Dilish Parekh: ప్రపంచంలోనే అత్యధిక కెమెరాలు సేకరించిన డిలీష్ పరేఖ్ కన్నుమూత

  • ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్‌గా కెరియర్‌ను ప్రారంభించిన పరేఖ్
  • 2,634 కెమెరాలు సేకరించినందుకు గాను 2003లో గిన్నిస్ రికార్డ్
  • 4,425 కెమెరాలతో 2013లో మరో రికార్డ్
  • అత్యంత అరుదైన, ఖరీదైన కెమెరాలను సేకరించిన పరేఖ్
  • ఒక్క దానిని కూడా విక్రయించకుండా జాగ్రత్తగా పదిలపరుచుకున్న డిలీష్
Dilish Parekh the man with worlds largest camera collection died

ప్రపంచంలోనే అత్యధిక కెమెరాలు సేకరించిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డులకెక్కిన ముంబైకి చెందిన డిలీష్ పరేఖ్ కన్నుమూశారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. బుధవారం సాయంత్రం ఆయన మరణించినట్టు కుటుంబ సభ్యులు తాజాగా వెల్లడించారు. ఫ్రీలాన్స్ లెన్స్‌మ్యాన్‌గానూ పనిచేసిన పరేఖ్‌కు భార్య బినీత, కుమారులు జై, హర్ష్ ఉన్నారు.  

ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్‌గా కెరియర్‌ను ఆరంభించిన పరేఖ్‌కు కెమెరాలంటే తెగ పిచ్చి. వాటిపై విపరీతమైన వ్యామోహం పెంచుకున్న ఆయన కెమెరాల సేకరణను అలవాటుగా మార్చుకున్నారు. ఈ క్రమంలో 2,634 పురాతన కెమెరాలు సేకరించినందుకు గాను 2003లో గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించారు. ఆ తర్వాత పదేళ్లకు తన రికార్డును తానే బద్దలుగొట్టారు. 4,425 కెమెరాలు సేకరించినందుకు గాను 2013లో మరోమారు గిన్నిస్ రికార్డ్స్‌లో మరోమారు చోటు దక్కించుకున్నారు. 

పరేఖ్ 1977లో కెమెరాల సేకరణను అలవాటుగా మార్చుకున్నారు. ఆ తర్వాత కష్టనష్టాలకోర్చి ప్రపంచవ్యాప్తంగా వివిధ తయారీదారుల నుంచి వివిధ ఆకారాల్లో ఉన్న కెమెరాలను సేకరించడం మొదలుపెట్టారు. ఆయన వద్ద లీకా, రోలిఫ్లెక్స్, జీస్, లినోఫ్, కెనాన్, నికాన్, కొడక్ కంపెనీల కెమెరాలున్నాయి. అలాగే, 1934లో జర్మనీ కంపెనీ తయారు చేసిన అత్యంత అరుదైన లీకా 250 కెమెరా కూడా ఉంది. దీంతోపాటు మరో అరుదైన జర్మన్ తయారీ కెమెరా ‘బెస్సా II’ కూడా ఉంది. ఇది 1962లో తయారైంది. ప్రపంచంలోనే అత్యంత తేలికైన, చిన్నదైన ‘టెస్సినా ఎల్’ కెమెరాను కూడా పరేఖ్ సేకరించారు. దీని బరువు 155 గ్రాములు మాత్రమే.

పరేఖ్ తండ్రికి కూడా ఇదే అలవాటు ఉండేది. ఆయన తాను సేకరించిన 600 కెమెరాలను కుమారుడికి ఇచ్చారు. ఇక ఆ తర్వాత నుంచి పరేఖ్ సొంతంగా కెమెరాలను సేకరించడం మొదలుపెట్టారు. అలా దాదాపు 4,500 కెమెరాల వరకు సేకరించారు. ప్రపంచంలోని అన్ని మూలల నుంచి కెమెరాలను సేకరించడంతోపాటు ముంబైలోని ఫ్లీ మార్కెట్, చోర్ బజార్ నుంచి కూడా కెమెరాలను కొనుగోలు చేశారు. 

పరేఖ్ సేకరించిన కెమెరాల్లో 1907 నాటి లెదర్ బౌండ్ రాయల్ పోస్టేజ్ స్టాంప్ కెమెరా ప్రత్యేకమైనది. ఇది ఒకేసారి 15 స్టాప్ సైజ్ ఫొటోలను క్లిక్ చేస్తుంది. అత్యంత ఖరీదైన, అరుదైన కెమెరాలను ఆయన కొనుగోలు చేసినప్పటికీ ఒక్క దానిని కూడా ఆయన విక్రయించలేదు. వాటిని జాగ్రత్తగా సంరక్షిస్తూ వచ్చారు.

More Telugu News