మూవీ రివ్యూ: 'విక్రమ్'

Vikram

Movie Name: Vikram

Release Date: 2022-06-03
Cast: Kamal, Vijay Sethupathi, Fahadh Fassil
Director:Lokesh kanagaraj
Producer: kamal
Music: Anirudh
Banner: Rajkamal Films
Rating: 3.50 out of 5
  • 'విక్రమ్' గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమల్ 
  • ఎమోషన్ తో కూడిన యాక్షన్ మూవీ ఇది 
  • కమల్ లుక్ .. ఆయన స్టైల్ ప్రధానమైన ఆకర్షణ
  •  కామన్ ఆడియన్ కి కాస్త గందరగోళంగా అనిపించే స్క్రీన్ ప్లే 
  • యాక్షన్ స్థాయిలో కనెక్ట్ కానీ ఎమోషన్ 
  • లోపించిన కమల్ మార్క్ కామెడీ
  • 'ఖైదీ' మార్కును తప్పించుకోలేకపోయిన లోకేశ్

కమలహాసన్ తన సొంత బ్యానర్లో .. భారీ బడ్జెట్ తో 'విక్రమ్' సినిమాను నిర్మించారు. ఇంత పెద్ద ప్రాజెక్టును ఆయన కేవలం 3 సినిమాల అనుభవం ఉన్న దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కి అప్పగించడం విశేషం. అయితే లోకేశ్ చేసిన ఆ మూడు సినిమాలు కూడా హిట్టే. ఆ మూడు సినిమాల్లో 'ఖైదీ' .. 'మాస్టర్' సంచలన విజయాలను సాధించాయి. ముఖ్యంగా 'ఖైదీ' సినిమా స్క్రీన్ ప్లే అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. అలాంటి ఈ కాంబినేషన్లో రూపొందిన 'విక్రమ్' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నెల 3వ తేదీన విడుదలైన ఈ సినిమా అభిమానుల అంచనాలను ఎంతవరకూ అందుకుందనేది చూద్దాం. 

చెన్నైలో సంతానం (విజయ్ సేతుపతి) తన డ్రగ్స్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ ఉంటాడు. కొంతమంది అవినీతి పోలీస్ అధికారులు ఆయనతో చేతులు కలిపి డ్రగ్స్ సరఫరాకి ఎలాంటి ఆటంకం లేకుండా చూస్తుంటారు. ఈ నేపథ్యంలోనే 2 లక్షల కోట్ల రూపాయల విలువచేసే డ్రగ్స్ కలిగిన కంటైనర్ సంతానం గోడౌన్ కి చేరకుండా మాయమవుతుంది. దాంతో సంతానం పైన అజ్ఞాతంగా ఉంటూ ఈ కథను నడిపించే సూత్రధారి 'రోలెక్స్' నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో పోలీస్ డిపార్ట్ మెంట్ కి చెందిన కొందరు అధికారులను ఒక మాస్క్ మేన్ వరుసగా హత్యలు చేసుకుంటూ వెళుతుంటాడు. అతను ఎవరనేది ఎవరికీ తెలియదు.

పోలీస్ డిపార్టుమెంటువారు ఈ కేసును 'అమర్' (ఫహాద్ ఫాజిల్) కి అప్పగిస్తారు. పోలీస్ డిపార్టుమెంటుకి సంబంధం లేని 'కర్ణన్' (కమల్) ను మాస్క్ మేన్ ఎందుకు చంపాడు? అనేది అమర్ కి అర్థం కాదు. పరిశోధనలో ముందుకు వెళుతున్న కొద్దీ అమర్ కి విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. కర్ణన్ ఎవరు? ఆరంభంలోనే కథానాయకుడు చనిపోవడాన్ని ఆడియన్స్ నమ్మరు గనుక, అక్కడున్న ట్విస్ట్ కోసం ఆడిటోరియం ఎదురుచూస్తూ ఉంటుంది. 'విక్రమ్' ఎంట్రీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది.  అలాగే కర్ణన్ నేపథ్యం ఏమిటి? 2 లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ కంటైనర్ ను మాయం చేసినదెవరు? అవినీతి పోలీస్ అధికారులను హత్య చేస్తున్నదెవరు? సంతానంతో ఈ పనులన్నీ చేయిస్తున్న రోలెక్స్ ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికీ  సమాధానంగా ఈ కథ నడుస్తూ ఉంటుంది. 

మొదటి రెండు సినిమాలను చాలా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కించి కాసులు కురిపించిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్, 'మాస్టర్' సినిమాతో పాటు ఈ సినిమాను కూడా కాస్త భారీగానే తెరకెక్కించాడు. అయితే మొదటి రెండు సినిమాలలో స్క్రీన్ ప్లే తో ఆయన చేసిన మేజిక్ ఆ తరువాత సినిమాలలో కనిపించదు. ఓ రెండు మూడు ట్విస్టులు మాత్రం చివరి వరకూ ఆడియన్స్ ఊహకు అందనివిగా ఉంటాయి. ఆ సమయంలో మాత్రం థియేటర్స్ నుంచి విజిల్స్ పడతాయి.

