hong kong: ఫ్రీగా టికెట్లిస్తాం.. మా దేశం చూసివెళ్లండి!: పర్యాటకులకు హాంకాంగ్ బంపర్ ఆఫర్

  • 5 లక్షల మందికి ఉచితంగా విమాన టికెట్లు, క్యాష్ ఓచర్లు
  • ‘హలో హాంకాంగ్’ పోగ్రాంలో ప్రకటించిన విమానయాన కంపెనీలు
  • వచ్చే మార్చి నుంచి సెప్టెంబర్ వరకు టికెట్ల పంపిణీ
Hong Kong is Giving Away 500000 Free Air Tickets

కరోనా కారణంగా కుదేలయిన పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు హాంకాంగ్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. విదేశీ పర్యాటకులకు ఉచితంగా ఫ్లైట్ టికెట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పర్యాటక ప్రచార కార్యక్రమం ‘హలో హాంకాంగ్’ ప్రారంభిస్తూ 5 లక్షల ఫ్లైట్ టికెట్లు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. ఈమేరకు హాంకాంగ్ విమానయాన సంస్థలు గురువారం ప్రకటన విడుదల చేశాయి. 

ఈ పథకంలో భాగంగా తమ దేశానికి రావాలనుకునే పర్యాటకులకు ఒకటి కొంటే మరొకటి ఉచితం పద్ధతిలో టికెట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. లక్కీ డ్రా విధానంలోనూ ఈ ఉచిత టికెట్లను గెలుచుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. వచ్చే నెల (మార్చి) నుంచి సెప్టెంబర్ వరకు విడతల వారీగా ఉచిత టికెట్లను పంపిణీ చేస్తామని వివరించారు. టికెట్లతో పాటు పలు కూపన్లు, క్యాష్ వోచర్లను గెలుచుకునే అవకాశం కూడా ఉందని వివరించారు. ఉచిత విమాన టికెట్ల కోసం హాంకాంగ్ ఎయిర్ లైన్స్ సంస్థలు ఏకంగా 2 బిలియన్ హాంకాంగ్ డాలర్లు (మన రూపాయిల్లో 2,100 కోట్లు) ఖర్చుచేస్తున్నాయి.

భారతీయులకు కూడా ఉచిత టికెట్ల ఆఫర్ వర్తిస్తుందని, మార్చిలో ఇండియా సహా ఆగ్నేయ దేశాల (సౌత్ ఈస్ట్ ఆసియా) పౌరులకు టికెట్లు కేటాయిస్తామని హాంకాంగ్ విమానయాన సంస్థల ప్రతినిధి వెల్లడించారు. ఆ తర్వాత ఏప్రిల్ లో చైనా పౌరులకు, మే నెలలో నార్త్ ఈస్ట్ ఆసియా తో పాటు ఇతర దేశాల పౌరులకు టికెట్లు కేటాయిస్తామని వివరించారు. జులైలో తమ దేశ పౌరులకు కూడా ఈ ఆఫర్ ను వర్తింపజేస్తామని తెలిపారు. అయితే, ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలను హాంకాంగ్ విమానయాన సంస్థలు ఇంకా వెల్లడించలేదు.

More Telugu News