'ఓ బేబీ' మూవీ రివ్యూ

Oh! Baby

Movie Name: Oh! Baby

Release Date: 2019-07-05
Cast: Samantha, Lakshmi, Rajendra Prasad, Rao Ramesh,NagaShourya, Pragathi, Urvasi, Aishwarya
Director:Nandini Reddy
Producer: Suresh Babu, Sunitha
Music: Mickey J Mayor
Banner: Suresh Productions, Peoples Media
Rating: 4.00 out of 5
తన కుటుంబం కోసం అన్ని ఆనందాలను త్యాగం చేసిన వృద్ధురాలైన సావిత్రికి, గతంలో ఆమె కోల్పోయినవన్నీ తిరిగి పొందే అవకాశం అనుకోకుండా లభిస్తుంది. ఫలితంగా ఆమె జీవితంలో చోటుచేసుకునే ఆసక్తికరమైన పరిణామాలతో, ప్రేక్షకులను ఆకట్టుకునే కుటుంబ కథాచిత్రంగా ' ఓ బేబీ' కనిపిస్తుంది.

ఇతర భాషల్లో విజయాన్ని సాధించిన సినిమాలను తెలుగులోకి రీమేక్ చేయడమనేది చాలా కాలం నుంచి జరుగుతున్నదే. స్టార్ హీరోల సినిమాలను రీమేక్ చేయడం వలన పెద్దగా సమస్య ఉండదు. కానీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలను రీమేక్ చేయడం మాత్రం సాహసమే అవుతుంది. అందునా ఒక కొరియన్ సినిమాకి రీమేక్ అనేది మరింత రిస్క్ తో కూడినది. అలాంటి సాహసానికి పూనుకున్న నందినీ రెడ్డి, 'మిస్ గ్రానీ' రీమేక్ గా ' ఓ బేబీ' సినిమాను తెరకెక్కించారు. తెలుగు తెరపై కొరియన్ కథను ఆమె ఎలా ఆవిష్కరించారో .. ఆ ప్రయత్నంలో ఎంతవరకూ సఫలీకృతమయ్యారో ఇప్పుడు చూద్దాం.

కథలోకి వెళితే .. సావిత్రి (లక్ష్మి)కి జీవితంలో అడుగడుగునా కష్టాలే ఎదురవుతూ వస్తాయి. చిన్నతనంలో పెళ్లి కావడం .. ఏడాది తిరగ్గానే ఒక బిడ్డకు తల్లికావడం .. ఆ వెంటనే భర్తను కోల్పోవడం .. అనారోగ్యంతో బాధపడుతోన్న కొడుకును కాపాడుకోవడం కోసం అనేక కష్టాలు పడడం జరుగుతుంది. 70  ఏళ్ల వయసులోను ఆమె కాలేజ్ క్యాంటీన్ ను నిర్వహిస్తూ ఉంటుంది. అంతా ఆమెను 'బేబీ' అనే పిలుస్తుంటారు. సావిత్రి కొడుకు నాని(రావు రమేశ్) అదే కాలేజ్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తుంటాడు. ఆయన భార్య (మాధవి) ఇంటి పనులు చక్కబెడుతూ ఉంటుంది. నాని కూతురు (అనీషా)కాలేజ్ చదువు పూర్తిచేయగా, ఆయన కొడుకు రాకీ(తేజ) ఒక మ్యూజిక్ బ్యాండ్ ను నడుపుతుంటాడు. ఆ ఇంట్లోని వాళ్లందరినీ సావిత్రి కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది.

అదే సమయంలో మాధవి అనారోగ్యానికి గురవుతుంది. తన టెన్షన్ కి సావిత్రి కారణమనీ, ఆమె ఇక తమతో ఉండటానికి వీల్లేదని మాధవి తేల్చిపారేస్తుంది. దాంతో ఓల్డ్ ఏజ్డ్ హోమ్ లో సావిత్రిని చేర్పించడానికి నాని సిద్ధమైపోతాడు. ఆ విషయాన్ని తన చిన్ననాటి స్నేహితుడైన చంటి(రాజేంద్ర ప్రసాద్)కి చెప్పి సావిత్రి బాధపడుతుంది. వృద్ధాప్యం కారణంగా తన కొడుకు నుంచి తనని దూరం చేస్తున్న దైవాన్ని నిందిస్తుంది. ఆ రాత్రే జరిగిన ఒక అనూహ్యమైన సంఘటనతో సావిత్రి 24 ఏళ్ల యువతిగా మారిపోతుంది. ఆ సంఘటన ఏమిటి? యువతిగా మారిన సావిత్రి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది? అనేది కథాంశం.

కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ'ని తెలుగు నేటివిటీకి తగినట్టుగా రూపొందించడంలో దర్శకురాలిగా నందినీ రెడ్డి సక్సెస్ అయ్యారనే చెప్పాలి. సావిత్రి యువతిగా మారే సన్నివేశంలో కొద్దిగా మార్పులు చేసి, ఇక్కడి ప్రేక్షకులను ఆమె మెప్పించారు. పాత్రలను తీర్చిదిద్దిన తీరు .. వాటిని సమర్థవంతంగా ముందుకు నడిపించిన తీరు బాగుంది. సావిత్రి ఫ్లాష్ బ్యాక్ ను ఆమె క్లుప్తంగా చెప్పిన తీరు నచ్చుతుంది. ఆరంభం నుంచి కామెడీని .. ఎమోషన్ ను కలిపి నడిపించిన విధానం ప్రశంసనీయంగా అనిపిస్తుంది. కథనం విషయంలో ఎక్కడా పట్టు సడలిపోకుండా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతూ వచ్చారు. మాటలు .. పాటల విషయంలో ఆమె తీసుకున్న శ్రద్ధ కారణంగా దర్శకురాలిగా ఆమె పూర్తి మార్కులు కొట్టేశారు.

