మూవీ రివ్యూ: 'ఆచార్య'

Acharya

Movie Name: Acharya

Release Date: 2022-04-29
Cast: Chiranjeevi, Ram Charan, Pooja Hegde
Director:Koratala Shiva
Producer: Niranjan Reddy
Music: Manisharma
Banner: Matinee Entertainment
Rating: 2.75 out of 5
  • ఈ రోజునే విడుదలైన 'ఆచార్య'
  • అడవి నేపథ్యంలో సాగే కథ 
  • కొరటాలకి దొరకని మెగా పల్స్
  • బలహీనమైన స్క్రీన్ ప్లే 
  • ప్రధానమైన బలంగా మారిన మణిశర్మ బాణీలు
  • తిరు కెమెరా పనితనానికి ఎక్కువ మార్కులు

చిరంజీవి -  చరణ్ కథానాయకులుగా 'ఆచార్య' సినిమా రూపొందింది. నిరంజన్ రెడ్డి - అవినాశ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి  కొరటాల శివ దర్శకత్వం వహించాడు. చరణ్ జోడీగా పూజ హెగ్డే కనిపించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని సమకూర్చాడు. ఇంతవరకూ చిరంజీవి సినిమాలో చరణ్ .. ఆయన సినిమాలో చిరంజీవి తళుక్కున మెరుస్తూ .. ఫ్యాన్స్ ను హుషారెత్తిస్తూ వచ్చారు. చరణ్ పాత్ర నిడివి సంగతి అలా ఉంచితే, మొదటిసారిగా ఈ సినిమాలో చిరంజీవితో సమానమైన ప్రాధాన్యతగల పాత్రను ఆయన పోషించాడు. ఈ రోజున థియేటర్లకు వచ్చిన ఈ సినిమా , ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పించిందన్నది చూద్దాం. 

ఈ కథ మహేశ్ బాబు వాయిస్ ఓవర్ తో చాలా ఇంట్రస్టింగ్ గా మొదలవుతుంది. 'సిద్ధవనం' అనే అడవి ప్రాంతంలో 'ధర్మస్థలి' అనే ఒక చిన్నగ్రామం ఉంటుంది. బసవ (సోనూసూద్) అనే దుర్మార్గుడు ఆ గ్రామ ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేస్తుంటాడు. ఆయన అన్యాయాలను భరించలేని కొంతమంది ప్రజలు అక్కడికి సమీపంలోని 'పాదఘట్టం' అనే ప్రదేశంలో నివసిస్తుంటారు. తమకి తెలిసిన ఆయుర్వేద వైద్యంతో ధర్మస్థలిలోని ప్రజలను కూడా వాళ్లు కాపాడుతూ ఉంటారు. అందరూ కూడా తాము గ్రామదేవతగా కొలిచే 'ఘట్టమ్మతల్లి' తమని  కాపాడుతూ ఉంటుందని విశ్వసిస్తూ ఉంటారు.

ఈ నేపథ్యంలో 'సిద్ధవనం'పై బిజినెస్ మేన్ రాథోడ్ ( జిషు సేన్ గుప్తా) కన్ను పడుతుంది. అక్కడ మైనింగ్ జరపాలని నిర్ణయించుకుంటాడు. అందుకు అడ్డుగా ఉన్న 'పాదఘట్టం' గ్రామస్థులను లేపేయాలని నిర్ణయించుకుని, తన మనుషులను రంగంలోకి దింపుతాడు. 'ధర్మస్థలి'లో ఆదర్శ భావాలున్న యువకుడే 'సిద్ధ' (చరణ్). ధర్మస్థలి  ... అధర్మస్థలి కాకూడదు .. సిద్ధవనం పచ్చదనం దెబ్బతినకూడదు .. పందిమంది బాగుకోరుకునే 'పాదఘట్టం' ప్రజలు సురక్షితంగా ఉండాలనేది 'సిద్ధ' కోరిక. ఆయన కోరికను నెరవేర్చడానికి ఆ ప్రాంతంలో 'ఆచార్య' అడుగుపెడతాడు. 'ఆచార్య' ఎవరు? ఆయనకి సిద్ధతో ఉన్న సంబంధం ఏమిటి? తన లక్ష్య సాధనలో 'ఆచార్య'కి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అనే అనూహ్యమైన మలుపులతో ఈ కథ నడుస్తుంది.

