Amigos: అమిగోస్ ప్రయోగాత్మక చిత్రం కాదు.. కమర్షియల్ సినిమానే: కల్యాణ్ రామ్

  • మూడు పాత్రలు పోషించిన కల్యాణ్ రామ్
  • శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం
  • హీరోయిన్ గా నటించిన అషికా రంగనాథ్
Amigos is not an experimental film It is a commercial film says Kalyan Ram

నందమూరి కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘అమిగోస్’. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. అషికా రంగనాథ్ ఈ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అవుతోంది. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకలు ముందుకు రానుంది. చిత్రం బృందం ఇప్పటికే ప్రమోషన్స్ జోరు పెంచింది. హీరో కల్యాణ్ రామ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిత్ర విశేషాలు వెల్లడించారు. బింబిసార చిత్రంతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న కల్యాణ్ రామ్ ఆ విజయాన్ని ఆస్వాదిస్తూ ఇందులో నటించినట్టు తెలిపారు. బింబిసార, అమిగోస్‌, డెవిల్ చిత్రాలను 2020లోనే అంగీకరించానని చెప్పారు. 

ఒకే పోలికలతో ఉండే ముగ్గురు ఎలా కలిశారు.. వాళ్లలో ఎవరికేం కావాలనేది అమిగోస్ లో ఆసక్తికర అంశం అన్నారు. ఈ చిత్రంలో ముగ్గురి పాత్రలకు సంబంధించిన టైటిల్ పెట్టాలని ‘అమిగోస్‌’ ఖరారు చేశామని వెల్లడించారు. కన్నడ చిత్రం ‘కాంతార’ అంటే అర్థం ఏమిటో తెలియకపోయినా జనాలు సినిమాను ఆదరించారన్నారు. ఆ నమ్మకంతోనే తన చిత్రానికి అమిగోస్ అనే టైటిల్ పెట్టినట్టు వెల్లడించారు.  

ఇక ఇది ప్రయోగాత్మక చిత్రం కాదని, పక్కా కమర్షియల్ సినిమానే అని కల్యాణ్ రామ్ స్పష్టం చేశారు. ఇందులో మూడు పాత్రలు పోషించినందున.. చిత్రీకరణ ప్రక్రియ కష్టంగా అనిపించిందని చెప్పారు. మూడు పాత్రల పేర్లు సిద్ధార్థ్‌, మంజునాథ్, మైఖేల్ అని తెలిపారు. గ్యాంగ్ స్టర్ పాత్ర అయిన మైఖేల్ గా నటించడం తనకు కొత్తగా అనిపించిందని చెప్పారు. ఈ చిత్రంలో  పాటలతో పాటు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుందన్నారు.

More Telugu News