతను నెరవేర్చడం కోసం అతనికి డబ్బుకావాలి. అందుకోసం గూండా (రాహుల్ రామకృష్ణ) అప్పగించిన ఒక ప్రమాదకరమైన పనిని చేయడానికి అతను సిద్ధపడతాడు. ఆ హోటల్లో ఉన్న ఒక విదేశీయుడి నుంచి ఒక లైటర్ ను కొట్టేస్తాడు. ఆ లైటర్ ను హ్యాపీతో పాటు బయటికి పంపించడానికిగాను ఆమెకి తెలియకుండా ఆమె పర్స్ లో వేస్తాడు.

ఆ లైటర్ కోసమే రక్షణ మంత్రి రిత్విక్ సోది (వెన్నెల కిశోర్) కూడా గాలిస్తుంటాడు. అప్పటికే ఆయుధాల చట్ట సవరణ చేసి .. ఆయుధాల కొనుగోలు లావాదేవీల్లో 10 వేల కోట్లు నొక్కేస్తాడు. గతంలో అతని వలన అన్యాయానికి గురైన హ్యాపీ కూడా అతనిపై పగ తీర్చుకునే సమయం కోసం ఎదురుచూస్తుంటుంది. లైటర్ చుట్టూ .. ఇటు పదివేల కోట్ల చుట్టూ .. హ్యాపీ  ప్రతీకారం చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. చివరికి ఈ కథ ఏ తీరానికి చేరుతుందనేది తెరపై చూడాలి. 

దర్శకుడు రితేశ్ రానా .. ఈ కథలో లాజిక్కులు వెతకొద్దని ముందుగానే చెప్పాడు. కానీ లాజిక్కునే కాదు ..  కథను కూడా వెతకవలసిన పని లేదు. ఎందుకంటే ఎంత వెదికినా అది కనిపించదు. జుట్టుంటే ఎన్ని ముడులైనా వేయవచ్చు .. అది లేదు గనుక గొడవలేదు. కేవలం సరదాగా నవ్వుకోవడం కోసమే అయితే .. ఇంతకన్నా బాగా నవ్వించే కామెడీ షోలు టీవీల్లో వస్తున్నాయి. ఏదో పైపైన సీన్లు అనేసుకుని .. అల్లేసుకుని షూట్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది. 

దర్శకుడు ఏ విషయాన్ని గురించి చెప్పాలనుకుంటున్నాడు? లైటర్ లో ఉన్న మేటర్ ఏంటి? 10 వేల కోట్లు కొట్టేయడం ఎవరి లక్ష్యం? హీరోయిన్ తీర్చుకునే ప్రతీకారం ముఖ్యమా? ఇలా ఏ విషయాన్ని హైలైట్ చేయాలనేది ఆయనే తేల్చుకోలేదు. ఇక కథలో ఎలాగూ బలం లేదు .. కనీసం స్క్రీన్ ప్లే ద్వారా కూడా ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేయలేకపోయారు. కథ దేని చుట్టూ తిరుగుతుంది? తెరపై ఏం జరుగుతుంది? దేనికోసం జరుగుతుంది? అనే విషయంలో క్లారిటీ లేదు. సామాన్య ప్రేక్షకుడికి అసలు అర్థం కాదు. 

కథ ఎత్తుకోవడం ఎత్తుకోవడమే గన్స్ స్కీమ్ తో మొదలై .. గన్స్ స్కామ్ గా మారుతుంది. పోనీ ఆ లైన్ ను అయినా అర్థమయ్యేలా నడిపించారా? అంటే అదీ లేదు. ఇక పాత్రలు కూడా అంతే .. అలా పుట్టుకొచ్చేస్తూ ఉంటాయి. ఏ పాత్ర ఉద్దేశం ఏమిటో అర్థం కాదు. ఏ పాత్ర కూడా రిజిష్టర్ కాదు. అసలు ఈ గన్స్ గోల ఏంటో .. హాలీవుడ్ తరహాలో ఆ కాల్పులు ఏమిటో అంతుబట్టదు. మైత్రీ వారు అసలు ఈ కథను ఎలా ఓకే చేశారనేది ఆశ్చర్యాన్ని కలిగించే ప్రశ్న. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. కానీ కథలేని ఖర్చు .. వినోదం లేని సినిమా ఒకటే కదా. ప్రయోగమైనా .. సాహసమైనా అది ఫలించినప్పుడే దానికో ప్రయోజనం ఉంటుందనే విషయాన్ని మరిచిపోకూడదు.

More Reviews