మూవీ రివ్యూ: 'రామారావు ఆన్ డ్యూటీ'

Ramarao On Duty

Movie Name: Ramarao On Duty

Release Date: 2022-07-29
Cast: Raviteja, Divyansha Koushik
Director:Sarath Mandava
Producer: Sudhakar Cherukuri
Music: Sam CS
Banner: SLV Cinemas
Rating: 2.50 out of 5
  • ఈ రోజునే థియేటర్లకు వచ్చిన 'రామారావు ఆన్ డ్యూటీ'
  • కొత్తదనం లేని కథ .. ఆకట్టుకోని కథనం
  • ప్రధానమైన పాత్రలకి లేని ప్రాధాన్యత
  • చిన్న పాత్రలు చేసే హడావిడి ఎక్కువ
  • మిస్సయిన రవితేజ మార్క్ ఎనర్జీ

రవితేజ హీరోగా సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా రూపొందింది. ఈ సినిమాతోనే తెలుగు తెరకి దర్శకుడిగా శరత్ మండవ పరిచయమయ్యాడు. సామ్ సీఎస్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. రవితేజ సరసన నాయికలుగా దివ్యాన్ష కౌశిక్ .. రజీషా విజయన్ నటించారు. నాజర్ .. నరేశ్ .. వేణు తొట్టెంపూడి .. తనికెళ్ల భరణి ముఖ్యమైన పాత్రలను పోషించగా, అన్వేషి ఐటమ్ సాంగ్ చేసింది. రవితేజ కూడా ఒక నిర్మాతగా ఉన్న ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. మరి ఆన్ డ్యూటీ లో రామారావు ఏం చేశాడనేది చూద్దాం. 

శ్రీకాకుళంలో సబ్ కలెక్టర్ గా రామారావు (రవితేజ) పనిచేస్తుంటాడు. భార్య నందిని (దివ్యాన్ష)తో పాటు తల్లిదండ్రులతో కూడిన ఫ్యామిలీ ఉంటుంది. రామారావు నీతికీ .. నిజాయతీకి మారు పేరు. అవినీతి పరులైన రాజకీయనాయకులను .. అధికారులను ఎదిరిస్తూ రైతులకు అండగా నిలుస్తుంటాడు. ఇక అందుకు పూర్తి వ్యతిరేకమైన స్వభావం కలిగిన పోలీస్ ఆఫీసర్ గా మురళి (వేణు తొట్టెంపూడి) ఉంటాడు. రామారావు సంగతేంటో  చూద్దాం అనే స్థాయిలోనే మురళి ముందుకు వెళుతుంటాడు. 

ఈ నేపథ్యంలోనే రామారావుకి తన సొంత ఊరుకు బదిలీ అవుతుంది. అక్కడికి వెళ్లిన ఆయనకి మాలిని( రజీషా విజయన్) ఆర్థికపరమైన కష్టాల్లో ఉందని తెలుస్తుంది. గతంలో ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటారుగానీ .. కొన్ని కారణాల వలన కుదరదు. తన భర్త మిస్సింగ్ మిస్టరీ గురించి ఆమె రామారావుతో చెబుతుంది. అందుకు గల కారణాలను గురించి ఆయన ఆరాతీయడం మొదలుపెడతాడు. కనిపించకుండా పోయింది మాలిని భర్త మాత్రమే కాదు .. 20 మందివరకూ ఉన్నారనే విషయం తెలుస్తుంది. అప్పుడు రామారావు  ఏం చేస్తాడు? వరుస మిస్సింగ్ లకు కారకులు ఎవరు? అనే అంశాల చుట్టూ ఈ కథ నడుస్తుంది. 

'ఊరు గురించి చెప్పమంటే .. ఉల్లిపాయ పొట్టు నుంచి మొదలుపెట్టినట్టు' అనే ఒక సామెత ఉంది. కరెక్టుగా ఈ సినిమా అలాగే మొదలవుతుంది. ఒకరాత్రి వేళ జోరున వర్షం .. లాంతరు పట్టుకుని ఫారెస్టు ఏరియాలోని ఒక గుడిసెలో నుంచి ఒక వ్యక్తి బయటికి వస్తాడు. కొంచెం దూరంలో వర్షానికి మట్టి కొట్టుకుపోయిన ఒక శవం చేయి బయటికి వస్తుంది. లాంతరు పట్టుకున్న వ్యక్తి ఆ శవం దగ్గరికి వెళ్లి .. బయటికి వచ్చిన చేతిని గొడ్డలితో నరికేస్తాడు. శవం చేయి నరకడం ఏంటి? అనే ఆశ్చర్యంలోనే ఉండిపోవద్దు. ఎందుకంటే ఇలాంటి షాకులు ఈ సినిమాలో చాలానే కనిపిస్తాయి.

