Tollywood: టాలీవుడ్‌లో తీరని విషాదం.. కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత

  • వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న విశ్వనాథ్
  • గత రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన టాప్ డైరెక్టర్
  • అపోలో ఆసుపత్రికి తరలింపు
  • అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారణ
  • 1930లో బాపట్ల జిల్లా పెద పులిపర్రులో జన్మించిన విశ్వనాథ్
Tollywood Director K Vishwanath Passed Away

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో తీరని విషాదం నెలకొంది. కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలిసిన తెలుగు చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. విశ్వనాథ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

కె.విశ్వనాథ్‌గా వెండితెరకు పరిచయమైన కాశీనాథుని విశ్వనాథ్ బాపట్ల జిల్లా రేపల్లెలోని పెద పులిపర్రు గ్రామంలో 19 ఫిబ్రవరి 1930లో జన్మించారు. తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యం-సరస్వతమ్మ. గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్, ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు. విశ్వనాథ్ తండ్రి చెన్నైలోని విజయవాహిని స్టూడియోలో పనిచేసేవారు. దీంతో విశ్వనాథ్ డిగ్రీ పూర్తికాగానే అదే స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్‌గా సినీ జీవితాన్ని ప్రారంభించారు.

పాతాళభైరవి సినిమాకు తొలిసారి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 1965లో తొలిసారి ‘ఆత్మగౌరవం’ సినిమాకు దర్శకుడిగా పనిచేశారు. తొలి సినిమాకే నంది అవార్డు అందుకున్నారు. తెలుగులో 50కిపైగా సినిమాలకు దర్శకత్వం వహించిన విశ్వనాథ్ బాలీవుడ్‌లో 9 సినిమాలకు దర్శకత్వం వహించారు. పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు.

దాదాసాహెబ్ పురస్కారం
తెలుగు చిత్ర పరిశ్రమలో ఆణిముత్యాలు అనదగే సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, స్వర్ణకమలం, శ్రుతిలయలు, సిరివెన్నెల, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం వంటి సినిమాలు ఆయన అందించినవే. సినీ రంగంలో ఆయన చేసిన కృషికి గాను 2016లో ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. 

1992లో రఘుపతి వెంకయ్య అవార్డు, అదే ఏడాది పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. స్వాతిముత్యం 59వ ఆస్కార్ అవార్డుల బరిలోనూ నిలిచింది. ఆసియా ఫసిఫిక్ చలనచిత్ర వేడుకల్లో స్వయం కృషి, సాగరసంగమం, సిరివెన్నెల సినిమాలు ప్రదర్శించారు. మాస్కోలో జరిగిన చలనచిత్ర వేడుకల్లో స్వయంకృషి సినిమాను ప్రదర్శించారు. అలాగే స్వరాభిషేకం సినిమాకు ప్రాంతీయ విభాగంలో జాతీయ పురస్కారం లభించింది. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం విశ్వనాథ్‌ను గౌరవ డాక్టరేట్‌తో గౌరవించింది.

More Telugu News