Supreme Court: సుప్రీంకోర్టులో పెరిగిన జడ్జీల సంఖ్య.. నూతన న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం

  • సుప్రీం జడ్జీలుగా ఐదుగురు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
  • న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టిన తెలుగు వ్యక్తి జస్టిస్ పులిగోరు సంజయ్ కుమార్
  • 32కు పెరిగిన మొత్తం సుప్రీం న్యాయమూర్తుల సంఖ్య
supreme court gets five new judges chief justice administers oath of office

భారత సర్వోన్నత న్యాయస్థానంలో కొత్తగా ఐదుగురు జడ్జీలు కొలువుదీరారు. దీంతో.. సుప్రీం న్యాయమూర్తుల మొత్తం సంఖ్య 32కు చేరింది. సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు వ్యక్తి జస్టిస్ పులిగోరు వెంకట్ సంజయ్ కుమార్‌తో పాటూ జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అసదుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదవీబాధ్యతలు స్వీకరించారు. 

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం..గతేడాది డిసెంబర్ 13న ఈ ఐదుగురి పేర్లను కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనల విషయంలో కేంద్రం, సుప్రీం కోర్టు మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. చివరకు కేంద్రం కొలీజియం ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం సుప్రీం కోర్టులో తెలుగు వ్యక్తి పమిడిఘంటం శ్రీనరసింహం న్యాయమూర్తిగా ఉన్నారు. తాజాగా జస్టిస్ పులిగోరు వెంకట్ సంజయ్ కుమార్‌ నియామకంతో సర్వోన్నత న్యాయస్థానంలో తెలుగు జడ్జీల సంఖ్య రెండుకు చేరింది. 

జస్టిస్ సంజయ్ కుమార్ 1963 ఆగస్టు 14న  హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన తండ్రి పి. రామచంద్రారెడ్డిది చిత్తూరు జిల్లా. 1988లో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించిన ఆయన సుదీర్ఘకాలం పాటూ ఏపీ అడ్వకేట్ జనరల్‌గా సేవలందించారు.

More Telugu News