 ఈ కథలో కామ్రేడ్ 'ఆచార్య' గా చిరంజీవి కనిపిస్తే, తాను అనుకున్నది సాధించడం కోసం ఆయన వెనక నడిచిన సిద్ధ పాత్రలో చరణ్ కనిపిస్తాడు. 'ధర్మస్థలి'లో పిల్లలకు సంగీత పాఠాలు చెప్పే 'నీలాంబరి' పాత్రలో పూజ హెగ్డే కనిపిస్తుంది. ఇక లోకల్ విలన్ గా సోనూ సూద్ .. ఆయనను అడ్డం పెట్టుకుని పై నుంచి చక్రం తిప్పే మెయిన్ విలన్ గా జిషు సేన్ గుప్తా కనిపిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే అడవిని కొల్లగొట్టడానికి ఒకరు .. దానిని ఆపడానికి మరొకరు అన్నట్టుగా ఈ కథ నడుస్తుంది. 

ఇంతవరకూ కొరటాల తయారు చేసుకుంటూ వచ్చిన కథలకు 'ఆచార్య' పూర్తి భిన్నం. కథ అంతా కూడా ఫారెస్టు నేపథ్యంలోనే కొనసాగుతుంది. 'ధర్మస్థలి' కోసం భారీ సెట్ వేశారు. దాదాపు షూటింగ్ అంతా కూడా అక్కడే చేశారు. ఒక రకంగా ఇది మల్టీ స్టారర్ సినిమా అనే చెప్పాలి. అలాంటి సినిమాకి స్క్రీన్ ప్లే ఒక రేంజ్ లో ఉండాలి. అలాగే చిరంజీవి .. చరణ్ పాత్రల ఇంట్రడక్షన్ సీన్స్  గానీ .. వాళ్లిద్దరూ మొదటిసారిగా కలుసుకునే సీన్ గాని విజిల్స్ కొట్టించేలా ఉండాలి. కొరటాల ఆ మేజిక్ చేయలేకపోయాడు. కొన్ని సీన్స్ ను ఎలా ముగించాలో తెలియక అలా వదిలేసినట్టుగా కూడా అనిపిస్తాయి. 

కొరటాల ఇంతవరకూ చేస్తూ వచ్చిన హీరోల స్టైల్ వేరు .. వాళ్లకి గల క్రేజ్ వేరు. చిరంజీవి విషయానికి వచ్చేసరికి ఆయనలోని పవర్ కి తగినట్టుగా ..  ఆయనకి గల మాస్ ఫాలోయింగ్ కి తగినట్టుగా సీన్స్ ఉండాలి. ఆయన స్టైల్ కి తగినట్టుగా పవర్ఫుల్ డైలాగ్స్ ఉండాలి. ఆయనలోని ఆ ప్రత్యేకతను కొరటాల పట్టుకోలేకపోయారు. కథలో ఎలాంటి ట్విస్టులు లేకుండా ముందుకు తీసుకుని వెళ్లారు. తెరపై భారీ సన్నివేశాలే వచ్చి వెళుతుంటాయి  .. కానీ నెక్స్ట్ ఏం జరగనుంది? అనే ఉత్కంఠ ఎక్కడ కనిపించదు .. అనిపించదు. 

