APPLE: రికార్డు స్థాయి ఆదాయాన్ని భారత్ లో నమోదు చేశాం: యాపిల్ సీఈవో టిమ్ కుక్

  • డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో 5 శాతం తగ్గిన యాపిల్ ఆదాయం
  • భారత మార్కెట్లో మాత్రం రెండంకెల వృద్ధి
  • భారత్ ఎంతో ఉత్తేజకరమైన మార్కెట్ గా పేర్కొన్న టిమ్ కుక్
CEO Tim Cook says he is bullish on India confirms first Apple retail store opening soon

భారత మార్కెట్లో అమెరికన్ కంపెనీ యాపిల్ దూసుకుపోతోంది. 2022 డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో యాపిల్ కు భారత్ మార్కెట్ ఆశాకిరణంగా నిలిచింది. త్రైమాసికం ఫలితాలను సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో యాపిల్ ఆదాయం 5 శాతం తగ్గి 117.2 బిలియన్ డాలర్లుగా ఉంది. కానీ, భారత మార్కెట్లో మాత్రం యాపిల్ తన ఉత్పత్తుల విక్రయాల పరంగా మంచి వృద్ధిని చూసింది.

‘‘త్రైమాసికం వారీగా రికార్డు స్థాయి ఆదాయాన్ని భారత్ లో నమోదు చేశాం. వార్షికంగా చూస్తే రెండంకెల వృద్ధి సాధ్యమైంది. భారత్ లో ఐఫోన్లు విరివిగా విక్రయమవుతున్నాయి‘‘ అని టిమ్ కుక్ ప్రకటించారు. ఇందుకు యాపిల్ ఆన్ లైన్ స్టోర్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు. భారత్ లో ఐఫోన్ తోపాటు ఐప్యాడ్, మాక్ బుక్ శ్రేణి విక్రయాల్లోనూ మంచి వృద్ధి కనిపిస్తున్నట్లు తెలిపారు. 

త్వరలోనే భారత్ లో తొలి యాపిల్ రిటైల్ స్టోర్ ను ప్రారంభిస్తామని టిమ్ కుక్ ప్రకటించారు. ఇది తమ ఉత్పత్తుల విక్రయాలకు మరింత వృద్ధిని తెచ్చి పెడుతుందన్నారు. భారత్ లో రిటైల్, ఆన్ లైన్ విక్రయాలకు పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నామని, భారత్ పట్ల తాను ఎంతో బుల్లిష్ గా ఉన్నట్టు చెప్పారు. భారత్ ఎంతో ఉత్తేజకరమైన మార్కెట్ అని అభివర్ణించారు. 

More Telugu News