టైటిల్ కి తగినట్టుగా ఈ కథ అంతా కూడా సమంత చుట్టూనే తిరుగుతుంది.స్వాతిగా మారిపోయిన సావిత్రి పాత్రలో ఆమె చాలా బాగా నటించింది. నిజానికి ఇది చాలా కష్టతరమైన పాత్ర. స్వాతి ఒక సందర్భంలో చెప్పిన డైలాగ్ మాదిరిగా 'ఒక జన్మలో రెండు జీవితాలు'గా ఆమె పాత్ర కనిపిస్తుంది. పైకి యువతిగా కనిపిస్తూ .. లోపల సావిత్రి మనస్తత్వం కలిగిన పాత్ర ఇది. తాను సావిత్రిననే విషయం తెలియకుండా స్వాతిపడే అవస్థలే థియేటర్లో నవ్వులు పూయిస్తుంటాయి. రూపం వేరు .. బాడీ లాంగ్వేజ్, యాస వేరు ఈ వేరియేషన్ ను సమంత గొప్పగా చూపించగలిగింది. ఇటు మనవడైన రాకీతోను .. అటు తనని ఆరాధించే విక్రమ్ తోను రెస్టారెంట్ కి వెళ్లినప్పుడు స్వాతిగా సమంత ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. తనకి దేవుడిచ్చిన అవకాశాన్ని కూడా తన వాళ్ల కోసం త్యాగం చేసే క్లైమాక్స్ సీన్ లోను సమంత పండించిన ఎమోషన్ కళ్లను చమర్చుతుంది.

ఇక సీనియర్ హీరోయిన్ లక్ష్మి విషయానికొస్తే సావిత్రి పాత్రపై ఆమె తనదైన ముద్రవేశారు. ఏ కుటుంబం కోసం అన్ని ఆనందాలను వదులుకుందో, ఆ కుటుంబమే తనని ఆ ఇంట్లో నుంచి పంపించేయాలని నిర్ణయించుకున్నప్పుడు లక్ష్మి ఆవిష్కరించిన భావోద్వేగాలు మనసును భారం చేస్తాయి. అలాగే సావిత్రి కొడుకు నానీగా రావు రమేశ్ నటన కూడా మనసుకు హత్తుకుపోతుంది. అటు భార్యకి నచ్చజెప్పలేక .. ఇటు తల్లిని వృద్ధుల శరణాలయానికి పంపించలేక మానసిక సంఘర్షణకి లోనయ్యే సన్నివేశాల్లో ఆయన నటన ఆకట్టుకుంటుంది.

అటు సావిత్రి పాత్రతోను .. ఇటు స్వాతి పాత్రతోను కలిసి ట్రావెల్ చేసే చంటి పాత్రలో రాజేంద్రప్రసాద్ నటన కట్టిపడేస్తుంది. బేబీ ఏమైపోయిందో తెలియక .. స్వాతి రూపంలో వున్నది బేబీనే అని తెలియని సన్నివేశాల్లో ఆయన ఆద్యంతం నవ్వించాడు .. అక్కడక్కడా కన్నీళ్లు పెట్టించాడు. ఈ సినిమాలో జగపతిబాబు అతిథి పాత్రలో కనిపిస్తాడు. ఆయన పాత్ర ఏమిటనేది అలా సస్పెన్స్ లో ఉంచితేనే  బాగుంటుంది. ఇక ప్రగతి .. ఊర్వశి .. నాగశౌర్య .. సునయన .. తేజ తమ పాత్రలకి న్యాయం చేశారు.

మిక్కీ జె. మేయర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనే చెప్పాలి. ఫస్టాఫ్ లో వచ్చే 'ఓ బేబీ' అనే టైటిల్ సాంగ్ .. చాంగుభళా అనే సాంగ్, సెకండాఫ్ లో వచ్చే 'ఆకాశంలోన ఏకాకి మేఘం' సాంగ్ ఆకట్టుకునేలా వున్నాయి. కథకి ఊపునిస్తూ హుషారుగా ఈ బాణీలు సాగాయి. రిచర్డ్ ప్రసాద్ కెమెరా పనితనం బాగుంది. ప్రతి ఫ్రేమ్ ను చాలా అందంగా ఆయన తెరపై ఆవిష్కరించాడు. ఇక ఎడిటర్ గా జునైద్ సిద్ధిక్ కథను చాలా వేగంగా పరుగులు తీయించాడు. ఎక్కడా ప్రేక్షకుల దృష్టిని మళ్లించకుండా చేశాడు. లక్ష్మీ భూపాల్ సమకూర్చిన మనసుకు హత్తుకునే సంభాషణలు ఈ సినిమాను నిలబెట్టే అంశాల్లో ఒకటిగా కనిపిస్తాయి. కథ .. కథనం .. మాటలు .. పాటలు .. పాత్రల చిత్రీకరణ ఇలా అన్నీ కుదిరిన సినిమాగా 'ఓ బేబీ'ని గురించి చెప్పుకోవాలి. సురేశ్ ప్రొడక్షన్స్ .. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ .. గురు ఫిల్మ్స్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా, సమంతను అభినయం పరంగా మరో మెట్టు పైకెక్కిస్తుందనే చెప్పాలి.

More Reviews