ఈ సినిమాలో కమల్ .. విజయ్ సేతుపతి .. ఫహాద్ ఫాజిల్ ప్రధానమైన పాత్రలను పోషించారు. ప్రత్యేకమైన పాత్రలో సూర్య కనిపిస్తాడు. అయితే ఎవరి పాత్రకి ఉండవలసిన ప్రాముఖ్యత వారికి ఉంటుంది. ఫస్టాఫ్ లో మాత్రం ఫహాద్ ఫాజిల్ తెరపై ఎక్కువగా కనిపిస్తాడు. సీరియల్ కిల్లర్ ఎవరో తెలుసుకోవడానికి  ఆయన చేసే ఇన్వెస్టిగేషన్ తోనే ఫస్టాఫ్ అంతా నడుస్తుంది. ఫస్టాఫ్ లో వేసిన చిక్కుముళ్లను లోకేశ్ సెకండాఫ్ లో విప్పుతూ వెళ్లాడు. అయితే ఆ చిక్కుముడులు మరీ చిక్కుబడినట్టుగా సాధారణ ప్రేక్షకులకు గందరగోళంగా అనిపిస్తాయి. అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఒక క్లారిటీ వచ్చేస్తుంది.  ఇంటర్వెల్ బ్యాంగ్ ను డిజైన్ చేసిన తీరు బాగుంది. 

లోకేశ్ ప్రతి సన్నివేశాన్ని చాలా భారీగా చిత్రీకరించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు .. ఛేజింగ్ సీన్స్ వైపు నుంచి కళ్లు తిప్పుకోలేం. కమల్ లుక్ .. ఆయన స్టైల్ ఈ సినిమాకి ప్లస్ అయ్యేలా చూసుకున్నాడు. కాకపోతే కమల్ మార్క్ కామెడీ ఈ సినిమాలో మచ్చుకు కూడా కనిపించదు. ఒక వైపున విలన్ గ్యాంగ్ తో ఫైట్ చేస్తూనే మరో వైపున మనవడికి హీరో పాలు కాచి ఇచ్చే సీన్ విజిల్స్ వేయిస్తుంది. ఇక సంతానం పాత్రలో విజయ్ సేతుపతి లుక్ ను .. బాడీ లాంగ్వేజ్ ను లోకేశ్ పూర్తిగా మార్చేశాడు. ఆ పాత్రలో ఆయన జీవించాడు. స్టార్ హీరో ఇమేజ్ ఉన్న విజయ్ సేతుపతి అలా కనిపించడానికి అంగీకరించడం గొప్ప విషయమే. 

ఇక ఫహాద్ ఫాజిల్ పాత్రను మలిచిన విధానం డీసెంట్ గా అనిపిస్తుంది. అలాగే సూర్య పాత్రను రివీల్ చేసిన తీరు .. ఆయన లుక్ .. డైలాగ్ డెలివరీ డిఫరెంట్ గా అనిపిస్తాయి. ఆ పాత్రతో చెప్పించిన ఒకే ఒక్క డైలాగ్ తో ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందనే విషయాన్ని ఆడియన్స్ కి అర్థమయ్యేలా చేశారు. ఇక లోకేశ్ ఇంకా 'ఖైదీ' సినిమా ప్రభావం నుంచి బయటికి రాలేదనిపిస్తుంది. 'ఖైదీ'లో మాదిరిగానే ఈ కథలో హీరోయిన్ ఉండదు .. డ్యూయెట్లు ఉండవు .. చైల్డ్ సెంటిమెంట్ ఉంటుంది .. యాక్షన్ అంతా ఆ చిన్నారితో కూడిన ఎమోషన్ కి కనెక్టై ఉంటుంది. అలాగే క్లైమాక్స్ లో విలన్ గ్యాంగ్ పై హీరో బుల్లెట్ల వర్షాన్ని కురిపించే తీరు చూడా 'ఖైదీ' క్లైమాక్స్ ను గుర్తుకు తెస్తుంది. కాకపోతే 'ఖైదీ'లో మాదిరిగా ఎమోషన్ ను కనెక్ట్ చేయలేకపోయాడు. 

లోకేశ్ కనగరాజ్ స్క్రీన్ ప్లే కొత్తగా అనిపిస్తుంది .. కాకపోతే సాధారణ ప్రేక్షకులను అది ఇంటర్వెల్ వరకూ ఇబ్బంది పెడుతుంది. టేకింగ్ విషయంలో లోకేశ్ కి వంకబెట్టవలసిన అవసరమే ఉండదు. ప్రధానమైన పాత్రలను పరిచయం చేస్తూ వెళ్లిన తీరు .. కొన్ని ట్విస్టులు .. యాక్షన్ ఎపిసోడ్స్ ను డిజైన్ చేయించుకున్న తీరు బాగుంది. ఇక ఆయన తరువాత ఎక్కువ మార్కులు కొట్టేసేది అనిరుధ్ అనే చెప్పాలి. ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను మరోస్థాయికి తీసుకుని వెళ్లింది. టెన్షన్ ను బిల్డప్ చేయడంలో ముఖ్యమైన పాత్రను పోషించాడు. గిరీశ్ గంగాధరన్ ఫొటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్ అనే చెప్పాలి. హీరోగా .. నిర్మాతగా ఇది కమల్ చేసిన మరో ప్రయోగమనే అనుకోవాలి .. ఆయన మార్క్ సినిమాగానే భావించాలి. కాకపోతే లోకేశ్ ఈ కథను ఇంకాస్త క్లారిటీగా చెప్పి ఉంటే సామాన్య ప్రేక్షకులకు మరింత రీచ్ అయ్యుండేదేమో అనిపిస్తుంది

More Reviews