'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్' మూవీ రివ్యూ

Tenali Ramakrishna

Movie Name: Tenali Ramakrishna

Release Date: 2019-11-15
Cast: Sundeep Kishan, Hansika, Varalakshmi Sarath Kumar, Murali Sharma, Posani, Ayyappa Sharma, Sapthagiri, Sathya Krishnan
Director:G. Nageswara Reddy
Producer: Agraharam Nagi Reddy
Music: Sai karthik
Banner: SNS Creations
Rating: 2.50 out of 5
రాజకీయంగా తన ఎదుగుదలకి వరలక్ష్మి అడ్డుగా మారుతుందనే ఉద్దేశంతో, సింహాద్రినాయుడు ఆమెను ఓ హత్య కేసులో ఇరికిస్తాడు. లాయర్ తెనాలి రామకృష్ణ తన తెలివితేటలతో, నిందితురాలైన వరలక్ష్మిని నిర్దోషిగా నిరూపిస్తాడు. ఆ తరువాత తెలిసిన నిజంతో బిత్తరపోతాడు. ఆ నిజం ఏమిటి? దాని పర్యవసానాలు ఎలాంటివి? అనే ఆసక్తికరమైన అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వినోదమే ప్రధానంగా రూపొందిన ఈ సినిమా ఫరవాలేదనిపిస్తుంది.

తమిళంలో కథానాయికగా పరిచయమైన వరలక్ష్మి శరత్ కుమార్, ఇటీవల కాలంలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. లేడీ విలన్ తరహా పాత్రలకి అక్కడ ముందుగా ఆమె పేరునే పరిశీలిస్తున్నారు. అలాంటి వరలక్ష్మి శరత్ కుమార్, తొలిసారిగా చేసిన తెలుగు సినిమా ఇది. అందునా ఇది పూర్తి హాస్యభరితంగా సాగే కథ. తొలి ప్రయత్నంలో తెలుగు ప్రేక్షకుల నుంచి ఆమె ఎన్ని మార్కులు కొట్టేసిందో ఇప్పుడు చూద్దాం.

కథలోకి వస్తే .. తెనాలి రామకృష్ణ (సందీప్ కిషన్) ఒక మధ్యతరగతి యువకుడు. లాయర్ గా కొనసాగుతున్న ఆయనకి పెద్ద కేసులేమీ రాకపోవడంతో, చిన్నా చితకా కేసులను కోర్టు బయటే సెటిల్ చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే శ్రీమంతుడైన సీనియర్ లాయర్ చక్రవర్తి(మురళీశర్మ) కూతురు రుక్మిణి(హన్సిక) ప్రేమలో పడతాడు. ఈ క్రమంలోనే మంచి మనిషిగా వరలక్ష్మికి పెరుగుతున్న ఆదరణను చూసి, రాజకీయంగా తన ఎదుగుదలకి ఆమె అడ్డుపడే అవకాశం ఉందని భావించి, సింహాద్రినాయుడు ఆమెను ఓ హత్య కేసులో ఇరికిస్తాడు. ఇది పెద్దకేసు అనీ .. పెద్దలకి సంబంధించిన కేసు అని తెలిసి కూడా తెనాలి రామకృష్ణ రంగంలోకి దిగుతాడు. వరలక్ష్మిని నిర్దోషిగా నిరూపించి, లాయర్ చక్రవర్తిపై గెలుస్తాడు. ఆ సమయంలోనే ఒక అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. అదేమిటి? అప్పుడు తెనాలి రామకృష్ణ ఏం చేస్తాడు? అనే మలుపులతో మిగతా కథ నడుస్తుంది.

హాస్యభరితమైన కథలను తెరకెక్కించడంలోను .. ఆద్యంతం నవ్వించడంలోను దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి సిద్ధహస్తుడు. గతంలో ఆయన రూపొందించిన సినిమాలు ఈ విషయాన్ని నిరూపించాయి. అదే తరహాలో నాన్ స్టాప్ గా నవ్వించడంకోసం ఆయన రాసుకున్న కథే 'తెనాలి రామకృష్ణ'. కర్నూల్ 'కొండారెడ్డి బురుజు' దగ్గర జరిగిన ఒక జర్నలిస్ట్ మర్డర్ తో కథను మొదలెట్టిన ఆయన, ఆ హత్య చేసినవారిని అరెస్టు చేయించడంతో కథను ముగించాడు. ఈ మధ్యలో కథను అనేక ఆసక్తికరమైన మలుపులను తిప్పడంలో ఆయన సక్సెస్ అయ్యాడు.

