మూవీ రివ్యూ : 'కోబ్రా'

Cobra

Movie Name: Cobra

Release Date: 2022-08-31
Cast: Vikram, Srinidhi Shetty, Irfan Pathan
Director:Ajay Gnanamutthu
Producer: Lalith Kumar
Music: AR Rehman
Banner: Seven Screen Studios
Rating: 2.50 out of 5
  • ఈ బుధవారమే విడుదలైన 'కోబ్రా'
  • కొత్తదనం కోసం పోరాడిన విక్రమ్
  • అయోమయానికి గురిచేసే కథాకథనాలు 
  • రెహ్మాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధానమైన బలం 
  • అదనపు బలంగా నిలిచిన ఫొటోగ్రఫీ

సౌత్ ఇండియాలోనే ప్రయోగాత్మక కథలను ఎంచుకోవడంలోను, వైవిధ్యభరితమైన పాత్రలకు ప్రాధాన్యతనిచ్చే విషయంలోను కమల్ తరువాత స్థానంలో విక్రమ్ కనిపిస్తాడు. అయితే ఈ మధ్య కాలంలో విక్రమ్ చేసిన సినిమాలేవీ ఆయనకి అంతగా కలిసి రాలేదు. ఈసారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన చేసిన సినిమానే 'కోబ్రా'. లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించాడు. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాలో,  ఇర్ఫాన్ పఠాన్ .. మృణాళిని రవి .. రోషన్ మాథ్యూ .. రోబో శంకర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ బుధవారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉందన్నది ఇప్పుడు చూద్దాం. 

కథ మొదలవుతూ ఉండగానే ఒక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి హత్య జరుగుతుంది. ఆ తరువాత స్కాట్ లాండ్ కి చెందిన ఒక యువరాజు హత్య జరుగుతుంది. ఈ రెండు హత్యలకి సంబంధించి ఉన్న ఒకే ఒక లింక్ .. హంతకుడు గొప్ప మ్యాథమెటీషియన్ కావడం ... ఆ బుర్రతో ఎలాంటి క్లూ వదలకుండా తప్పించుకుంటూ తిరగడం. దాంతో ఈ కేసు మూలాలు వెతుక్కుంటూ ఇంటర్ పోల్ ఆఫీసర్ అస్లాన్ (ఇర్ఫాన్ పఠాన్) చెన్నై కి వస్తాడు.  తనదైన స్టైల్లో తీగలాగడం మొదలుపెట్టిన ఆయనకి జూడి (మీనాక్షి గోవిందరాజన్) సాయపడుతుంటుంది. 

వివిధ వేషాలలో ఈ హత్యలను చేస్తూ వెళుతున్న మదీ ( విక్రమ్)ను భావన (శ్రీనిధి శెట్టి) ప్రేమిస్తూ ఉంటుంది. తనని పెళ్లి చేసుకోమని వెంటబడుతూ ఉంటుంది. తాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నదీ తనకి తెలుసు గనుక, పెళ్లికి తాను నిరాకరిస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే భావనకి మదీ ఫ్లాష్ బ్యాక్ తెలుస్తుంది. ఇంటర్ పోల్ ఆఫీసర్ కి హెల్ప్ చేస్తున్న భావన స్నేహితురాలు జూడీకి మదీపై అనుమానం వస్తుంది. అదే సమయంలో కదీర్ పాత్రతో మరో విక్రమ్ తెరపైకి వస్తాడు. 

ఈ ఇద్దరి జీవితాల వెనుక రుషి ఉన్నాడనే విషయం అస్లాన్ కి అర్థమవుతుంది. మదీ ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? కదీర్ ఎవరు? ఆయన రాకతో చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి?  ఆ ఇద్దరి జీవితాలను ప్రభావితం చేసిన రుషి నేపథ్యం ఏమిటి? భావన కోరుకున్నట్టుగా మదీ ఆమె సొంతమవుతాడా? వంటి పరిణామాలతో ఈ కథ ముందుకు వెళుతుంది. 

విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ గా చెప్పుకునే విక్రమ్ చేయదగిన సినిమానే ఇది. విక్రమ్ క్రేజ్ కి తగిన భారీతనం తెరపై అడుగడుగునా కనిపిస్తూనే ఉంటుంది. విక్రమ్ ఈ సినిమాను అంగీకరించడంలో అర్థం ఉందన్నట్టుగా ఒక కొత్త పాయింట్ కనిపిస్తుంది. ఆసక్తికరమైన అంశాలతో ముందుకు నడిపించే అవకాశం ఉంది. కానీ దర్శకుడు కథను చెప్పడంలో కన్ ఫ్యూజ్ అయ్యాడు. దాంతో సినిమా చూస్తున్న ప్రేక్షకులలో చాలామంది అయోమయానికి లోనవుతారు. 

కథను తయారు చేసుకోవడం .. దానిని ఎత్తుకోవడం .. కథానాన్ని నడిపించిన తీరు .. పాత్రలను మలచిన విధానం ఇలా అన్నీ లోపాలతోనే కనిపిస్తాయి. అవసరమైన చోట క్లారిటీ ఇవ్వకుండా దర్శకుడు అలా ముందుకు వెళ్లిపోయాడు. హీరోకి ఉన్న ఒక వ్యాధి కారణంగా తన ఆలోచనల్లోకి వచ్చి వెళుతున్న పాత్రలను .. తెరపైకి తీసుకుని వచ్చి మరింత కన్ ఫ్యూజ్ చేశాడు. విక్రమ్ డ్యూయెల్ రోల్లో ఆయనను ఎంటర్ చేయడానికి ముందు ఆ పాత్రలలో పాతికేళ్లకి పైగా వయసున్న మరో ఆర్టిస్టును చూపించడం పైత్యానికి పరాకాష్ఠగా కనిపిస్తుంది. 

విక్రమ్ లుక్ దగ్గర నుంచి దర్శకుడు నిరాశపరుస్తూనే వచ్చాడు. శ్రీనిధి శెట్టి వంటి హీరోయిన్ ను పెట్టుకుని రొమాన్స్ పరంగా ఆమెను ఎంత మాత్రం ఉపయోగించుకోలేదు. మొదటి నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు పవర్ఫుల్ గా లాక్కొచ్చిన ఇర్ఫాన్ పాత్రను, ఆ తరువాత వేరే పాత్రలపై ఆధారపడేలా చేశాడు. ఇక విలన్ ఉద్దేశమేమిటి అనే విషయంలో కూడా క్లారిటీ ఉండదు. క్లైమాక్స్ లో నైనా ఆశించిన పాత్రలకి న్యాయం జరిగిందా అంటే అదీ లేదు. కథకంటే కూడా బడ్జెట్ పరంగా బరువైన ఈ సినిమాను, ఒంటి చేత్తో లాక్కుని రావడానికి విక్రమ్ తనవంతు ప్రయత్నం చేశాడు. 

ఏఆర్ రెహ్మాన్ సంగీతం బాగుంది. ఆయన బాణీలు కూడా బాగున్నాయిగానీ, తెలుగు సాహిత్యం విషయంలో శ్రద్ధ తీసుకోలేదు. ఒక పాట ద్వారా హీరో .. హీరోయిన్ ఏం చెప్పాలనుకుంటున్నారనేది ఒక పట్టాన అర్థం కాదు. ఒక లైన్ కీ  .. మరో లైన్ కి పొంతన లేకుండా, నోటికి వచ్చింది పాడేసుకుంటున్నట్టుగా ఉంటుంది. హరీశ్ కణ్ణన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఛేజింగ్స్ ను .. ఫైట్స్ ను .. పాటలను గొప్పగా చిత్రీకరించాడు. కథలోనే గందరగోళం ఉంది గనుక, ఎడిటింగ్ పరంగా కూడా ఆ చిక్కును తీయడం కష్టమే. ఖర్చుతో పాటు కథపై కూడా దృష్టి పెట్టి ఉంటే విక్రమ్ ప్రయత్నానికీ .. ప్రయోగానికి ఒక అర్థం ఉండేదేమో.

More Reviews