శరత్ మండవకి తెలుగులో ఇది తొలి సినిమానే అయినా, రచయితగాను .. దర్శకత్వ విభాగంలోను మంచి అనుభవం ఉంది. ఆయన ఇలాంటి ఒక కథను రాసుకుంటాడని ఎవరూ అనుకోరు. తెరపై పాత్రలు మారిపోతుంటాయి .. ఏ పాత్రకీ ఒక క్యారెక్టరైజేషన్ కనిపించదు. కథ అడవులు .. నగరాలు .. దేశాలు దాటేసి వెళ్లిపోతుంది. కానీ ఎక్కడా క్లారిటీ కనిపించదు. 'ఈయన సామాన్యుడు కాదురోయ్' అని ఇతర పాత్రల ద్వారా రవితేజ పాత్రను పైకి లేపే ప్రయత్నం కూడా చేశాడు. కానీ కుదరలేదు.   

రవితేజకి ఒక స్టైల్ అనేది ఉంది .. మాస్ లో ఆయనకంటూ ఒక ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమా టైటిల్ కూడా రవితేజ క్రేజ్ కి తగినదే. ఎటొచ్చి కథాకథనాల దగ్గరే గందరగోళం అయింది. డైలాగ్స్  .. యాక్షన్ .. డాన్స్ పరంగా కూడా రవితేజ మార్క్ మిస్సయింది. ఈ సినిమాలో రవితేజలో తెచ్చిపెట్టుకున్న ఉత్సాహమే కనిపిస్తుంది. అక్కడక్కడా మాత్రమే కాస్త ఫిట్ గా కనిపిస్తూ, చాలా ఫ్రేమ్స్ లో అలసిపోయినట్టుగానే అనిపించాడు. ఇక ఇద్దరి కథానాయికల పాత్రలకి ఎలాంటి ప్రాధాన్యత లేదు. రజీషా విజయన్ రవితేజ సరసన అసలు సెట్ కాలేదు. వేణు తొట్టెంపూడి తన బాడీ లాంగ్వేజ్ ను గుర్తుచేసుకుని కంటిన్యూ చేయడానికి బాగానే కష్టపడ్డాడు పాపం.  

కథా పరంగా రవితేజ తెరపై చాలా చోట్లకి తిరుగుతూ  .. చాలా హడావిడి చేస్తుంటాడు. ప్రేక్షకుడు మాత్రం మనకెందుకొచ్చిన గొడవ అన్నట్టుగా చూస్తుంటాడు అంతే. ఏం జరగబోతోంది? ఎవరు ఏం చేయతున్నారు? అనే కుతూహలం కనిపించదు. పెద్ద పాత్రలను పక్కన పెట్టేసి చిన్న పాత్రలు చేసే హడావిడి ఎక్కువ. కొంతమంది ఎక్స్ ప్రెషన్స్ ను కూడా దర్శకుడు సరిగ్గా తీసుకోలేదు. అసలు విలన్ సినిమా చివరిలో తెరపైకి వస్తాడు. 'అంత తేలిగ్గా నా ఫేస్ మీకు చూపిస్తానా?' అన్నట్టుగా నిదానంగా మన వైపు తిరుగుతాడు. ఈయన ఎవరబ్బా? అని మనం గుర్తుపట్టడానికి ట్రై చేసేలోగా సినిమా అయిపోతుంది. 'ఓహో .. సీక్వెల్ ఉందన్నమాట' అనుకుని సీట్లలో నుంచి మనం లేవాలన్న మాట.

'రామారావు' కథను చెప్పడానికి దర్శకుడికి రెండున్నర గంటలు సరిపోలేదంటే ఆశ్చర్యమే. అంటే ఇక్కడ చెప్పకుండా మన దగ్గర ఆయన చాలా కథనే దాచాడనుకోవాలి. సామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో చెవుల తుప్పు వదిలిపోతుందని ప్రీ రిలీజ్ ఈవెంటులో శరత్ మండవ చెప్పాడు .. ఈ విషయంలో మాత్రం ఆయన నిజమే చెప్పాడు. సీన్స్ తో సంబంధం లేకుండా సామ్ తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయాడు. పాటల పరంగా చెప్పుకుంటే 'సీసా' సాంగ్ బాగుందనిపిస్తుంది. రజీషాతో రవితేజ పాడుకునే పాటను సిద్ శ్రీరామ్ తో పాడించడం వంటి సాహసం కూడా సామ్ చేశాడు. ట్యూన్ పరంగా బాగుంది .. కానీ రవితేజకు ఆ వాయిస్ సెట్ కాలేదు.  

 సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ బాగుంది. అడవి నేపథ్యంలో సన్నివేశాలను .. రెయిన్  ఎఫెక్ట్ లోని దృశ్యాలను .. పాటలకు అందాన్ని తీసుకొచ్చే విజువల్స్ ను గొప్పగా ఆవిష్కరించాడు. ఎడిటింగ్ మాటకొస్తే ఓ మాదిరిగా అనిపిస్తుంది. కథలో కొత్తదనం లేకపోవడం .. కథనంలో ఆసక్తి లేకపోవడం .. కొన్ని సన్నివేశాలు కృతకంగా అనిపించడం  .. పాత్రలను సరిగ్గా డిజైన్ చేయకపోవడం .. ప్రధానమైన పాత్రలకు ప్రాధాన్యత లేకపోవడం .. గుర్తుపెట్టుకోలేనంతగా చిన్న పాత్రలు పెరిగిపోవడం .. డైలాగ్స్ లోను పసలేకపోవడం లోపంగా కనిపిస్తాయి.

More Reviews