మూవీ రివ్యూ: 'చోర్ బజార్'

Chor Bazar

Movie Name: Chor Bazar

Release Date: 2022-06-24
Cast: Akash Puri, Gehna Sippy, Sunil
Director:Jeevan reddy
Producer: VS Raju
Music: Suresh Bobbbili
Banner: IV Oroductions
Rating: 2.25 out of 5
  • ఈ రోజునే విడుదలైన 'చోర్ బజార్'
  • మాస్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన ఆకాశ్ 
  • బలహీనమైన కథాకథనాలు
  • పాత్రల రూపకల్పనలో జరగని కసరత్తు
  • కథలో ఏ అంశం మెప్పించని తీరు

ఆకాశ్ పూరి -  గెహనా సిప్పీ కాంబినేషన్లో వీఎస్ రాజు నిర్మించిన 'చోర్ బజార్' ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. జీవన్ రెడ్డి  దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని సమకూర్చాడు. అర్చన ..  సుబ్బరాజు .. సంపూర్ణేశ్ బాబు  .. ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఇంతవరకూ రొమాంటిక్ లవ్ స్టోరీస్ చేస్తూ వచ్చిన ఆకాశ్, ఈ సినిమాతో  మాస్ యాక్షన్ హీరోగా మరిన్ని మార్కులు కొట్టేయడానికి చేసిన ప్రయత్నం కనిపిస్తుంది. మరి ఆ ప్రయత్నంలో ఆయన ఎంతవరకూ సక్సెస్ అయ్యాడనేది చూద్దాం.

బచ్చన్ సాబ్ (ఆకాశ్)  చిన్నపాటి గ్యాంగ్ లీడర్ గా .. హైదరాబాద్ పాతబస్తీ కుర్రాడిగా .. 'చోర్ బజార్' పై ఆధారపడి బ్రతికే ఫ్యామిలీస్ కి అండగా కనిపిస్తుంటాడు. కార్ల టైర్లు ఫాస్టుగా విప్పేసి .. చోర్ బజార్లో అమ్మేయడంలో తను ఎక్స్ పర్ట్. అదే ప్రాంతానికి చెందిన సిమ్రాన్ (గెహనా సిప్పీ)ని అతను ప్రేమిస్తుంటాడు. ఆ అమ్మాయికి మాటలు రావు. తాను ఏదైనా విషయాన్ని చెప్పదలచుకుంటే, అందుకు సంబంధించిన సినిమాల్లోని డైలాగ్స్ ను ఫోన్లో వినిపిస్తూ ఉంటుంది. వాళ్ల  ప్రేమ సంగతి చిన్నప్పటి నుంచి బచ్చన్ సాబ్ ను పెంచిన బేబీ (అర్చన)కు కూడా తెలుస్తుంది. ఆ అమ్మాయి ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోమని చెబుతుంది. 

ఇక తమకి సంబంధించిన మార్కెట్లోని వస్తువుల సేల్స్ పడిపోవడానికి కారణం 'చోర్  బజార్' అని భావించిన గబ్బర్ (సుబ్బరాజు) 'చోర్ బజార్'ను మూయించడానికి ప్రయత్నిస్తుంటాడు. కథ ఆరంభంలోనే హైదరాబాద్ మ్యూజియం నుంచి చోరీకి గురైన వజ్రం .. అనుకోకుండా ఈ చోర్ బజార్ కి చేరుకుంటుంది. 200 కోట్ల రూపాయల ఖరీదు చేసే ఆ వజ్రం కోసం ఒక వైపున పోలీసులు .. మరో వైపున స్మగ్లర్లు గాలిస్తుంటారు. చివరికి ఆ డైమండ్ ఎవరికి చేరుతుంది? బచ్చన్ సాబ్ - సిమ్రాన్ ల ప్రేమలో ఎలాంటి ట్విస్టులు చోసుకుంటాయి? అనే అంశాలు కథలోని మలుపులుగా కనిపిస్తాయి.  

'చోర్ బజార్'తో ముడిపడిన జీవితాలు .. సిమ్రాన్ తో బచ్చన్ సాబ్ ప్రేమ .. 200 కోట్ల ఖరీదైన డైమండ్ కోసం స్మగ్లింగ్ ముఠాలు ప్రయత్నించడం .. మ్యూజియం నుంచి డైమండ్ మిస్సయ్యిందనే విషయం బయటికి రానీయకుండా దానిని తిరిగి అదే చోటుకు చేర్చడానికి హోమ్ మినిస్టర్ చేసే ప్రయత్నాలు కలిసి ఈ కథను నడిపిస్తుంటాయి. అంటే కథ ఒకే సమయంలో నాలుగు ట్రాకులను కలుపుకుంటూ ముందుకు వెళుతుంటుంది. 