చిరంజీవికి హీరోయిన్ లేదు .. చరణ్ కి జోడీగా తీసుకున్న పూజ హెగ్డే పాత్రను కూడా సరిగ్గా డిజైన్ చేసుకోలేదు. ఎలాంటి ప్రయోజనం లేకుండానే ఆ పాత్ర తెరపై కనిపించకుండా పోతుంది. కథ ఆరంభంలోనే వెన్నెల కిశోర్ కనిపిస్తే, ఇక కామెడీ మొదలు .. అనుకుంటాము. కానీ కనుచూపు మేరలో అది ఎక్కడా కనిపించదు. ఇక చిరంజీవి .. చరణ్ తమ సొంత పేర్లతో పిలుచుకుంటూ చేసే కామెడీ సీన్ పేలకపోగా 'అయ్యో రామచంద్రా' అనిపిస్తుంది. విలన్ గా తెరపై ఎక్కువ సేపు కనిపించే సోనూ సూద్ కి విగ్ కానీ ..  మీసాలు కానీ అస్సలు సెట్టవ్వలేదు.

మెయిన్ విలన్ రాథోడ్ బావమరిదిని కొట్టి అతణ్ణి భుజాన వేసుకుని  .. నేరుగా ఆ విలన్ ఇంటికే ఆచార్య వెళతాడు. ఈ క్రమంలో పడవలో కూడా అతణ్ణి భుజాన వేసుకునే ఆచార్య నిలబడటం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. సిద్ధ పాత్ర  విషయానికి వస్తే చరణ్ తన పరిథిలోనే చేశాడు.  ఫైట్స్ లోను .. డాన్సులలోను తండ్రితో పోటీ పడటానికి  ప్రయత్నించాడు.  'నీలాంబరి'గా అందంగా కనిపించడం తప్ప పూజ హెగ్డే చేయడానికేం లేదు. సోనూ సూద్ .. జిషుసేన్ గుప్తా .. కన్నడ కిశోర్ ఓకే అనిపిస్తారు. 

చిరంజీవికి తగిన కథాకథనాలను అల్లుకోవడంలో కొరటాల విఫలమైనా, పాటల పరంగా నిలబెట్టడానికి మణిశర్మ తనవంతు ప్రయత్నం చేశాడు. చిరంజీవికి ఉన్న మాస్ ఇమేజ్ ఎలాంటిదో ఆయనకి బాగా తెలుసు. అందువలన ప్రతి పాటతో దుమ్మురేపేశాడు. 'లాహే లాహే' .. 'సానా కష్టం' .. 'భలే భలే బంజారా' పాటలు ఒక ఊపును .. ఉత్సాహన్ని తీసుకొస్తాయి. ఇక చరణ్ - పూజ హెగ్డేలపై చిత్రీకరించిన 'నీలాంబరి' పాట కూడా అందంగా .. హాయిగా సాగుతుంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చాలా హెల్ప్ అయిందనే చెప్పాలి. 

ఇక 'తిరు' కెమెరా పనితనం గొప్పగా అనిపిస్తుంది. మారేడుమిల్లి ఫారెస్టును .. 'ధర్మస్థలి' సెట్ ను .. పాటలను .. ఫైట్లను .. జీవధార నేపథ్యంలోని  దృశ్యాలను ఆయన అద్భుతంగా తెరకెక్కించాడు. కథాకథనాలు చిరంజీవి స్థాయికి తగినట్టుగా లేకపోయినా .. మాస్ ఆడియన్స్ ఆశించే స్థాయిలో ఆయనను చూపించలేకపోయినా, మణిశర్మ బాణీలు  .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. రామ్ లక్ష్మణ్  ఫైట్స్ .. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ .. తిరు ఫొటోగ్రఫీ ఈ సినిమా స్థాయిని పెంచడానికి చేసిన తమవంతు ప్రయత్నంగా కనిపిస్తాయి. చిరంజీవి స్ట్రెంత్ ఏమిటనేది కొరటాల పట్టుకుని ఉంటే, ఈ సినిమా వేరే లెవెల్ కి వెళ్లేదేమో!

More Reviews