రంగమార్తాండ - మూవీ రివ్యూ

Rangamarthanda

Movie Name: Rangamarthanda

Release Date: 2023-03-22
Cast: Prakash Raj, Ramya Krishna, Brahmanandam, Anasuya, Shivathmika, Rahul , Adarsh Balakrishna
Director:Krishna Vamsi
Producer: Kalepu Madhu, Venkat Reddy
Music: IlayaRaja
Banner: House Ful Movies
Rating: 3.00 out of 5
  • కృష్ణవంశీ నుంచి వచ్చిన 'రంగమార్తాండ'
  • ఎమోషన్స్ కి పెద్దపీట వేసిన డైరెక్టర్ 
  • ప్రకాశ్ రాజ్ .. బ్రహ్మానందం .. రమ్యకృష్ణ నటన హైలైట్ 
  • ఇళయరాజా సంగీతానికి ఎక్కువ మార్కులు 
  • ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సినిమా  

నక్సలిజం .. ఫ్యాక్షనిజం .. దేశభక్తి .. గ్రామీణ నేపథ్యం .. బంధాలు - అనుబంధాలు .. ఇలా ఏ అంశంపై కృష్ణవంశీ ఏ సినిమాను తెరకెక్కించినా, ఆ సినిమాపై ఆయన మార్కు తప్పకుండా కనిపిస్తుంది. ఆయన నుంచి చాలా గ్యాప్ తరువాత వచ్చిన సినిమానే 'రంగమార్తాండ'. మరాఠీలో నానా పటేకర్ చేసిన 'నట సామ్రాట్'కి ఇది రీమేక్. అక్కడ ప్రశంసలను అందుకున్న ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. ఇక్కడి ప్రేక్షకులను ఈ కథ ఏ స్థాయిలో మెప్పించిందనేది చూద్దాం. 

మెగాస్టార్ వాయిస్ ఓవర్ తో ఈ కథ మొదలవుతుంది. రాఘవరావు (ప్రకాశ్ రాజ్) రంగస్థలంపై తిరుగులేని నటుడు. ఆయన జీవితంలో చాలా భాగం రంగస్థలం పైనే గడుస్తుంది. ఆయన అంటే భార్య (రమ్యకృష్ణ)కి ఎంతో గౌరవం. ఎస్వీ రంగారావుగారి పట్ల అభిమానంతో తన కొడుక్కి రంగారావు (ఆదర్శ్ బాలకృష్ణ) అని పేరు పెడతాడు. కూతురు శ్రీ (శివాత్మిక) అంటే రాఘవరావుకు ప్రాణం. ఇక రాఘవరావుకు చక్రపాణి (బ్రహ్మానందం) చిరకాల మిత్రుడు. ఇద్దరూ కలిసే నాటకాలు వేస్తుంటారు. 

రంగస్థల నటుడిగా సుదీర్ఘకాలం పాటు వెలుగొందిన రాఘవరావుకు అభిమానులంతా కలిసి 'రంగ మార్తాండ' అనే బిరుదును ప్రదానం చేస్తారు. ఆయన చేతికి స్వర్ణ కంకణం తొడుగుతారు. ఇక ఆ రోజు నుంచి నాటకాలు విరమించి, తన కుటుంబ సభ్యులతోనే పూర్తి సమయాన్ని గడపాలని రాఘవరావు  నిర్ణయించుకుంటాడు. తన ఇంటిని కోడలు గీతా రంగారావు (అనసూయ) పేరుపై పెట్టి, కొన్ని షేర్లను .. నగలను కూతురు పేరుపై పెడతాడు. కూతురు శ్రీ .. రాహుల్ (రాహుల్ సిప్లి గంజ్) ను ఇష్టపడుతుందని తెలిసి, వారి పెళ్లి జరిపిస్తాడు. దాంతో శ్రీ .. రాహుల్ తో వెళ్లిపోతుంది. 

ఆస్తి చేజారిపోయిన దగ్గర నుంచి రాఘవరావుకి కోడలు వలన అవమానాలు ఎదురవుతూ వస్తుంటాయి. ఆ విషయం ఆయన భార్యకి చాలా బాధను కలిగిస్తూ ఉంటుంది. తమ ఊరు వెళ్లిపోయి అక్కడ ప్రశాంతంగా బ్రతుకుదామని ఆమె తరచూ అంటూ ఉంటుంది. ఒక వైపున కొడుకు వైపు నుంచి .. మరో  వైపున కూతురు వైపు నుంచి రాఘవరావుకు తట్టుకోలేని ఎదురుదెబ్బలు తగులుతాయి. అప్పుడు రాఘవరావు ఏ నిర్ణయం తీసుకుంటాడు? ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేదే  కథ. 

తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎన్నో కష్టాలు పడటం .. ఎదిగిన తరువాత ఆ పిల్లలే కన్నవాళ్లను నానా కష్టాలు పెట్టడం అనే కాన్సెప్ట్ తో గతంలో కోడి రామకృష్ణ .. విసు వంటి దర్శకులు చాలా సినిమాలను తెరకెక్కించారు. అయితే అదే పాయింట్ వెనుక ఇక్కడ రంగస్థల కళాకారుల నేపథ్యం ఉండటమే ఈ కథలోని కొత్తదనం. ఈ నేపథ్యాన్ని కృష్ణవంశీ తనదైన స్టైల్లో తెరపై ఆవిష్కరించాడు. ఎమోషన్ పాళ్లతో ఫ్యామిలీ ఆడియన్స్ తో కంటతడి పెట్టించాడు.  

ఈ సినిమాలో బ్రహ్మానందం .. ప్రకాశ్ రాజ్ కొడుకు - కోడలితో ఒక మాట అంటాడు. "మీ నాన్న .. నేను  మా కంటే మహా నటులు లేరనుకునే వాళ్లం ..  కానీ మీరు మేకప్ వేసుకోకుండా .. విగ్గు పెట్టుకోకుండా మా కన్నా గొప్పగా నటిస్తున్నార్రా. ఒక రకంగా నేను అదృష్టవంతుడినే .. మీ నాన్నకు మాదిరిగా నాకు  పిల్లలు లేరు'' అని. ఈ కథ మొత్తాన్ని ఒడిసి పట్టిన డైలాగ్ ఇది. నటుడిగా .. స్నేహితుడిగా .. భర్తగా గెలిచిన రాఘవరావు, తండ్రిగా ఓడిపోవడమే ఈ సినిమా. 

రంగస్థల నటులైన ఇద్దరు స్నేహితులు తమ బాధలను ఎలా షేర్ చేసుకున్నారు? తన భర్త ఆత్మాభిమానం దెబ్బతినడం ఒక భార్యకి ఎంత బాధను కలిగిస్తుంది?  అనేవి ఈ కథలో కీలకమైన అంశాలు. ప్రకాశ్ రాజ్ - బ్రహ్మానందం, .. ప్రకాశ్ రాజ్ - రమ్యకృష్ణ కాంబినేషన్లో వచ్చే ఈ తరహా సన్నివేశాలను కృషవంశీ అద్భుతంగా ఆవిష్కరించాడు. ఈ మూడు పాత్రల మధ్య నడిచే ఎమోషనల్ సీన్స్ కదిలిచివేస్తాయి .. కన్నీళ్లు పెట్టిస్తాయి. 

ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ .. బ్రహ్మానందం ముగ్గురూ కూడా నటన విషయంలో పోటీపడ్డారు. ఇక అనసూయ .. శివాత్మిక .. ఆదర్శ్ బాలకృష్ణ .. రాహుల్ సిప్లి గంజ్ పాత్ర పరిధిలో నటించారు. 'దమిడి సేమంతి' పాటలో ప్రకాశ్ రాజ్ చాలా ఈజ్ తో వేసిన స్టెప్స్ ఆకట్టుకుంటాయి. ఇళయరాజా బాణీలలో 'దమిడి సేమంతి'తో పాటు, 'పువ్వై విరిసే ప్రాయం' పాట హృదయానికి పట్టుకుంటుంది. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్. రాజ్ కె నల్లి ఫొటోగ్రఫీ బాగుంది. ప్రేక్షకులకు ఒక నాటకాన్ని చూస్తున్న ఫీలింగును ఆయన తీసుకొచ్చాడు. పవన్ ఎడిటింగ్ ఓకే. ఆకెళ్ల శివ ప్రసాద్ సమకూర్చిన సంభాషణలు సహజంగా అనిపిస్తూ, అక్కడక్కడా మనసు లోతులను తాకుతాయి.

ప్లస్ పాయింట్స్ గా కథాకథనాలు .. నటీనటుల నటన .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. పాటలు .. సంభాషణలు .. ఎమోషనల్ సీన్స్  ను చెప్పుకోవచ్చు. ఈ కథను తెరపై ఒక నాటకంలా నడిపించానని ప్రమోషన్స్ లో కృష్ణవంశీ చెప్పాడు. అందువలన స్లో నేరేషన్ ను మైనస్ పాయింట్ గా చెప్పలేము. అలాగే రంగస్థలంతో ముడిపడిన ఈ కథను .. ఇంతకుముందు వచ్చిన  కథలతో పోల్చలేము. ఈ మధ్య కాలంలో తక్కువ పాత్రలతో .. తక్కువ బడ్జెట్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ ను బలంగా చెప్పిన కథగానే ఈ సినిమాను చూడాలి. 

Trailer

More Reviews