Pawan Kalyan: కళా తపస్వి చిత్రాలు వెండితెరపై మెరిసిన స్వర్ణ కమలాలు: పవన్ కల్యాణ్

  • తుదిశ్వాస విడిచిన కె.విశ్వనాథ్
  • తీవ్ర ఆవేదనకు గురయ్యానన్న పవన్ కల్యాణ్
  • కె.విశ్వనాథ్ స్థానం ఎవరూ భర్తీ చేయలేరని వెల్లడి
Pawan Kalyan condolences to K Viswanath demise

కళాతపస్వి కె.విశ్వనాథ్ (92) కన్నుమూసిన నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. తెలుగు సినిమా స్థాయిని, తెలుగు దర్శకుల సృజనాత్మకతను ఉన్నత శిఖరాన ఉంచిన దర్శక స్రష్ట కె.విశ్వనాథ్ గారు శివైక్యం చెందారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యానని వెల్లడించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. 

"విశ్వనాథ్ గారితో వ్యక్తిగతంగా నాకు మంచి పరిచయం ఉంది. అన్నయ్య చిరంజీవితో శుభలేఖ, స్వయంకృషి, ఆపద్బాంధవుడు చిత్రాలు తీసినప్పటి నుంచి విశ్వనాథ్ గారు తెలుసు. ఆయనను ఎప్పుడు కలిసినా తపస్సంపన్నుడైన జ్ఞాని మన కళ్లముందు ఉన్నట్టే అనిపించేది. భారతీయ సంస్కృతిలో భాగమైన సంగీతం, నృత్యాలను తన కథల్లో పాత్రలుగా చేసి తెరపై ఆవిష్కరించిన గొప్ప వ్యక్తి విశ్వనాథ్ గారు. అందుకు మచ్చుతునకలు శంకరాభరణం, సిరిసిరి మువ్వ, స్వర్ణ కమలం, సాగర సంగం, సిరివెన్నెల వంటి చిత్రాలు. 

శారద, నేరము శిక్ష, ఉండమ్మా బొట్టు పెడతా, ఓ సీత కథ, స్వాతిముత్యం, సీతామాలక్ష్మి వంటి చిత్రాల్లో మన జీవితాలను, మనకు పరిచయం ఉన్న మనస్తత్వాలను చూపించారు. అందువల్లే అన్ని వర్గాలు ప్రేక్షకులు ఆయనను గుండెల్లో పెట్టుకున్నారు. కళాతపస్విగా ప్రేక్షకుల మన్ననలు పొందిన విశ్వనాథ్ గారి చిత్రాలు తెలుగు తెరపై స్వర్ణ కమలాలుగా మెరిశాయి. నటుడిగా ఆయన పోషించిన పాత్రలు సినిమాలకు నిండుదనాన్ని తీసుకువచ్చాయి. 

తెలుగు సినిమా కీర్తిప్రతిష్ఠలు ఇనుమడింపజేసిన విశ్వనాథ్ గారి స్థానం భర్తీ చేయలేనిది. వారి కుటుంబానికి నా తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అంటూ పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

More Telugu News