Perni Nani: కోటంరెడ్డిది నమ్మకద్రోహం: పేర్ని నాని

  • కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ ట్రాప్ లో పడ్డారన్న నాని 
  • డిసెంబర్ 25న చంద్రబాబు ఇంటికి వెళ్లారని వెల్లడి 
  • లోకేశ్ తో కూడా టచ్ లో ఉన్నారని విమర్శ
  • తమ ఎమ్మెల్యేలపై తాము నిఘా ఎందుకు పెట్టుకుంటామని వ్యాఖ్య
Perni Nani Sensational Comments on Kotamreddy

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ ట్రాప్ లో పడ్డారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. జగన్ కు కోటంరెడ్డి నమ్మకం ద్రోహం చేశారని, నమ్మి టికెట్ ఇస్తే ఇలా చేయడం తప్పు అని విమర్శించారు. రాజకీయంగా అండదండలు లేని వ్యక్తిని రెండు సార్లు ఎమ్మెల్యేగా చేయడమంటే చిన్న విషయమా? అన్నారు. జగన్ పై చేసిన ఆరోపణలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. 

ఈ రోజు పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ, రాజకీయాల్లో అవకాశ వాదం, పక్క చూపులు మామూలేనని చెప్పారు. ‘‘పిచ్చిమారాజు జగన్.. ‘కోటంరెడ్డి ఎక్కడికీ పోడు.. నా మనిషి’ అని అనుకుంటున్నాడు. కోటంరెడ్డి తన భక్తుడని అనుకుంటున్నారు. నా లాంటి వాళ్లు కోటంరెడ్డిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు’’ అని నాని చెప్పారు.  

‘‘డిసెంబర్ 25న చంద్రబాబు ఇంటికి కోటంరెడ్డి వెళ్లారు. 2 గంటలపాటు మాట్లాడారు. ఎప్పటికప్పుడు చంద్రబాబుతో టచ్ లో ఉన్నారు. ముందునుంచే లోకేశ్ తో ఫోన్ లో మాట్లాడుతున్నారు’’ అని పేర్ని నాని ఆరోపించారు. జగన్ మళ్లీ సీఎం కావాలని నిజంగా కోటంరెడ్డి కోరుకుంటే లోకేశ్ తో టచ్ లో ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు.

‘‘నెల్లూరు నారాయణతో రెగ్యులర్ గా టచ్ లో ఉండాలని కోటంరెడ్డికి చంద్రబాబు చెప్పారట. ఈ విషయాలను ఇంటెలిజెన్స్, పేర్ని నాని చెప్పడం కాదు.. టీడీపీ వాళ్లే చెబుతున్నారు..’’ అని అన్నారు. 

‘‘మా ఎమ్మెల్యేలపై నిఘా మేమెందుకు పెట్టుకుంటాం? ట్యాపింగ్ మేం చేయలేదు. మాకు అంత ఖర్మ ఏంటి? కోటంరెడ్డిది ఫోన్ ట్యాపింగ్ కాదు. రికార్డింగ్ మాత్రమే’’ అని చెప్పారు. మనం నిఖార్సుగా ఉన్నప్పుడు ఎవరు రికార్డు చేసుకుంటే ఏంటి? ఎవరు ట్యాపింగ్ చేస్తే ఏంటి? అని ప్రశ్నించారు.

More Telugu News