Dell: 6,500 మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న డెల్

  • ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం
  • నష్టాలు ఎదుర్కొంటున్న కంప్యూటర్ తయారీ రంగం
  • డెల్ సంస్థకూ తప్పని ఇబ్బందులు
  • 5 శాతం మంది ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం
  • ఇప్పటికే మెమో జారీ
Dell set to layoff 6500 employees

ఇటీవల ప్రముఖ టెక్ సంస్థలు భారీగా ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. ఖర్చులు తగ్గించుకునే క్రమంలో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, బైజూస్, పేపాల్, స్పాటిఫై వంటి సంస్థలు ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. 

ఈ జాబితాలో ఇప్పుడు కంప్యూటర్ల తయారీ దిగ్గజం డెల్ కూడా చేరింది. 6,500 మంది ఉద్యోగులను తొలగించేందుకు డెల్ సిద్ధమైంది. ఈ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెల్ ఉద్యోగుల్లో 5 శాతం మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. 

ఇటీవల లేఆఫ్ లు ప్రకటిస్తున్న టెక్ సంస్థల్లో డెల్ కూడా చేరిందని వ్యాపార రంగ మీడియా సంస్థ బ్లూమ్ బెర్గ్ వెల్లడించింది. తొలగింపునకు సంబంధించిన మెమోను డెల్ ఇప్పటికే తన ఉద్యోగులకు జారీ చేసినట్టు తెలిపింది. డెల్ సహ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ క్లార్క్ పేరిట ఆ మెమో పంపించినట్టు వెల్లడించింది. 

"ఒడిదుడుకులతో కూడిన మార్కెట్ పరిస్థితులను ప్రస్తుతం డెల్ కూడా ఎదుర్కొంటోంది. అనిశ్చితితో కూడిన భవిష్యత్తు క్షీణదశ వైపు నడిపిస్తోంది. గతంలోనూ ఆర్థిక మాంద్యాన్ని చవిచూశాం... కానీ మరింత బలంగా తయారయ్యాం. ఇప్పుడు కూడా అంతే. మార్కెట్ పుంజుకోగానే మళ్లీ పూర్వస్థితిని అందుకుందాం" అంటూ జెఫ్ క్లార్క్ పేర్కొన్నారు. 

2022 నాలుగో త్రైమాసికంలో పర్సనల్ కంప్యూటర్ విక్రయాలు పడిపోవడంతో అనేక కంప్యూటర్ తయారీ సంస్థలు నష్టాల బాటలో కొనసాగుతున్నాయని టెక్ అనలిస్ట్ ఐడీసీ వెల్లడించింది. డెల్ కూడా ఇతర కంపెనీల బాటలోనే నడుస్తోందని, 2021 నాలుగో త్రైమాసికంతో పోల్చితే 2022 త్రైమాసికంలో 37 శాతం నష్టాలు చవిచూసిందని ఐడీసీ వివరించింది. డెల్ సంస్థకు 55 శాతం ఆదాయం పర్సనల్ కంప్యూటర్ల విక్రయాల ద్వారానే లభిస్తుంది.

More Telugu News