థియేటర్ లోని ఆడియన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయే ట్విస్ట్ ఈ కథలో ఉండేలా ఆయన చూసుకున్న తీరు బాగుంది. ప్రతి పాత్రకి ఇవ్వవలసిన ప్రాధాన్యతనిస్తూ, కామెడీతో కథను నడిపిస్తూనే అక్కడక్కడా యాక్షన్ ను .. ఎమోషన్స్ ను జోడిస్తూ వెళ్లిన విధానం బాగుంది. హీరో హీరోయిన్స్ పాత్రల కంటే వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రను ఆయన డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ఒకటి రెండు సీన్స్ అనవసరమనిపించినా, ఆ తరువాత పడే కామెడీ సీన్స్ ఫ్లోలో అవి కొట్టుకుపోతాయి. అయితే గ్లామర్ పాళ్లు బాగా తగ్గిన హన్సికను కథానాయికగా ఎంపిక చేయడమే కొంత అసంతృప్తిని కలిగిస్తుంది. కామెడీ కంటెంట్ పరంగా చూసుకుంటే గతంలో జి.నాగేశ్వరరెడ్డి ఇంతకన్నా బాగా తీసిన సినిమాలు వున్నాయి. ఈ సినిమా వరకూ అయితే ఫరవాలేదనే చెప్పొచ్చు.

నటీనటుల విషయానికొస్తే .. తెనాలి రామకృష్ణ పాత్రలో సందీప్ కిషన్ చాలా బాగా చేశాడు. కామెడీ .. యాక్షన్ .. ఎమోషన్ ను మోతాదుకు మించకుండా పండించాడు. హన్సిక సన్నబడటం వలన అంత ఆకర్షణీయంగా అనిపించలేదు. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా పెద్దగా కుదిరినట్టుగా కనిపించలేదు. వరలక్ష్మి శరత్ కుమార్ తన పాత్రకి నిండుతనాన్ని తీసుకొచ్చింది. ఈ సినిమాకి ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హన్సిక తండ్రి పాత్రలో మురళీశర్మ తనదైన శైలిలో మెప్పించాడు. ఇక సింహాద్రి నాయుడు పాత్రలో సాయికుమార్ సోదరుడు అయ్యప్ప పి. శర్మ బాగానే చేశాడు. కనిపించింది కాసేపే అయినా పోసాని తన మార్కు చూపించాడు. ఇక వెన్నెల కిషోర్ .. సప్తగిరి తమ స్టైల్లో నవ్వులు పూయించారు. రఘుబాబు .. ప్రదీప్ .. సత్యకృష్ణన్ .. చమ్మక్ చంద్ర .. పాత్ర పరిథిలో నటించారు.

సాయికార్తీక్ అందించిన సంగీతం .. చేసిన రీ రికార్డింగ్ ఇంకాస్త మెరుగ్గా వుంటే, ఈ సినిమా మరో మెట్టుపైకి ఎక్కేదేమో. ఉన్న పాటల్లో 'కర్నూలు కత్తివా .. గుంటూరు మిర్చివా' అనే పాట ఒక్కటే బీట్ పరంగా బాగుంది. 'ఒరేయ్ నేను జడ్జిని కాబట్టే కిడ్నాప్ చేశానంటే ఇంతబాధ పడేవాడిని కాదురా .. 'దర్జీ' అనుకుని కిడ్నాప్ చేశాననన్నావ్ చూడు .. అందుకు బాధపడుతున్నా' అనే పోసాని డైలాగ్, 'ఇంతవరకూ హస్కీ వాయిస్ లు విన్నాను గానీ, ఇంత రిస్కీ వాయిస్ వినలేదు' అనే మురళీశర్మ డైలాగ్ తో పాటు మరికొన్ని మాటలు పేలాయి. సాయిశ్రీరామ్ అందించిన ఫొటోగ్రఫీ ఆకట్టుకునేలా వుంది. ఆయన వర్క్ చాలా నీట్ గా .. అందంగా వుంది. ఛోటా కె.ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగానే వుంది. కాకపోతే ఓ కమెడియన్ తో హన్సిక 'సార్ నా కళ్లలోకి చూడండి .. మీ స్ట్రెస్ తగ్గిపోయి రిలాక్స్ అవుతారు' అనే సీన్ మొత్తం అనవసరమనిపిస్తుంది.

సరదా సన్నివేశాలతో సాగిపోయే ఈ కథలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ వుంది .. ఈ సినిమాకి అదే హైలైట్. ఇక్కడి నుంచే ప్రేక్షకులలో ఆసక్తి మొదలవుతుంది. కథానాయికగా హన్సిక ఎంపిక మైనస్ అయితే, కీలకమైన పాత్రకి వరలక్ష్మి శరత్ కుమార్ ను తీసుకోవడం ప్లస్ అయింది. ఆమె పాత్రను డిజైన్ చేసిన విధానం .. ఆమె నటన సినిమాకి కలిసొచ్చిన అంశాలుగా నిలిచాయి. సంగీతం .. రీ రికార్డింగ్ కాస్త నిరాశ పరిచినా, ఫొటోగ్రఫీ .. ఎడిటింగ్ ఆదుకున్నాయి. ఇలా కొన్ని ప్లస్ లు .. కొన్ని మైనస్ లు కలిపి చూస్తే, ఈ సినిమా ఫరవాలేదనిపిస్తుంది.  


More Reviews