'బాయ్' మూవీ రివ్యూ

Boy

Movie Name: Boy

Release Date: 2019-08-23
Cast: Lakshya Sinha, Sahithi, Vinay Varma, Neeraj, Madhavi, Kalpalatha
Director:Amar Viswaraj
Producer: Ravishankar Raju
Music: Elvin James, Jaya prakash
Banner: Viswaraj Creations
Rating: 2.00 out of 5
స్కూల్ ఫైనల్లో తెలియని ఆకర్షణ .. ప్రేమ, చదువును పక్కదారి పట్టిస్తుంటాయి. ఈ సమయంలోనే ఆ వయసు పిల్లలు ఒక రకమైన మానసిక సంఘర్షణకి లోనవుతారు. అలాంటి సంఘర్షణకు దృశ్య రూపంగా 'బాయ్' కనిపిస్తుంది. దర్శకుడు ఎంచుకున్న లైన్ ఆసక్తికరమైనదే .. సందేశంతో కూడినదే. వినోదపు పాళ్లు కావలసినంత కలిపే అవకాశం వున్నా అలాంటి ప్రయత్నం జరగకపోవడంతో, ఈ కథ ఆశించినస్థాయిలో మెప్పించలేకపోయింది.

తెలుగు తెరకి టీనేజ్ ప్రేమకథలు కొత్తేమీ కాదు. స్కూల్ ఫైనల్లో ప్రేమలో పడటం .. అది అంతకంతకూ ముదురుతూ పెద్దలను ఎదిరించే వరకూ వెళ్లడం వంటి కథలు గతంలో చాలానే వచ్చాయి. ఆ స్థాయిలో కాకుండా పదో తరగతిలో ప్రేమలో పడిన వాళ్ల ఆలోచనలు .. నిర్ణయాలు ఎలా వుంటాయనేది చెప్పడానికి దర్శకుడు అమర్ విశ్వరాజ్ చేసిన ప్రయత్నంగా 'బాయ్' కనిపిస్తుంది. ఈ కథ టీనేజ్ పిల్లలను ఎంతవరకూ ఆకట్టుకుంటుందన్నది పరిశీలిద్దాం.

ఈ కథ 2008లో మొదలవుతుంది. మహితేజ (లక్ష్య సిన్హా) ఓ స్కూల్లో పదో తరగతి చదువుతుంటాడు. మరో స్కూల్లో పదో తరగతి చదువుతోన్న 'వర్ణ' (సాహితి) మహితేజను ఇష్టపడుతుంది. అతను కూడా ఆ అమ్మాయి ప్రేమలో పడతాడు. మహితేజకు మ్యాథ్స్ అంటే భయం. ఆ సబ్జెక్టులో ఎప్పుడూ అతను వెనకబడే ఉంటాడు. అయితే 'వర్ణ' మెప్పు పొందడం కోసం తనకి మ్యాథ్స్ బాగా వచ్చని అనుకోవడం కోసం మహి నానా తంటాలు పడుతుంటాడు. ఈ లోగా ప్రీ ఫైనల్స్ వచ్చేస్తాయి. పదో తరగతి తరువాత 'వర్ణ' ఏ కాలేజ్ లో అయితే చదవాలని అనుకుంటుందో, అదే కాలేజ్ లో తను కూడా చేరాలని మహి నిర్ణయించుకుంటాడు. అందుకోసం అతను ఏం చేస్తాడు? అతను తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిణామాలకి దారితీస్తుంది? అనే మలుపులతో మిగతా కథ నడుస్తుంది.