ఇక దర్శకుడు అన్నిటికంటే ముందుగా, డైమండ్ చేతులు మారడాన్ని చాలా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో చెప్పవలసి ఉంటుంది. అలాగే స్మగ్లింగ్ ముఠాల ఎత్తుకు పైఎత్తులు మరింత ఆసక్తికరంగా చూపించాలి. ఆ డైమండ్ ను తిరిగి మ్యూజియానికి చేర్చడానికి పోలీసులు పకడ్బందీగా వ్యూహాలు పన్నాలి. ఈ క్రమంలోనే ప్రేమకథను కొంచెం .. కొంచెంగా వడ్డించాలి. కానీ  పైవాటి లో ఏదీ జరగదు. ఏ ట్రాక్ పట్టుకున్నా చెప్పుకోవడానికి .. సస్పెన్స్ ముడులు విప్పుకోవడానికి ఏమీ ఉండవు. అన్ని ట్రాకులు కూడా ఆకతాయిగా సాగిపోతున్నట్టుగానే అనిపిస్తాయి.

హీరో తన వెనుక జమీందార్ ఫ్యామిలీ నేపథ్యం ఏదో ఉందని అనుకుంటాడు .. అలా ఎందుకు అనుకుంటూ ఉంటాడనే దానికి చెప్పించిన రీజన్ సిల్లీగా అనిపిస్తుంది. అలాగే అమితాబ్ అభిమానిగా అర్చన ఫ్లాష్ బ్యాక్ కూడా నవ్వు  తెప్పిస్తుంది. అర్చన గొప్ప నటి  .. అందులో ఎలాంటి సందేహం లేదు .. కానీ ఈ మాత్రం పాత్రకి ఆమెను ఎందుకు తీసుకుని వచ్చారనేది అర్థం కాదు. పాతికేళ్లకి పైగా గ్యాప్ తరువాత ఆమె ఈ పాత్రను ఒప్పుకోడం కచ్చితంగా పొరపాటే. హీరోయిన్ కి మాటలు రావని లాక్ చేయడం వలన ప్రయోజనం ఏమిటనేది ఎంతసేపు ఆలోచించినా ఫలితం ఉండదనేది వాస్తవం. 

ఇక సుబ్బరాజు పాత్ర విషయంలో గానీ ..  సునీల్ పాత్ర విషయంలో గాని క్లారిటీ కనిపించదు. సంపూ పాత్రకి ఒక రేంజ్ లో బిల్డప్ ఇచ్చారు. కానీ ఆ పాత్ర పరిస్థితి కూడా అయోమయమే. ఇక మధ్యలో ఛార్లీ అనే మరో బూచిని చూపించి  ఆ వైపు నుంచి కూడా ప్రమాదం ముంచుకు వస్తుందనే బిల్డప్ ఇచ్చారు. కానీ ఎక్కడా ఏదీ వర్కౌట్ కాలేదు. పాత్రల  ఉద్దేశాలు .. వాటి స్వభావాలు .. వాటి గమ్యాల విషయంలో సరైన కసరత్తు జరగలేదు. అత్యంత ఖరీదైన డైమండ్ చుట్టూ  కథ నడుస్తూ ఉంటుంది. కానీ చివరివరకూ ఆ విషయం హీరోకి తెలియకపోవడమనే చోటనే దెబ్బకొట్టేసింది. ఆ తరువాతైనా దాని విషయంలో హీరోయిజం నిలబడుతుందా అంటే .. అదీ లేదు.  

ఆకాశ్ లో ఇంకా పసితనం కనిపిస్తూనే ఉంది. అర్చన నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. గెహనా సిప్పీ పెద్దగా ఆకట్టుకోదు. సుబ్బరాజు .. సంపూ మార్కు తెలిసిందే. ఇక మిగతావాళ్లలో 'జబర్దస్త్' కమెడియన్స్  ఎక్కువ. సంగీతం విషయానికి వస్తే సురేశ్ బొబ్బిలి చేసిన పాటల్లో ఒకటి రెండు ఫరవాలేదనిపిస్తాయి. ఇక ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే, అప్పుడప్పుడు సన్నివేశాలకు మించి .. ఆ తరువాత సన్నివేశాలతో సంబంధమే లేకుండా సాగింది. ఫొటోగ్రఫీకి మంచి మార్కులే ఇవ్వొచ్చు.

ఇక ఒక దారి .. తెన్నూ లేకుండా సాగే ఈ సినిమాలో ఎడిటింగ్ గురించి మాట్లాడుకోవడం కూడా అంత కరెక్ట్ కాదు. ఇదే జీవన్ రెడ్డి నుంచి వచ్చిన 'జార్జి రెడ్డి' సినిమా, అప్పటి యూనివర్సిటీ వాతావరణాన్ని కళ్లకు కట్టింది. అలాంటి ఆయన డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాపై ఎంతో కొంత అంచనాలు ఉండటం సహజం. కానీ ఆ అంచనాలను టచ్ చేసే ప్రయత్నం జరగలేదు. ఆకాశ్ తనవంతు యాక్షన్ అయితే చేశాడుగానీ, ఆయన కెరియర్ కి ఇది ఎంతవరకూ హెల్ప్ అవుతుందనేది ఈ సినిమాను చూసిన ఎవరిని అడిగినా చెబుతారు.

More Reviews