'బాయ్' అనే టైటిల్ కి తగినట్టుగానే ఈ కథ అంతా కూడా హీరో చుట్టూనే తిరుగుతుంది. హీరోగా చేసిన కొత్త కుర్రాడు లక్ష్య సిన్హా లుక్ చాలా బాగుంది. పెద్దగా కష్టపడకుండా మ్యాథ్స్ గండాన్ని గట్టెక్కేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలన్నింటిని ఉపయోగించుకునే కుర్రాడిగా లక్ష్య బాగా చేశాడు. చాలా యాక్టివ్ గా కనిపిస్తూ .. ఎమోషన్స్ ను కూడా బాగా పలికించాడు. ఇక కథానాయిక స్థానంలో కనిపించిన 'వర్ణ' కూడా లుక్స్ పరంగా మంచి మార్కులు కొట్టేస్తుంది. ఆమె పాత్ర పరిథి తక్కువే అయినా, కళ్లతోనే కట్టిపడేస్తుంది. మహి స్నేహితుడు వాయునందన్ పాత్రను పోషించిన కుర్రాడు కూడా చక్కని హావభావాలను పలికించాడు. ఇక మ్యాథ్స్ టీచర్ నాగేంద్రకుమార్ పాత్రలో వినయ్ వర్మ నటన ఆకట్టుకుంటుంది. పక్కదారి పట్టిన మహితేజ ఆలోచనలను పట్టాలెక్కించే మాస్టారు పాత్రలో ఎంతో సహజంగా చేశాడు. తన నటనతో కొన్ని సన్నివేశాలను నిలబెట్టేశాడు.

స్కూల్ ఫైనల్లో టీనేజ్ పిల్లల ఆకర్షణలు .. ఆలోచనలు .. అభిప్రాయాలు ఎలా వుంటాయో చూపించడం కోసం దర్శకుడు అమర్ విశ్వరాజ్ 'బాయ్' సినిమాను తెరకెక్కించాడు. ఈ కథకి తగిన హీరో - హీరోయిన్ ను ఎంచుకున్నందుకు, విలన్ లేకుండా ప్రేమకథను నడిపించే సాహసం చేసినందుకు ముందుగా ఆయనను అభినందించాలి. సహజత్వానికి పెద్దపీట వేస్తూ చదువు - ప్రేమ అనే రెండు అంశాల చుట్టూనే ఆయన ఈ కథను అల్లుకున్నాడు. స్కూల్ నేపథ్యంలో కామెడీకి, ప్రేమ నేపథ్యంలో రొమాన్స్ తో కూడిన పాటలకి ఆయన ఎంతమాత్రం అవకాశం ఇవ్వలేదు. అనూహ్యమైన మలుపులుగానీ, ఆసక్తికరమైన అంశాలుగాని లేకుండా కథనం నిదానంగా సాగడమే పెద్ద మైనస్ గా నిలిచింది. ఈ కారణంగానే ఈ ప్రేమకథ ఎలాంటి ప్రత్యేకత లేకుండా టీనేజర్లకే ఓ మాదిరిగా అనిపిస్తూ సాగుతుంది. ముఖ్యంగా బియ్యపు గింజపై అక్షరాలు రాయించే ఎపిసోడ్ చాలా టైమ్ తినేసింది. కథాకథనాల్లో బలం లోపించడంతో పాటు, ఒక్క వినయ్ వర్మ మినహా మిగతావన్నీ కొత్త ముఖాలు కావడం కూడా ప్రేక్షకుల అసంతృప్తికి మరో కారణంగా అనిపిస్తుంది.

సంగీతం .. ఎడిటింగ్ పనితీరు ఓ మాదిరిగా అనిపిస్తాయి. ఫొటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది. ఒక రకంగా ఈ సినిమాకి ఫొటోగ్రఫీ ప్రధానమైన బలంగా నిలిచిందనే చెప్పుకోవాలి. టీనేజ్ ప్రేమకథల్లో వుండే అల్లరి .. సందడి ఈ సినిమాలో కనిపించవు. కావలసినంత కామెడీకి .. పసందైన పాటలకి అవకాశం వున్నప్పటికి దర్శకుడు వాటి జోలికి పోలేదు. పాత్రలు .. ఆ పాత్రల కుటుంబ నేపథ్యాలు బలంగా అల్లుకోకపోవడం .. కథనంలో వేగం లేకపోవడం .. ఎలాంటి ట్విస్టులు లేకపోవడం ప్రధాన లోపాలుగా కనిపిస్తూ, టీనేజర్స్ సైతం ఓ మాదిరిగా ఉందిలే అనుకునేలా చేస్తాయి.        


More Reviews